మాటలు కరువైతే…

మాటలు కరువైతే...భార్యాభర్తల బంధం అంటే ఒకరినొకరు అర్థం చేసుకువాలి. అలా కాకుండా ఒకరిని ఒకరు విమర్శించు కుంటూ, భర్త భార్యని, భార్య భర్తని తక్కువ చేసి చూస్తే భరించడం చాలా కష్టం. అలాంటి సంసారం సాఫీగా సాగదు. ఆ కుటుంబం లో ఎవరికీ మనశ్శాంతి ఉండదు. ఇద్దరూ ఒకరి పట్ల ఒకరూ ప్రేమగా ఉంటేనే జీవితం హాయిగా ఉంటుంది. ఇప్పుడిదంతా ఎందుకు చెబుతున్నానను కుంటున్నారా? అక్కడికే వస్తున్నా! సరిగ్గా ఇలాంటి సమస్యతోనే వంశీ ఐద్వా దగ్గరకు వచ్చాడు. ఇంతకీ అతని సమస్య ఏంటో మీరే చదవండీ…
‘మేడం నా భార్య పేరు సుజాత, నేను సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తున్నాను. ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులూ లేవు. పిల్లలిద్దరూ ఉదయమే స్కూల్‌కి వెళ్ళి సాయంత్రం వస్తారు. వచ్చీరాగానే ఇంట్లో అరగంట ఉండి ట్యూషన్‌కి వెళ్ళి తిరిగి రాత్రి ఎనిమిది గంటలకు వస్తారు. ఆ తర్వాత తినేసి ఏదైనా రాసుకునేదుంటే పూర్తి చేసుకుంటారు. లేకపోతే పడుకుంటారు. మళ్ళీ రేపు ఉదయం త్వరగా లేవాలి కదా! ఇది రోజూ పిల్లలు చేసే పని.
ఇక నేను ఉదయం ఆఫీస్‌కి వెళితే సాయంత్రం వస్తాను. వచ్చిన తర్వాత సుజాత నాతో సరిగా మాట్లాడదు. రోజూ ఏదో ఒక విషయంపై నాతో అనవసరంగా గొడవ పడుతుంది. ఎంత చెప్పినా పట్టించుకోదు. మా అమ్మా, అక్క వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళతో మాత్రం బాగా మాట్లాడుతుంది. వాళ్ళకు ఏం కావాలన్నా తెచ్చిపెడుతుంది. ఎక్కడికి తీసుకెళ్ళమన్నా తీసుకెళుతుంది. ఓ ఆరు నెలలు వాళ్ళు ఇంటికి రాకపోతే ఫోన్‌ చేసి మరీ పిలుస్తుంది. ‘ఎందుకు రావడం లేదు’ అంటూ అడుగుతుంది. పండగలకు రమ్మని పిలుస్తుంది. ఇలా వాళ్ళతో మాత్రం బాగానే ఉంటుంది. నాతో మాత్రం గొడవ పడుతుంది. తను ఎందుకు ఇలా చేస్తుందో అర్థం కావడం లేదు. ఆమె ఎప్పుడు ఎక్కడికి వెళతానన్నా నేను అడ్డుచెప్పను. నా జీతం మొత్తం కూడా ఆమెకే ఇచ్చేస్తాను. దానితో ఆమెకు కావల్సినవి కొనుక్కుంటుంది. ఇదెందుకు అనవసరంగా కొన్నావు అని కూడా అడగను. ఆమె పొదుపు చేసినా, ఖర్చు చేసినా అడగను. అయినా గొడవ చేస్తుంది. నాకు నరకంలా అనిపిస్తుంది. మా కుటుంబ సభ్యులందరూ ఆమెకే సపోర్ట్‌. ఆమె నాపై గొడవ పడుతుందన్నా ఎవ్వరూ నమ్మరు. పైగా నన్నే తిడతారు. ‘సుజాత చాలా మంచిది, అలాంటి అమ్మాయి నీకు భార్య కావడం నీ అదృష్టం’ అంటుంది మా అక్క. నాతో ఆమెకున్న నమస్య ఏంటో, నాతో ఎందుకు అలా ఉంటుందో తెలుసుకుని నన్ను ఈ నరకం నుండి బయటపడేయండీ’ అని చెప్పుకొచ్చాడు.
