ఈ ఏడాదిలో అసెంబ్లీ 14 రోజులేనా?

– బీజేపీ ఎమ్మెల్యేలకు రూమ్‌ ఇవ్వకపోవడం దారుణం : ఈటల
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
అసెంబ్లీ సమావేశాలను ఈ ఏడాది 14 రోజుల పాటే నిర్వహించడం దారుణమని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ విమర్శించారు. గతంలో 55 నుంచి 60 రోజులు నడిచేవని గుర్తుచేశారు. మంగళవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. నాలుగున్నరేండ్ల పాటు అన్ని పార్టీల సభ్యులూ సహకరించారనీ, తెలంగాణలో ప్రశాంతంగా సమావేశాలు నిర్శహిస్తున్నామనే కితాబు వస్తుందని స్పీకర్‌ చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. గతంలో అన్ని పార్టీల సభ్యులకూ అసెంబ్లీ ఆవరణంలో రూములను కేటాయించిన విషయాన్ని గుర్తుచేశారు. బీజేపీ ఎమ్మెల్యేలం ముగ్గురమున్నా రూమ్‌ కేటాయించకపోవడం అన్యాయమన్నారు. తమ హక్కులను కాపాడాల్సిన స్పీకర్‌ బాధ్యతను మరిచారనీ, దీంతో తాము సెక్యూరిటీల రూముల్లో కూర్చొని నోట్లు రాసుకున్నామని తెలిపారు. అధికార పార్టీ సభ్యులు ఎంత సేపు మాట్లాడినా అవకాశమిచ్చారనీ, తాము లేవగానే సీఎం, మంత్రుల వైపు చూస్తూ స్పీకర్‌ బెల్‌ మోగించడం దారుణమని విమర్శించారు. బీఆర్‌ఎస్‌, ఎంఐఎం పార్టీలు మిత్రపక్షాలు అని సీఎం అంటున్నారన్నారు. అలాంటప్పుడు సభలో ప్రతిపక్ష పార్టీ ఎలా అవుతుందని ప్రశ్నించారు. పోలీసులకు, ఆఫీసర్లకు ఫోన్లు చేసేవారిగా ఎమ్మెల్యేలను మార్చివేశారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిని బట్టే సీఎం కేసీఆర్‌కు చట్టసభల మీద విశ్వాసం లేదని అర్థమవుతున్నదని విమర్శించారు. వరద బాధితులకు సహాయం చేయాలని అడిగితే తాము 100 మంది సభ్యులమున్నామంటూ ర్యాగింగ్‌ చేయడం దారుణమన్నారు. కాగ్‌ రిపోర్టు ఎత్తి చూపిన లోపాలపై కనీసం చర్చకుపెట్టకపోవడాన్ని తప్పుబట్టారు. కోకాపేటలో రూ.100 కోట్లకు ఎకరం అమ్మడం వెనుక ఏదో లోపాయికారి ఒప్పందం ఉందని ఆరోపించారు. గ్రామాల్లో కూడా రూ.40 లక్షలకు ఎకరం పలుకుతున్నదనీ, కంపెనీల కోసం రైతుల నుంచి సేకరిస్తున్న భూములకు రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షల వరకే పరిహారం ఇవ్వడమేంటని ప్రశ్నించారు. దళితుల నుంచి 5800 అసైన్డ్‌ భూములను బెదిరించి ప్రభుత్వం లాక్కున్నదని విమర్శించారు. కలెక్టర్లకు టార్గెట్లు పెట్టి భూములను అమ్మించడం దారుణమన్నారు.

Spread the love