సాగుదారులకే భరోసా

Assurance to the cultivators– రైతుభరోసా అమలుపై మెజార్టీ అభిప్రాయం
– ఖమ్మం కలెక్టరేట్‌లో ఉమ్మడి జిల్లా విస్తృత సమావేశం
– క్యాబినెట్‌ సబ్‌కమిటీ నేతృత్వంలో అభిప్రాయ సేకరణ
– హాజరైన కన్వీనర్‌, డిప్యూటీ సీఎం భట్టి, సభ్యులు తుమ్మల, పొంగులేటి
– రైతులు, రైతు సంఘాల నాయకులు వందలాది మంది అభిప్రాయాలు వెల్లడి
– పూర్తిస్థాయి బడ్జెట్‌ సమయంలో విధివిధానాలు : భట్టి
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
ఎవరైతే భూమి సాగు చేస్తున్నారో.. ఎన్ని ఎకరాలు సేద్యం చేస్తున్నారో.. అంత మొత్తానికి ‘రైతుభరోసా’ ఇవ్వాలని.. కౌలు రైతా? పట్టేదారా? అనేదానితో నిమిత్తం లేకుండా పంట పెట్టుబడి సహాయం చేయాలని మెజార్టీ అభిప్రాయం వెల్లడైంది. ‘రైతుభరోసా’పై ఉమ్మడి ఖమ్మం జిల్లా విస్తృత సమావేశం ఖమ్మం ఐడీవోసీలో బుధవారం నిర్వహించారు. ‘రైతుభరోసా’ క్యాబినెట్‌ సబ్‌ కమిటీ కన్వీనర్‌, ఉప ముఖ్యమంత్రి, ఆర్థికమంత్రి మల్లు భట్టివిక్రమార్క, సభ్యులు వ్యవసాయ, సహకార, మార్కెటింగ్‌ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచారశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నేతృత్వంలో ఉదయం 10.30 గంటలకు ప్రారంభమైన ఈ సమావేశం మూడు గంటలపాటు కొనసాగింది. వందలాది మంది రైతులు, రైతుసంఘాల నేతలు, రైతు ప్రతినిధులు, లాయర్లు, డాక్టర్లు, శాస్త్రవేత్తలు, జర్నలిస్టులు, వివిధ వర్గాలకు చెందిన అనేక మంది ఈ సమావేశంలో తమ అభిప్రాయాలను వెల్లడించారు.
సాగుదారులందరికీ ‘భరోసా’ ఇవ్వాలి
ఎవరైతే సేద్యం చేస్తున్నారో.. ఎంత మొత్తం సాగు చేస్తున్నారో.. అన్ని ఎకరాలకూ ‘రైతుభరోసా’ పంట పెట్టుబడి సహాయం అందించాలని మెజార్టీ రైతులు, రైతుసంఘాల నేతలు తదితరులు అభిప్రాయపడ్డారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌గా ఉన్నప్పుడు 2011లో కౌలుదారీ చట్టాన్ని అమలు చేశారని, దాన్ని యథాతథంగా అమలు చేయాలని తెలంగాణ రైతుసంఘం నాయకులు కోరారు. ఆ తర్వాత పది ఎకరాలకు కటాఫ్‌ విధిస్తే మంచిదని మెజార్టీ రైతులు అభిప్రాయపడ్డారు. ఇవేవీ లేకుండా పంట ఉత్పత్తులపై బోనస్‌, గతంలో లాగా మెరుగైన పంట దిగుబడి సాధించేందుకు ప్రోత్సాహకంగా ఎరువులు, క్రిమిసంహారక మందులు, డ్రిప్‌ ఇరిగేషన్‌, పైపులైన్లు, వ్యవసాయ యంత్ర పరికరాలకు సబ్సిడీ ఇవ్వాలని కోరారు. రైతుభరోసా, రైతుబీమాతో పాటు పంటనష్ట పరిహారం కూడా చెల్లించాలని కొందరు అడిగారు.