అతను చెప్పింది మొత్తం విని సుజాతను పిలిపించి మాట్లాడితే ‘నేను ఆయనతో కావాలని ఎప్పుడూ గొడవ పడలేదు. ఆయన కుటుంబ సభ్యులు వచ్చినా వాళ్ళను నా సొంత వాళ్ళలా చూసుకుంటాను. వాళ్ళు వచ్చినప్పుడు మాత్రం వంశీ ఇంట్లోనే ఉంటాడు. బయటకు తీసుకెళతాడు. కానీ నన్ను, పిల్లల్ని ఎప్పుడైనా బయటకు తీసుకెళ్ళమంటే తీసుకెళ్ళడు. టైం లేదు అంటాడు. అదే వాళ్ళ కుటుంబ సభ్యులు అడిగితే మాత్రం సెలవు పెట్టి మరీ తీసుకెళతాడు. వాళ్ళ ముందు మాత్రం నాతో బాగుంటాడు. నాకు కావల్సింది ఆయనే దగ్గర ఉండి మరీ కొని పెడతాడు. అలా చేయకపోతే నేను ఆయనపై అరుస్తాను. గొడవ పడతాను. నేను ఆ మాత్రం అరవకపోతే నన్ను అస్సలు పట్టించుకోడు. కనీసం తిన్నావా, ఏం చేస్తున్నావు అని కూడా అడగడు. వంశీ చాలా మంచి వాడే. కానీ నేనూ నా పిల్లలు ఆయనా కలిసి రోజులో కనీసం ఐదు నిమిషాలన్నా గడపాలంటే అస్సలు కుదరదు. కనీసం రాత్రిపూటైనా అందరం కలిసి భోజనం చేద్దామంటే వినడు. ‘మీరు తినండి నేను తర్వాత తింటాను’ అంటారు. అప్పుడు నేను కొంచెం గొడవ చేస్తాను. దాంతో మాతో తింటానికి వస్తారు. అందుకే నేను ఆయనతో గొడవ పడతాను. ఏదైనా గొడవ చేస్తేనే ఆయన మాట వింటారు. అదే వాళ్ళ అమ్మ, అక్క వాళ్ళు వస్తే మేం పిలవక ముందే వచ్చి కూర్చుంటారు. వాళ్ళు ఉంటే నాతో ప్రేమగా ఉంటారు. లేదంటే నాతో అస్సలు మాట్లాడరు. అందుకే నేను వాళ్ళను రమ్మని పిలుస్తుంటాను.
నేను పడుకున్న తర్వాత ఎప్పటికో బెడ్‌రూంలోకి వస్తారు. ఇది ఎంత వరకు సరైనది మీరే చెప్పండి. అందుకే ఆయనపై ఎప్పుడూ నేను గొడవ పడుతుంటాను. నాకోసం కనీసం కొంత సమయమైనా కేటాయించాలి కదా. అలా ఉంటే నేనెందుకు గొడవ చేస్తాను. మాకు ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందీ లేదు. నా సమస్య మొత్తం ఆయన నాకు టైం ఇవ్వడం లేదు’ అని చెప్పి బాధపడింది.
