– గాయాలతో బయటపడిన మాజీ అధ్యక్షులు
– ఎన్నికల ప్రచారంలో కాల్పులు
– దుండగుడ్ని మట్టుపెట్టిన సీక్రెట్ సర్వీస్ హంతకుడు థామస్ మాథ్యూ క్రూక్స్‌గా గుర్తింపు
– ముమ్మరంగా దర్యాప్తు
– ఘటనపై అంతర్జాతీయ సమాజం దిగ్భ్రాంతి ఖండించిన మోడీ, రాహుల్
వాషింగ్టన్ : అమెరికా మాజీ అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ (78)పై హత్యాయత్నం జరిగింది. ఈ ఘటనలో గాయపడిన ట్రంప్ సురక్షితంగా బయటపడ్డారు. అమెరికా కాలమానం ప్రకారం శనివారం సాయంత్రం 6.15 గంటలకు పెన్సిల్వేనియాలోని బట్లర్‌లో ట్రంప్ ఎన్నికల ర్యాలీలో ప్రసంగిస్తుండగా దండగుడు ఆయనపై కాల్పులు జరిపాడు. అమెరికా సీక్రెట్ సర్వీస్ సిబ్బంది ట్రంప్‌ను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. కాల్పుల ఘటనలో గాయపడిన ట్రంప్ ముఖంపై రక్తం కారడం కన్పించింది. కాల్పులకు తెగబడిన దుండగుడిని సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు మట్టుపెట్టారు. అతనిని పెన్సిల్వేనియాలోని బెథెల్ పార్కుకు చెందిన 20 సంవత్సరాల థామస్ మాథ్యూ క్రూక్స్‌గా గుర్తించారు. ఘటనా స్థలం నుండి అధికారులు ఒక ఆర్మాలైట్ రైఫిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. కాల్పుల ఘటనలో ఒక ప్రేక్షకుడు కూడా చనిపోయాడని, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారని అసోసియేటెడ్ ప్రెస్ వార్తాసంస్థ తెలిపింది. త్వరలో జరగబోయే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా ట్రంప్ పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఘటన అనంతరం ట్రంప్ సామాజిక మాధ్యమంలో ఓ ప్రకటన విడుదల చేశారు. ‘నా ఎడమ చెవి పైన గాయమైంది. శబ్దం వినపడగానే ఏదో జరిగిందని అర్థమైంది. కాల్పుల శబ్దాలు వినిపించాయి. నా చర్మంలో తూటా దిగిందని అనుకున్నాను. చాలా రక్తం కారింది’ అని ఆయన తెలిపారు. కాల్పుల ఘటన నేపథ్యంలో సీక్రెట్ సర్వీస్, స్థానిక పోలీసులు, ఎఫ్‌బీఐ సంయుక్తంగా దర్యాప్తు ప్రారంభించాయి.
పార్టీ సదస్సుకు ముందు…
విస్కోన్సిస్‌లోని మిల్క్‌వాకీలో మరో రెండు రోజుల్లో రిపబ్లిక్ పార్టీ జాతీయ సదస్సు జరగాల్సి ఉంది. ఆ సదస్సులోనే రాబోయే అధ్యక్ష ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిగా ట్రంప్‌ను అధికారికంగా నామినేట్ చేస్తారు. కాల్పుల ఘటన అనంతరం రిపబ్లికన్ పార్టీ జాతీయ కమిటీ, ట్రంప్ ప్రచారకర్తలు సంయుక్తంగా ఒక ప్రకటన చేస్తూ ‘మిల్క్‌వాకీలో మీతో కలవాలని ట్రంప్ కోరుకుంటున్నారు. సదస్సు యాథావిధిగా జరుగుతుంది. అమెరికాకు 47వ అధ్యక్షుడిగా పనిచేసేందుకు ఈ సదస్సు ఆయనను నామినేట్ చేస్తుంది’ అని తెలిపారు.
ఎవరీ క్రూక్స్ ?
