ప‌దేండ్ల తెలంగాణ‌లో మ‌హిళా ఆకాంక్ష‌లు

రాష్ట్రంలో పాఠశాలల పరిస్థితి దారణంగా ఉంది. గ్రామీణ బడుల్లో అమ్మాయిలకు సరైన మరుగుదొడ్లు లేవు. దాంతో చాలా మంది చదువుకు దూరమవుతున్నారుపోరాడి సాధించుకున్న స్వరాష్ట్రం. పదేండ్ల సంబరాలు పూర్తి చేసుకుంటున్నాం. ఉత్సవాలు ఘనంగా జరుపుకుంటున్నాం. ప్రత్యేక తెలంగాణ కోసం జరిగిన ప్రతి పోరాటంలో ఎందరో మహిళలు అగ్రభాగాన నిలిచారు. ఎన్నో ఆశలతో రాష్ట్రం కోసం శ్రమించారు. మరి ఈ పదేండ్లలో ఏం సాధించామన్నదే నేటి ప్రశ్న. కొత్తగా అధికారంలోకి వచ్చిన ప్రభుత్వమైన మహిళల ఆకాంక్షలు నెరవేర్చాలని మహిళా ఉద్యమ నాయకులు కోరుకుంటున్నారు.
విద్యకు ప్రాధాన్యం ఇవ్వాలి
రాష్ట్రంలో పాఠశాలల పరిస్థితి దారణంగా ఉంది. గ్రామీణ బడుల్లో అమ్మాయిలకు సరైన మరుగుదొడ్లు లేవు. దాంతో చాలా మంది చదువుకు దూరమవుతున్నారు. అలాగే మహిళలకు అవకాశాలు తగ్గిపోయాయి. 33శాతం రిజర్వేషన్‌ అన్నారు. దాని గురించి ప్రస్తావించడం లేదు. తెలంగాణ రాష్ట్రం కోసం పురుషులతో సమానంగా మహిళలు కూడా ఉద్యమంలో పాల్గొన్నారు. కానీ రాష్ట్రం వచ్చిన తర్వాత మహిళలకు ఇవ్వాల్సిన గౌరవం, అవకాశాలు ఇవ్వడం లేదు. కాంగ్రెస్‌ ప్రభుత్వం కూడా ఉచిత బస్సు ప్రయాణం మాత్రమే కల్పించింది. మహిళలు ఆర్థికం గా నిలబడేందుకు ఉపాధి అవకాశాలు కల్పించాలి. మరీ ముఖ్యంగా అమ్మాయిలకు విద్య చాలా అవసరం. కనుక ఉచిత విద్యను అమలు చేయాలి. చదువుకుంటే తమ కాళ్ళపై తాము నిలబడ గలుగుతారు. డబుల్‌ బెడ్‌రూం ఇండ్లు అన్నారు. కానీ ఇల్లు కొంత కట్టిన తర్వాత అప్పుడు డబ్బులు ఇస్తామంటున్నారు. దీని వల్ల కూడా చాలా మంది ఇల్లు కట్టించుకోలేకపోతున్నారు. కనుక ఈ సమస్యలన్నీ పరిష్కరిస్తే రాష్ట్రంలో మహిళలు కొంత వరకైనా అభివృద్ధి సాధించగలుగుతారు. – తలమల్ల శ్వేత, ఓయూ జేఏసీ కన్వీనర్‌
సమాన అవకాశాలు కల్పించాలి
రాష్ట్ర ఏర్పడిన తర్వాత మహిళా భద్రత కోసం భరోసా, షీ, టీమ్స్‌ ఉమెన్‌ సేఫ్టివింగ్‌ ఏర్పాటు చేశారు. కానీ వాటి అమలు తీరుపై రివ్యూలు మాత్రం లేవు. పేదలకు డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్లు కట్టించి ఇస్తామని చెప్పారు కానీ అవి పూర్తి స్థాయిలో అమలు కాలేదు. రాష్ట్రంలో ప్రతి జిల్లాకు ఓ మహిళ పారిశ్రామిక కేంద్రాన్ని ఏర్పాటు చేసి ఉపాధి కల్పిస్తామని వాగ్దానం చేసి దాన్ని కూడా అమలు చేయలేదు. చదువుకున్న యువతీ యువకులకు ఉద్యోగాలు ఇవ్వకుండా నిర్లక్ష్యం చేశారు. అందుకే ప్రజలు బీఆర్‌ఎస్‌ను ఓడించారు. కాంగ్రెస్‌ ఎన్నికల ముందు ఆరు గ్యారంటీలను అమలు చేస్తాం అని చెప్పి అధికారంలోకి వచ్చింది. అయితే ఇప్పటి వరకు మూడు గ్యారెంటీలు మాత్రమే అమలు చేసారు. మిగతా మూడు గ్యారెంటీలను వెంటనే అమలు చేయాలి. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి. బెల్ట్‌ షాపులు ఎత్తివేయాలి, దశలవారీగా మద్యాన్ని నియంత్రించాలి, డ్రగ్స్‌ అరికట్టాలి. యువతను చెడు మార్గం పట్టిస్తున్న సైట్లను రద్దు చేయాలి. రిమోట్‌ ఏరియాలో పోలీస్‌ పెట్రోలింగ్‌ ఏర్పాట్లు చేయాలి. స్త్రీ నిర్ణయాల్లో భాగస్వామి కావాలంటే చదువు చాలా ముఖ్యం. స్త్రీలు అక్షరాస్యతలో మెరుగుపడితే ఆర్థికంగా బలపడతారు. అప్పుడే లింగా సమానత్వం సాధ్యం. అందుకే విద్య, వైద్యం, ఉపాధి, రాజకీయ రంగాలలో పురుషులతో సమానంగా మహిళలు అవకాశాలు కల్పించాలి.
– మల్లు లక్ష్మి,
ఐద్వా రాష్ట్ర కార్యదర్శి
మహిళాభివృద్దిపై దృష్టి పెట్టాలి
స్త్రీల సంక్షేమం… సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాలలో వారికిచ్చే ప్రాధాన్యతలోనే ఉంటుంది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనలో మహిళలు కీలక పాత్ర పోషించారు. ప్రత్యేక రాష్ట్రంలో తమ ఆశలు, ఆకాంక్షలు నెరవేరుతాయని ఆశించారు. కానీ ఉద్యమ పార్టీగా చెప్పుకున్న టీఆర్‌ఎస్‌ మహిళల హక్కులు, రక్షణకు ఏమాత్రం ప్రాధాన్యం ఇవ్వలేదు. మహిళా కమిషన్‌ ఏర్పాటుకు మహిళా సంఘాలు తిరిగి ఉద్యమించాల్సి వచ్చింది. ఇప్పుడొచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం కూడా ఆరు నెలలు గడిచినా మహిళ చైర్‌ పర్సన్‌ను నియమించలేదు. రాష్ట్రంలో 95శాతం మహిళలు అసంఘటిత రంగంలో కాంట్రాక్ట్‌ కార్మికులుగా కొనసాగుతున్నారు. 2011లో ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం పార్లమెంటు ముందు ధర్నా నిర్వహించినప్పుడు సాక్షాత్తు కేసీఆర్‌ పాల్గొని కాంట్రాక్టు కార్మికులుగా ఉన్న మహిళలందరినీ పర్మినెంట్‌ కార్మికులుగా చేస్తామని హామీ ఇచ్చారు. ఆ హామీని కేసీఆర్‌ నిలబెట్టుకోలేదు. కనీసం రేవంత్‌ రెడ్డి ప్రభుత్వమైనా పర్మినెంట్‌ చేయాలి. వీరికి సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలి. రేషన్‌ షాపుల ద్వారా ఒక్క బియ్యం తప్ప వేరే ఏమీ ఇవ్వడం లేదు. నిత్యవసర