మణిపుర్ పోలీసు కమాండోలను కాపాడిన అస్సాం రైఫిల్స్‌

నవతెలంగాణ ఇంఫాల్‌: చొరబాటుదారుల ఉచ్చులో చిక్కుకున్న మణిపుర్ పోలీసు కమాండోల (Manipur Police commandos )ను అస్సాం రైఫిల్స్‌ (Assam Rifles) బృందం కాపాడింది. కొండపై నుంచి బుల్లెట్ల వర్షం కురుస్తుంటే అస్సాం రైఫిల్స్‌ డేరింగ్‌ ఆపరేషన్‌ చేపట్టి వారిని రక్షించింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి. వివరాల్లోకి వెళ్లితే… అల్లర్లతో అట్టుడికినరం మణిపుర్‌ (Manipur)లో ఇటీవల ఓ సీనియర్‌ పోలీసు అధికారి దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. మోరే ప్రాంతంలో హెలిపాడ్ నిర్మాణాన్ని పర్యవేక్షిస్తున్న సబ్‌ డివిజనల్‌ అధికారి చింగ్తం ఆనంద్‌ను చొరబాటుదారులు కాల్చి చంపారు. ఈ ఘటన నేపథ్యంలో మోరే ప్రాంతానికి అదనపు బలగాలను కేటాయించారు. ఈ క్రమంలోనే అక్టోబరు 31న మణిపుర్‌ పోలీస్‌ కమాండోల కాన్వాయ్‌ మోరేకు వెళ్తుండగా.. చొరబాటుదారులు వారిపై మెరుపుదాడికి పాల్పడ్డారు.
తెంగ్నౌపాల్‌ జిల్లాలో ఇంఫాల్‌-మోరే జాతీయ రహదారిపై ఈ ఘటన చోటుచేసుకుంది. కొండలపై దాక్కున్న చొరబాటుదారులు.. కమాండోల కాన్వాయ్‌ హైవే మూలమలుపు వద్దకు రాగానే బుల్లెట్ల వర్షం కురిపించారు. ఈ ఊహించని పరిణామంతో కమాండోలు వాహనం నుంచి దిగి చొరబాటుదారులను ప్రతిఘటించేందుకు విఫలయత్నం చేశారు. అయితే.. కాల్పుల మోత తీవ్రంగా ఉండటంతో వారు అక్కడే చిక్కుకుపోయారు.
అస్సాం రైఫిల్స్‌ బృందం ఈ దాడిని గుర్తించింది. తక్షణమే స్పందించి మణిపుర్‌ పోలీసులకు సాయం అందించింది. ఓ వైపు బుల్లెట్లు దూసుకొస్తుంటే.. సాహసోపేతంగా వారిని వాహనంలోకి ఎక్కించుకుని అక్కడి నుంచి వేగంగా వెళ్లిపోయింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు బయటకు రాగా.. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఈ దాడిలో ముగ్గురు కమాండోలు గాయపడగా.. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.

Spread the love