ట్రంప్‌పై హత్యాయత్నం చేసిన 20 సంవత్సరాల థామస్ మాథ్యూ క్రూక్స్ పెన్సిల్వేనియాలోని బెథెల్ పార్కుకు చెందినవాడు. 2021లో డెమొక్రాట్లకు అనుబంధంగా పనిచేసే ప్రోగ్రెసివ్ టర్న్‌ఔట్ ప్రాజెక్టుకు పదిహేను డాలర్లు విరాళంగా ఇచ్చాడు. ప్రభుత్వ ఓటింగ్ రికార్డుల ప్రకారం ఇతను రిపబ్లికన్ పార్టీ మద్దతుదారుగా తన పేరును నమోదు చేసుకున్నాడు. ప్రస్తుతం అతని ఇంటి వద్ద భారీగా పోలీసులను మోహరించారు. క్రూక్స్‌కు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో ఇప్పటికే వైరల్ అయ్యాయి. కాల్పులకు ముందు అతను రికార్డు చేసినట్లు చెబుతున్న ఓ వీడియో కూడా సామాజిక మాధ్యమాలలో చక్కర్లు కొడుతోంది. రిపబ్లికన్ పార్టీని, ట్రంప్‌ను తాను ద్వేషిస్తున్నానని అతను అందులో చెప్పాడు.
లింకన్ నుంచి ట్రంప్ వరకూ….
హత్యలు, దాడులతో రక్తమోడిన అగ్రరాజ్యం
అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడిపై, అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులపై దాడి జరగడం ఇది మొదటిసారి ఏమీ కాదు. దేశాధ్యక్షులు, మాజీ అధ్యక్షులు, అధ్యక్ష ఎన్నికల క్షేత్రంలో నిలిచిన అభ్యర్థులే లక్ష్యంగా గతంలో అనేక రాజకీయ హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. ఆ వివరాలు…
కామెడీ షోకు హాజరైనప్పుడు…
హత్యకు గురైన తొలి అమెరికా అధ్యక్షుడు అబ్రహం లింకన్. 1865 ఏప్రిల్ 14న ఆయనను జాన్ విల్కెస్ బూత్ కాల్చి చంపాడు. లింకన్, ఆయన భార్య మేరీ టాడ్ లింకన్ వాషింగ్టన్‌లోని ఫోర్డ్స్ థియేటర్‌లో ‘అవర్ అమెరికన్ కజిన్’ అనే కామెడీ షోకు హాజరైన సమయంలో దాడి జరిగింది. తల వెనుక తీవ్ర గాయాలైన లింకన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. నల్ల జాతీయుల హక్కులకు మద్దతు ఇవ్వడమే లింకన్ హత్యకు కారణమని తేలింది. లింకన్ మరణానంతరం ఉపాధ్యక్షుడు అండ్రూ జాన్సన్ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించారు. లింకన్‌పై దాడి జరిగిన నెలలోనే 26వ తేదీన వర్జీనియాలోని బౌలింగ్ గ్రీన్ సమీపంలో ధాన్యపు కొట్టులో దాక్కున్న బూత్‌ను కాల్చి చంపారు.
బాధ్యతలు స్వీకరించిన ఆరు నెలలకే…
అమెరికా 20వ అధ్యక్షుడైన అమెస్ గార్‌ఫీల్డ్‌ను హత్య చేశారు. పదవీ బాధ్యతలు స్వీకరించిన ఆరు నెలలకే ఆయన హత్యకు గురయ్యారు. 1881 జూలై 2న న్యూజిలాండ్ వెళ్లేందుకు వాషింగ్టన్ రైల్వే స్టేషన్‌లో రైలు కోసం నడుస్తుండగా ఛార్లెస్ గిటౌ అనే వ్యక్తి ఆయనపై కాల్పులు జరిపాడు. గార్‌ఫీల్డ్ ఛాతిలో దిగబడిన తూటాను ఓ పరికరంతో కనిపెట్టేందుకు టెలిఫోన్‌ను కనుగొన్న అలగ్జాండర్ గ్రహం బెల్ చేసిన ప్రయత్నం ఫలించలేదు. ఈ పరికరాన్ని దేశాధ్యక్షుడి కోసం ప్రత్యేకంగా తయారు చేశారు. కాల్పుల ఘటనలో తీవ్రంగా గాయపడిన గార్‌ఫీల్డ్ అనేక వారాల పాటు శ్వేతసౌధంలోనే చికిత్స పొందారు. చివరికి న్యూజెర్సీ తీరానికి తరలిస్తుండగా సెప్టెంబరులో చనిపోయారు. గిటౌను నేరస్తుడిగా నిర్థారించి 1982లో ఉరి తీశారు.