ఇదే విషయం గురించి వంశీని అడిగితే ‘నేను రోజూ ఆమెతోనే ఉంటున్నాను. సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత కనీసం బయటకు కూడా వెళ్ళను. రాత్రి 8గంటల తర్వాత ఆన్‌లైన్‌లో పార్ట్‌టైం జాబ్‌ చేస్తాను. కాబట్టి రాత్రి పడుకోవడం కాస్త ఆలస్యమవుతుంది. అప్పటికే సుజాత పడుకుంటుంది. తను ఇంట్లో ఉండి మధ్యాహ్నం ఆన్‌లైన్‌ జాబ్‌ చేస్తుంది. నేను ఎప్పుడైనా ఇంట్లో ఉంటే అప్పుడు ఆమె నాతో మాట్లాడదు. ఆమె వర్క్‌ ఆమె చేసుకుంటుంది. అప్పుడు నేను ఆమెను ఇబ్బంది పెట్టలేదు. నీవు నాకు టైం ఇవ్వడం లేదు అని అడగను’ అని చెప్పాడు.
వారిద్దరి మాటలు విన్న తర్వాత ఇద్దరి మధ్య పెద్దగా గొడవలు ఏమీ లేవు. కేవలం కమ్యూనికేషన్‌ గ్యాప్‌ మాత్రమే కనిపించింది. అందువల్లే ఇద్దరూ గొడవ పడుతున్నారు. మనశ్శాంతి లేకుండా జీవిస్తున్నారనిపించి వారితో ‘ముందు మీరిద్దరూ ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం అలవాటు చేసుకోండి. పిల్లలు ట్యూషన్‌ నుంచి రాగానే అందరూ కలిసి భోజనం చెయ్యడం ఓ పనిగా పెట్టుకోండి. మీరూ, పిల్లలూ కలిసి ప్రతి ఆదివారం సరదాగా బయటకు వెళ్ళండి. పిల్లలు మీకేమైనా చెప్పాలంటే అప్పుడు వాళ్ళు మీతో మాట్లాడతారు. మీరు రాత్రి పూట పార్ట్‌టైం జాబ్‌ చేస్తున్నా అంటున్నారు. మీరు చేస్తున్న రెగ్యులర్‌ జాబ్‌ మంచిదే. జీతం బాగా వస్తుంది. ఆర్థికంగా కూడా సమస్యలు లేవు. ఇక అలాంటప్పుడు అనవసరంగా పార్ట్‌టైం జాబ్‌ చేస్తూ మీ ఆనందాన్ని ఎందుకు పాడు చేసుకోవడం. వెంటనే దాన్ని ఆపేయండి. ఇద్దరి మధ్య మాటలు కరువైతే మీ సమస్య ఎప్పటికీ ఇలాగే ఉంటుంది. అందుకే మీరిద్దరూ కలిసి కాస్త సమయం గడపండి. అప్పుడు ఒకరినొకరు అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది. ఇవన్నీ మీరు పాటిస్తే మీ జీవితం, మీ పిల్లల భవిష్యత్‌ సంతోషంగా ఉంటుంది. లేదంటే మీరంతా యంత్రాల్లా తయారవుతారు. ముఖ్యంగా పిల్లల భవిష్యత్‌ ఘోరంగా తయారవుతుంది’ అని చెప్పాము.
అలాగే ‘సుజాత గొడవ చేస్తేనే మీరు ఆమెతో మాట్లాడతారు. లేదంటే లేదు. అందుకే ఆమె మీతో గొడవ పడుతుంది. మీ అమ్మా, అక్క ఉన్నప్పుడే ఆమెతో మంచిగా ఉంటారు. అందుకే ఆమె వాళ్ళను ఎక్కువగా మీ ఇంటికి పిలుస్తుంది. ఆమె మీ నుండి ప్రేమ కోరుకుంటుంది. అది అందిస్తే చాలు, మీ మధ్య ఎలాంటి గొడవలూ ఉండవు’ అని అర్థమయ్యేలా చెప్పాము. దాంతో ఇద్దరూ అర్థం చేసుకొని మేము చెప్పిన ప్రకారమే నడుచుకుంటామని చెప్పి వెళ్ళిపోయారు.
– వై. వరలక్ష్మి, 9948794051

Spread the love