కౌలుదారులకు ఎలా చెల్లించాలి : భట్టి
కౌలు రైతులకు ఎలా చెల్లించాలని మల్లు భట్టివిక్రమార్క రైతులను ప్రశ్నించారు. 2011 కౌలుదారీ చట్టాన్ని ఆచరణలో పెడితే ఇది సాధ్యమని తెలంగాణ రైతుసంఘం ఖమ్మం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు మాదినేని రమేష్‌, బొంతు రాంబాబు సూచించారు. కౌలుదారునికి పంటలపై బోనస్‌ ఇవ్వాలని కొందరు, ఎరువులు, క్రిమిసంహారక మందులకు సహాయం చేయాలని మరికొందరు వివరించారు. ఏడాది కాలపరిమితితో కౌలు రాయించుకునే విధానాన్ని అమలు చేయాలని ఇంకొందరు అభిప్రాయపడ్డారు.
ఆంధ్రా రైతులకు ఇక్కడ ఇవ్వొద్దు..
ఆంధ్రా రైతులకు తెలంగాణలో భూములుంటే ‘రైతుభరోసా’ ఇస్తున్నారని, తెలంగాణ రైతులకు ఆంధ్రాలో ఉంటే మాత్రం ఎలాంటి సహాయం అక్కడి ప్రభుత్వాలు ఇవ్వట్లేదని గుర్తుచేశారు. కాబట్టి ఆంధ్రా రైతులకు ఇచ్చే పెట్టుబడి సహాయాన్ని నిలిపివేయాలని కోరారు. అలాగే రెవిన్యూ, రిజిస్ట్రేషన్‌ శాఖల మధ్య సమన్వయలోపం కారణంగా కన్వర్షన్‌ కాకుండా ఉన్న రియల్‌ ఎస్టేట్‌ భూములు, ఆర్‌ఎస్‌ఆర్‌ పెరిగి డబుల్‌ ఎంట్రీలున్న భూములు, సాగు చేయని ఇతరత్ర భూములకూ రైతుభరోసా కట్‌ చేయాలని దాదాపు అందరూ అభిప్రాయపడ్డారు.
పూర్తిస్థాయి బడ్జెట్‌ సమయంలో రైతుభరోసా విధివిధానాలు: భట్టి
పార్లమెంట్‌ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రప్రభుత్వం ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ ప్రవేశపెట్టాల్సి వచ్చిందని భట్టి గుర్తుచేశారు. కేంద్రం పూర్తిస్థాయి బడ్జెట్‌ ప్రవేశపెట్టిన తర్వాత రాష్ట్రానికి వచ్చే నిధులకు అనుగుణంగా త్వరలోనే పూర్తిస్థాయి బడ్జెట్‌ను రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతుందన్నారు. దీనికి ముందే విధివిధానాల రూపకల్పనపై ప్రభుత్వం క్యాబినెట్‌ సబ్‌కమిటీని తాను (భట్టి) కన్వీనర్‌గా, మంత్రులు తుమ్మల, పొంగులేటి, శ్రీధర్‌బాబు సభ్యులుగా ఈ కమిటీ పనిచేస్తుందన్నారు. పూర్తిస్థాయి బడ్జెట్‌ నాటికి రైతుభరోసా విధివిధానాల రూపకల్పనకు ఈ అభిప్రాయ సేకరణ చేపడుతున్నట్టు వివరించారు.
ఐటీ పేయర్స్‌కు మాత్రమే ‘భరోసా’ ఉండదు: మంత్రి తుమ్మల
ఐటీ రిటర్న్స్‌, రేషన్‌కార్డు లేనివారికి రైతుభరోసా ఇవ్వరనే చర్చ నేపథ్యంలో పలువురు రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. పిల్లల చదువులు, విదేశాలకు వెళ్లాలన్నా.. ఇండ్ల నిర్మాణ రుణాల కోసం రైతులు ఐటీ రిటర్న్స్‌ కలిగి ఉంటారని వివరించారు. దీనిపై మంత్రి తుమ్మల స్పందించారు. ఐటీ పేయర్స్‌కు మాత్రమే భరోసా వర్తించదని సమాధానం ఇచ్చారు. రేషన్‌కార్డుతో నిమిత్తం లేదన్నారు. పేద రైతులకు భరోసా ఇవ్వడానికి ప్రభుత్వం విశాల దృక్పథంతో వ్యవహరిస్తుందని స్పష్టంచేశారు. గతంలో లోపాలు, ఆర్థిక నష్టాలు తలెత్తకుండా చిన్న, సన్నకారు రైతులకు చేయూతనివ్వాలన్నదే ప్రభుత్వ ఉద్దేశ్యమని తెలిపారు.