ప్రజలతో కరచాలనం చేస్తుండగా…
అమెరికా 25వ అధ్యక్షుడైన విలియం మెకిన్లే 1901 సెప్టెంబర్ 1న న్యూయార్క్‌లోని బఫెలోలో హత్యకు గురయ్యారు. ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన అనంతరం వారితో కరచాలనం చేస్తుండగా 28 సంవత్సరాల నిరుద్యోగ వైద్యుడు లియాన్ ఎఫ్ జోల్గోజ్ ఆయన ఛాతిపై పాయింట్-బ్లాంక్ రేంజ్‌లో రెండుసార్లు కాల్పులు జరిపాడు. మెకిన్లే కోలుకుంటారని వైద్యులు భావించినప్పటికీ బులెట్ గాయం చుట్టూ తీవ్రమైన ఇన్‌ఫెక్షన్ సోకడంతో సెప్టెంబర్ 14న ప్రాణాలు కోల్పోయారు. అదే ఏడాది అక్టోబర్ 29న జోల్గోజ్‌ను దోషిగా నిర్థారించి ఎలక్ట్రిక్ కుర్చీలో కూర్చోబెట్టి హతమార్చారు.
భార్యతో కలిసి పర్యటిస్తుండగా…
1965 నవంబర్‌లో 35వ అధ్యక్షుడైన జాన్ ఎఫ్ కెన్నడీ తన సతీమణి జాక్వెలిన్ కెన్నడీతో కలిసి డల్లాస్‌లో పర్యటిస్తుండగా మాటున దాగిన హంతకుడు లీ ఆర్వీ ఆస్వాయిడ్ అత్యంత శక్తివంతమైన తుపాకీతో కాల్చాడు. తీవ్రంగా గాయపడిన కెన్నడీని పర్‌క్లాండ్ ఆస్పత్రికి తరలించగా అక్కడ ఆయన కన్నుమూశారు. ఘటన జరిగిన వెంటనే పోలీసులు టెక్సాస్ పాఠశాల పుస్తకాలు భద్రపరిచే కేంద్రం సమీపంలోని క్షౌరశాలలో ఆస్వాయిడ్‌ను పట్టుకున్నారు. హంతకుడిని డల్లాస్ నైట్‌క్లబ్ యజమాని జాక్ రూబీ కాల్చి చంపాడు.
దాడులు జరిగింది వీరి పైనే
అమెరికా 32వ అధ్యక్షుడు ఫ్రాంక్లిన్ రూజ్‌వెల్ట్ 1933 ఫిబ్రవరిలో మియామీలో ప్రసంగిస్తుండగా కాల్పులు జరిగాయి. ఈ ఘటన నుండి రూజ్‌వెల్ట్ తప్పించుకున్నప్పటికీ చికాగో మేయర్ ఆంటన్ సెర్మాక్ చనిపోయారు. ఘటనకు బాధ్యుడైన జంగారాకు మరణశిక్ష విధించారు. 1950లో దేశానికి 33వ అధ్యక్షుడిగా వ్యవహరించిన హారీ ఎస్. ట్రూమన్ నివసిస్తున్న బ్లార్ హౌస్‌లోకి ఇద్దరు సాయుధులు ప్రవేశించి కాల్పులు జరిపారు. ట్రూమన్ తప్పించుకున్నప్పటికీ ఎదురు కాల్పుల్లో అధ్యక్ష భవనం పోలీసు, ఒక దుండగుడు చనిపోయారు. శ్వేతసౌధానికి చెందిన ఇద్దరు పోలీసులు గాయపడ్డారు. 1975లో అమెరికా 38వ అధ్యక్షుడైన గారీ ఫోర్డ్ కొన్ని వారాల వ్యవధిలోనే రెండు హత్యాయత్నాల నుండి తప్పించుకున్నారు. ఇక 40వ అధ్యక్షుడైన రోనాల్డ్ రీగన్ 1981 మార్చిలో వాషింగ్టన్ డీసీలో తన ప్రసంగాన్ని ముగించి, వాహనం వైపు నడిచి వెళుతుండగా జనంలో ఉన్న జాన్ హింక్లీ జూనియర్ కాల్పులు జరిపాడు. ఈ సంఘటన నుండి ఆయన కోలుకున్నప్పటికీ మరో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. అమెరికాకు 43వ అధ్యక్షుడిగా పనిచేసిన జార్జ్ బుష్ 2005లో జార్జియా అధ్యక్షుడు మిఖాయిల్ సాకష్వీతో కలిసి బిల్సీలో ఓ ర్యాలీకి హాజరు కాగా ఆయనపై చేతి గ్రెనేడ్ విసిరారు.
