నవతెలంగాణ – ఒడిశా: రైళ్ల ప్రమాదం తర్వాత ట్రాక్ పునరుద్ధరణ పనులు యుద్ధప్రాతిపదికన నడుస్తున్నాయి. ఒకదానిపైన మరొకటి ఎక్కిన బోగీలను ఇప్పటికే కష్టపడి తొలగించారు. వీలైనంత తొందరగా ట్రాక్‌ను పునరుద్ధరించేందుకు నిరంతరాయంగా వందలాది మంది కార్మికులు, నిపుణులు శ్రమిస్తున్నారు. ఈ క్రమంలో రైల్వే ట్రాక్ పునరుద్ధరణ పనులను రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా అశ్వినీ వైష్ణవ్ మాట్లాడుతూ.. పాడైన ట్రాక్‌ను ఇవాళ పునరుద్ధరిస్తామని చెప్పారు. బుధవారం ఉదయానికి మిగతా పనులను పూర్తి చేసి రైళ్ల రాకపోకలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ప్రమాదానికి సంబంధించిన కారణాలపై ఇప్పటికే రైల్వే సేఫ్టీ కమిషనర్ దర్యాప్తు చేసి నివేదిక పూర్తి చేశారని.. రిపోర్టు తమకు అందాల్సి ఉందన్నారు. అయితే నివేదిక రావడానికి ముందే బాధ్యులను గుర్తించామని తెలిపారు. ఎలక్ట్రానిక్ ఇంటర్‌లాకింగ్‌ను మార్చడం ద్వారానే ప్రమాదం జరిగిందని చెప్పారు. బాధ్యులను కూడా గుర్తించామని తెలిపారు. అయితే ప్రస్తుతం తమ ఫోకస్ మొత్తం పునరుద్ధరణ పనులపైనే ఉన్నట్లుగా స్పష్టం చేశారు.