సెబీ చైర్‌పర్సన్‌ను విచారించం

Ask the SEBI Chairperson– హిండెన్‌బర్గ్‌ రిపోర్ట్‌పై ఆర్థిక శాఖ వెల్లడి
న్యూఢిల్లీ: పెట్టుబడులు, మార్కెట్ల రెగ్యూలేటరీ సంస్థ సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్స్ఛేంజ్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఇండియా (సెబీ) చైర్‌పర్సన్‌ మాధబి పూరీ బచ్‌పై వచ్చిన తీవ్రమైన ఆరోపణలను ఆర్థిక మంత్రిత్వ శాఖ పెడచెవిన పెడుతోంది. అదానీ కంపెనీలు, విదేశీ ఫండ్‌ కన్సల్టెన్సీ కంపెనీలతో మాధబి బచ్‌, ఆమె భర్తకు ఉన్న సంబంధాలపై ఇటీవల అమెరికన్‌ పరిశోధన సంస్థ హిండెన్‌బర్గ్‌ ఓ కీలక రిపోర్ట్‌ను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ ఆరోపణలను పరిశీలించడానికి ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక ప్యానెల్‌ను ఏర్పాటు చేసే యోచనలో ఉందని కథనాలు వచ్చాయి. కాగా.. దీనిపై మంగళవారం ఆర్థిక శాఖ స్పష్టతనిచ్చింది. మాధబిపై విచారణకు ఎలాంటి ప్యానెల్‌ను ఏర్పాటు చేయడం లేదని వెల్లడించింది. సెబీ చైర్‌పర్సన్‌కు వ్యతిరేకంగా ఆరోపణలు వస్తే మిగితా ఎనిమిది మంది సెబీ బోర్డు సభ్యుల గురించి కూడా ఆలోచించాల్సిందేనని.. అయితే ఆ ఆరోపణల్లో అర్థమే లేదని ఓ సీనియర్‌ అధికారి పేర్కొన్నారు. అదానీ గ్రూప్‌పై గతంలో వచ్చిన ఆరోపణలపై సెబీ తన విచారణను తప్పించుకుందని హిండెన్‌బర్గ్‌ విమర్శించింది. ఈ విషయంలో మాధబి బచ్‌కి, అదానీ కంపెనీలకు, కన్సల్టెన్సీలకు పరస్పర సంబంధాలున్నాయని ఆరోపించింది.
పీఎస్‌బీలకు ముప్పు..!
కన్సల్టెన్సీ సంస్థలు, అదానీ కంపెనీలతో సెబీ చీఫ్‌ మాధబి అంటకాగుతోందనే రిపోర్టులు వాస్తవమైతే ప్రభుత్వ రంగ బ్యాంక్‌లకు ప్రమాదం పొంచి ఉందనే ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. బ్యాంకుల వ్యవహారాల్లో పారదర్శకత, జవాబుదారీతనంగా ఉండటం ద్వారా పెట్టుబడిదారుల విశ్వాసాన్ని పెంపొందించడంలో సెబీ పాత్ర అత్యంత కీలకమైంది. ఈక్విటీ, డెట్‌ మార్కెట్ల నుంచి నిధులను సేకరించే సంస్థల సామర్థ్యాన్ని సెబీ నేరుగా ప్రభావితం చేస్తుంది. ఈ క్రమంలో సెబీ అనుమతులపై బ్యాంక్‌లు ఎక్కువ విశ్వాసం చూపుతాయి. సెబీ ప్రమాణాలకు అనుగుణంగా బ్యాంకులు స్థిరమైన కార్యాచరణతో ఆర్థిక సంక్షోభాల సంభావ్యతను తగ్గిస్తాయి. కార్పొరేట్‌ గవర్నెన్స్‌ నిబంధనలకు బ్యాంక్‌లు కట్టుబడి పని చేస్తాయి. ముఖ్యంగా బ్యాంక్‌ల విలీనాలు, వాటాల విక్రయాలు, నిధుల సమీకరణ, ఇన్షియల్‌ పబ్లిక్‌ ఆఫర్‌ (ఐపీవో), ఎఫ్‌పీఓల్లో సెబీ పాత్ర కీలకంగా ఉంటుంది. సెబీ ప్రమాణాలు లోపిస్తే బ్యాంక్‌లకు ప్రమాదం కలిగించడమే కాక ఆ ప్రభావం భారత ఆర్థిక వ్యవస్థపై తీవ్రంగా ఉంటుంది.

Spread the love