సరుకులు అన్నిటిని రేషన్‌ షాపుల ద్వారా సరఫరా చేయాలి. కొత్త రేషన్‌ కార్డులు ఇవ్వాలి. పెరుగుతున్న ధరల ప్రభావం మహిళలపై తీవ్రంగా ఉంది. సరైన ఆహారం అందక తల్లి, పిల్లలు రక్తహీనతతో బాధపడుతున్నారు. మహిళా సాధికారత కేవలం సంక్షేమ పథకాల ద్వారా సాధ్యం కాదు. అన్ని రంగాలో స్త్రీలకు అవకాశాలను కల్పించాలి. విద్యా, ఉద్యోగ, జీవనంలో మెరుగుదలకు కృషి చేస్తేనే సాధ్యం. రాష్ట్రంలో స్త్రీలపై హింస పెరుగుతుందని నేషనల్‌ క్రైమ్‌ రిపోర్ట్స్‌ చెబుతున్నాయి. వీటిపై చర్యలు తీసుకోవాలి. హింసకు కారణమవుతున్న మద్యాన్ని నియంత్రించాలి. దశాబ్ది ఉత్సవాల సందర్భంగా మహిళా చట్టాలు అమలవుతున్న తీరును, మహిళల సంక్షేమాన్ని, వారికిచ్చే సామాజిక, ఆర్థిక, రాజకీయ ప్రాధాన్యత గురించి ప్రభుత్వం ఆలోచించి సత్వర చర్యలు చేపట్టాలి.
– జి. ఝాన్సీ. తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు, పీఓడబ్ల్యూ
సమస్యలు పరిష్కరిస్తేనే…
రాష్ట్రం వస్తే తమకు న్యాయం జరుగుతుందని స్కీంవర్కర్లు చాలా ఆశలు పెట్టుకున్నారు. కానీ అది ఆచరణలో లేదు. కనీస వేతనం, పర్మినెంట్‌ కాదు కదా కనీసం నెల నెలా జీతం కూడా రావడం లేదు. రాష్ట్రం రాక ముందు అందరూ అద్భుతాలు జరుగుతాయనుకున్నారు. కానీ అసలేం జరగలేదు. అయితే గతంలో కనీసం ప్రభుత్వాన్ని కలిసి సమస్యలు చెప్పుకునే అవకాశం కూడా ఉండేది కాదు. కానీ ఇప్పుడు కాంగ్రెస్‌ వచ్చిన తర్వాత మహిళా కార్మికుల బాధలు వింటున్నారు. వినడంతో పాటు సమస్యలు పరిష్కరించడంపై దృష్టి పెట్టాలి. గ్రామీణ ప్రాంతాల్లో కోటి మంది మహిళలు పొదుపు సంఘాల్లో ఉన్నారు. కానీ వాళ్ళ కోసం పని చేస్తున్న కార్మికులకు మాత్రం కనీస వేతనం లేదు. వీటితో పాటు అదనపు పనులు కూడా చేయించుకుంటున్నారు. కార్మికులందరూ కాంట్రాక్టర్లు చెప్పినట్టు వినాల్సి వస్తుంది. వీరిపై ప్రభుత్వ పర్యవేక్షణ లేదు. మహిళా కార్మికులకు మౌలిక సదుపాయాలు లేవు. ప్రభుత్వ ఆఫీసుల్లో కూడా లైంగిక వేధింపుల నిరోధక కమిటీలు ఏర్పాటు చేయాలి. అడ్డాలపై భవన నిర్మాణ కార్మికుల్లో కూడా మహిళలు పెద్ద ఎత్తున ఉన్నారు. వారికి కనీస సౌకర్యాలు కల్పించాలి. దశాబ్ది ఉత్సవాలు జరపడంతో పాటు ప్రభుత్వం వర్కింగ్‌ మహిళ సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలి.
– ఎస్‌.రమ, సీఐటీయూ, శ్రామిక మహిళా రాష్ట్ర కన్వీనర్‌

Spread the love