అయితే అది పేలకపోవడంతో ఎవరూ గాయపడలేదు. నిందితుడైన వ్లాదిమిర్ అరుతియునియన్‌కు జీవిత ఖైదు శిక్ష పడింది. రెండుసార్లు దేశాధ్యక్షుడిగా పనిచేసి, మూడోసారి పోటీకి దిగిన థియొడోర్ రూజ్‌వెల్ట్‌పై ప్రచార సందర్భంగా 1912లో మిల్వాకీలో కాల్పులు జరిగాయి. అయితే ఆయనకు తీవ్రమైన గాయాలేవీ కాలేదు. 1968లో అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన రాబర్ట్ కెన్నడీని లాస్ ఏంజెల్స్ హోటల్‌లో హత్య చేశారు. ఈ ఘటనకు ఐదు సంవత్సరాల ముందు సోదరుడైన జాన్ ఎఫ్.కెన్నడీ హత్యకు గురయ్యారు. 1972లో డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థిత్వం కోసం పోటీపడిన జార్జ్ వాలస్‌పై కాల్పులు జరిగాయి.
ఆందోళన వ్యక్తం చేసిన మోడీ, రాహుల్
డొనాల్డ్ ట్రంప్‌పై జరిగిన దాడిపై ప్రధాని నరేంద్ర మోడీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. రాజకీయాలు, ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదని ఆయన తెలిపారు. ‘నా స్నేహితుడు ట్రంప్‌పై జరిగిన దాడి నన్ను తీవ్ర ఆందోళనకు గురిచేసింది. ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నాను. రాజకీయాలు, ప్రజాస్వామ్యంలో హింసకు చోటు లేదు. ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను’ అని సామాజిక మాధ్యమం ఎక్స్‌లో మోడీ పేర్కొన్నారు. ట్రంప్‌పై జరిగిన హత్యాయత్నంపై లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి చర్యలను తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉన్నదని చెప్పారు. ట్రంప్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే కూడా కాల్పుల ఘటనను ఖండించారు.
ఏం జరిగింది?
ర్యాలీకి హాజరైన ప్రజానీకం కరతాళధ్వనులు చేస్తుండగా, నేపథ్యంలో ‘అమెరికాను దేవుడు ఆశీర్వదిస్తాడు’ అంటూ పాట విన్పిస్తుండగా ఒక్కసారిగా కలకలం రేగింది. ట్రంప్ తన ఎన్నికల ప్రసంగాన్ని ప్రారంభిస్తూ జో బైడెన్ ప్రభుత్వ హయాంలో సరిహద్దులను అక్రమంగా దాటుతున్నారని చూపే చార్టును ప్రదర్శించారు. ఇంతలో హఠాత్తుగా ఐదుసార్లు కాల్పులు జరిపిన శబ్దాలు విన్పించాయి. ఒక తుపాకీ గుండు ట్రంప్ చెవికి తగలడంతో ఆయన గాయపడ్డారు. వెంటనే అప్రమత్తమైన సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు ట్రంప్ వద్దకు వెళ్లి కింద కూర్చోవాలని సూచించారు. అక్కడ ఉన్న జనం కూడా ఒక్కసారిగా కింద కూర్చున్నారు. ఆ సమయంలో మైదానంలో నిశ్శబ్దం అలముకొంది. అప్పుడప్పుడు కొన్ని అరుపులు వినిపించాయి. ట్రంప్‌ను సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు చుట్టుముట్టి ఆయనకు రక్షణగా నిలిచారు. ట్రంప్ మాత్రం దీనిని పట్టించుకోకుండా మద్దతుదారుల ‘అమెరికా…అమెరికా…అమెరికా’ నినాదాల మధ్య పిడికిలిని మూడుసార్లు పైకెత్తి ‘ఫైట్’ అంటూ నినదించారు.