ప్రభుత్వం ఖర్చు పెట్టే ప్రతి రూపాయీ ప్రజలదే: మంత్రి పొంగులేటి
రాష్ట్రప్రభుత్వం ఖర్చు పెట్టే ప్రతి రూపాయీ వివిధ రూపాల్లో ప్రజలు చెల్లించిందేనని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. గత ప్రభుత్వం ఏ పథకం చేపట్టినా నాలుగు గోడల మధ్య నిర్ణయాలు తీసుకున్నదని, ఎక్కడా ప్రజాభిప్రాయానికి చోటివ్వలేదని విమర్శించారు. ప్రతి పైసాపై లెక్కలు చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. రాష్ట్రంలోని మిగతా తొమ్మిది ఉమ్మడి జిల్లాల్లోనూ ఇదే రకంగా అభిప్రాయం తీసుకుంటామన్నారు. ఎవరికి సాయం చేస్తే రైతులు ఆనందంగా ఉంటారో వివరాలు సేకరించి అమలు చేస్తామన్నారు. ఈ సమావేశంలో ఖమ్మం, మహబూబాబాద్‌ పార్లమెంట్‌ సభ్యులు రామసహాయం రఘురాంరెడ్డి, పోరిక బలరాంనాయక్‌, ఆర్థికశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ కె.రామకృష్ణారావు, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల కలెక్టర్లు ముజమ్మిల్‌ఖాన్‌, జితేష్‌ వి.పాటిల్‌, ఎమ్మెల్యేలు మట్టా రాగమయి, తెల్లం వెంకట్రావు, మాలోత్‌ రాందాస్‌నాయక్‌, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మెన్‌ రాయల నాగేశ్వరరావు, ఖమ్మం, భద్రాద్రి జిల్లాల వ్యవసాయ అధికారులు విజయనిర్మల, బాబూరావు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
పట్టాతో నిమిత్తం లేకుండా సాగు భూములకు ఇవ్వాలి..
మాదినేని రమేష్‌, బొంతు రాంబాబు, తెలంగాణ రైతుసంఘం ఖమ్మం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు పట్టాతో నిమిత్తం లేకుండా సాగు భూములన్నింటికీ, సాగుదారులందరికీ భరోసా, బోనస్‌ ఇవ్వాలి. 2018 డిసెంబర్‌ 12కు ముందున్న పంట రుణాలను మాఫీ చేయాలి. గత ప్రభుత్వం మాఫీని సక్రమంగా అమలు చేయకపోవడం వల్ల ఖమ్మం జిల్లాలో 9వేల మంది, కొత్తగూడెం జిల్లాలో 1600 మంది నష్టపోయారు. కాబట్టి రాష్ట్ర ఏర్పడిన నాటి నుంచి 2023 డిసెంబర్‌ 9కి ముందున్న రుణాలన్నింటినీ మాఫీ చేయాలని కోరుతున్నాం.
సన్నచిన్నకారు రైతులకు ప్రాధాన్యం ఇవ్వాలి
– భాగం హేమంతరావు,రైతుసంఘం నాయకులు
త్వరితగతిన ధరణి పెండింగ్‌ ఫైల్స్‌ను క్లియర్‌ చేసి వీలైనంత ఎక్కువ మంది సాగుదారులకు ఈ ఖరీఫ్‌ సీజన్‌ నుంచే లబ్ది చేకూర్చాలి. గత ప్రభుత్వం రైతుబంధు పేరుతో అన్ని సబ్సిడీలు ఎత్తివేసింది. 0శాతం రుణాలను పూర్తిగా తీసి వేశారు. పంటల బీమా పథకాన్ని త్వరితగతిన అమలు చేయాలి. 25 లక్షలకు పైగా ఉన్న రియల్‌ ఎస్టేట్‌ భూములను రైతుభరోసా కింద తొలగించాలి. వైఎస్‌ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ రకంగానైతే కౌలుదారులకు గుర్తింపు కార్డులు ఇచ్చారో అదే విధంగా ఇప్పుడు కూడా ఇచ్చి ‘భరోసా’ కల్పించాలి. ఆర్బీఐ విధానం ప్రకారం 25 ఎకరాలకు పైబడిన రైతులు పెద్ద రైతుల కిందకు వస్తారు. కాబట్టి సన్న, చిన్నకారు రైతులకు ప్రాధాన్యం ఇవ్వాలి.

Spread the love