అనంతరం ఆయన వేదిక దిగి అక్కడ వేచివున్న వాహనంలో ఆస్పత్రికి వెళ్లిపోయారు. ట్రంప్ ప్రసంగించే వేదికకు 130 గజాల దూరం నుండి దాడి జరిగిందని తెలుస్తోంది. హంతకుడు అక్కడ ఉన్న ఓ తయారీ కేంద్రం పై నుండి కాల్పులు జరిపాడు. అక్కడి నుండి ట్రంప్ ప్రసంగించాల్సిన ప్రదేశం ఫుట్‌బాల్ మైదానం పొడవు కంటే కొంచెం ఎక్కువగా ఉంటుంది. అంటే కాల్పులు జరిపిన వ్యక్తికి ట్రంప్ స్పష్టంగా కన్పించారన్న మాట. బహిరంగ ప్రదేశమైన బట్లర్ వ్యవసాయ ప్రదర్శన మైదానంలో ర్యాలీ జరిగింది. అక్కడ ఉన్నవన్నీ బహిరంగ క్షేత్రాలేనని న్యూయార్క్ పోస్ట్ తెలిపింది.దుండగుడిని మట్టుపెట్టేందుకు అమెరికా దళాలు వేదిక సమీపంలోని మరో భవనం పైనుండి కాల్పులు జరిపాయి.
కాల్పుల అనంతరం ఆ ప్రదేశంలో దుండగుడి మృతదేహం లభించింది. దుండగుడు వేదిక పైకి కాల్పులు జరపడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోందని ఎఫ్‌బీఐ ప్రత్యేక ఏజెంట్ ఇన్‌ఛార్జ్ కెవిన్ రోజెక్ తెలిపారు.
ఈ కేసును ఎఫ్‌బీఐ సీరియస్‌గా తీసుకొని దర్యాప్తును ముమ్మరం చేసింది. ఘటనపై విచారణకు సీక్రెట్ సర్వీస్‌తో కలిసి పని చేస్తున్నామని అమెరికా హోం ల్యాండ్ సెక్యూరిటీ సెక్రటరీ అలెజాండ్రో మయోర్కాస్ చెప్పారు. విచారణకు హాజరు కావా ల్సింది గా సీక్రెట్ సర్వీస్ డైరెక్టర్ కింబర్లీ చీటిల్‌ను కోరారు.
ప్రత్యక్షసాక్షి ఏమన్నారంటే…
ట్రంప్ ప్రసంగం ప్రారంభించిన ఐదు నుండి ఏడు నిమిషాల తర్వాత ఓ వ్యక్తి సమీపంలో ఉన్న భవనం పైకి ఎక్కడం చూశానని, అతని చేతిలో తుపాకీ ఉన్నదని ప్రత్యక్షసాక్షి ఒకరు బీబీసీకి చెప్పారు. ఆ సమయంలో తాను, తన స్నేహితులు అధికారులకు సమాచారం ఇచ్చేందుకు ప్రయత్నించామని తెలిపారు.
అమెరికాలో హింసకు తావు లేదు : బైడెన్
కాల్పుల ఘటనను ఖండించిన పలువురు ప్రపంచ నేతలు
‘ఈ తరహా హింసకు అమెరికాలో తావు లేదు’ అని దేశాధ్యక్షుడు జో బైడెన్ వ్యాఖ్యానించారు. ఈ ఘటనను ఖండించడానికి ఒకే జాతిగా తామంతా ఏకమవ్వాలని చెప్పారు. కాల్పులపై తనకు సమాచారం అందించారని అంటూ తన ప్రత్యర్థిని రక్షించిన సీక్రెట్ సర్వీస్‌ను అభినందించారు. ఘటన నేపథ్యంలో బైడెన్ తన ఎన్నికల ప్రచార కార్యక్రమాలను, రాజకీయ అడ్వర్‌టైజ్‌మెంట్లను నిలిపివేశారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ట్రంప్‌తో మాట్లాడారు..
కాగా కాల్పుల ఘటనను పలువురు ప్రపంచ నేతలు తీవ్రంగా ఖండించారు. అమెరికా మాజీ అధ్యక్షులు బరాక్ ఒబామా, జార్జ్ బుష్, బిల్ క్లింటన్, కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడ్యూ, బ్రిటన్ ప్రధాని కెయిర్ స్టార్మర్, ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోనీ ఆల్బానీస్, ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్‌స్కీ, హంగరీ ప్రధాని విక్టర్ ఆర్బన్, ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ తదితరులు ఘటనపై విచారం వ్యక్తం చేస్తూ తీవ్రంగా ఖండించారు.