మొదట్లో ఐరన్‌ లెగ్‌ అన్నారు

       జీవితం పట్ల పూర్తి అవగాహన, సామాజం పట్ల బాధ్యత కలిగిన వినూత్నమైన నటి విద్యాబాలన్‌… సమాజంలో ఓ మంచి మార్పును కోరుకునే మానవతావాది. సినీ పరిశ్రమలో సర్వసాధరణంగా భావించే క్యాస్టింగ్‌ కౌచ్‌ను ధైర్యంగా ఎదుర్కొన్న ధిశాలి. వయసు నాలుగు పదులు దాటినా తన అందమైన నటనతో విశేషమైన ప్రేక్షకాదరణ పొందుతోంది. తన నైపుణ్యానికి గుర్తుగా ఇటీవల ఫెమినా మామార్త్‌ బ్యూటిఫుల్‌ ఇండియన్స్‌ 2023కు గాను అత్యుత్తమ ప్రతిభా అవార్డును అందుకుంది. ఈ సందర్భంగా ఆమె పరిచయం నేటి మానవిలో…
విద్య 1978, జనవరి 1న కేరళలో పాల్‌ఘాట్‌లో జన్మించింది. ఈమె అత్యంత చిన్న వయసులో ఉన్నప్పుడే వీరి కుటుంబం ముంబైలో స్థిరపడింది. తండ్రి పి.ఆర్‌.బాలన్‌. తల్లి సరస్వతీ బాలన్‌. చిన్నతనం నుండి సినిమాలంటే ఆమెకు చాలా ఇష్టం. మాధురీ దీక్షిత్‌ నటనతో ప్రేరణ పొంది సినిమా రంగంలో అడుగు పెట్టాలని ఆశపడేది. సెయింట్‌ ఆంథొనీ బాలికల పాఠశాల, చెంబూరులో తన స్కూల్‌
విద్యను పూర్తి చేసింది. నటనపై ఉన్న ఆసక్తితో పదహారేండ్ల వయసులో ఏక్తాకపూర్‌ నిర్మించిన ‘హమ్‌ పాంచ్‌’ అనే హిందీ సీరియల్లో నటించింది. హీరోయిన్‌ కావాలని ఇండిస్టీలోకి అడుగు పెట్టాలను కుంది. అయితే ఇంట్లోవాళ్ళు ముందు చదువు పూర్తి చేయ మన్నారు. అలా సోషియాలజీ లో ముంబయి యూనివర్శిటీ నుంచి మాస్టర్‌ డిగ్రీ పొందింది. ఆ తర్వాత మెల్లగా సినిమాల్లో ప్రయత్నించింది.
నిరుత్సాహపడలేదు…
మొదట మలయాళంలో మోహన్‌లాల్‌ సరసన చక్రం సినిమాకు సైన్‌ చేసింది. కానీ దాని నిర్మాణంలో సమస్యలు తలెత్తడం వల్ల ఆ చిత్రం మధ్యలోనే ఆపేశారు. దాంతో మలయాళం ఇండిస్టీలో విద్యకు అవకాశాలు రాలేదు. పైగా ఐరన్‌ లెగ్‌ అనే ట్యాగ్‌ లైన్‌ అంటగట్టారు. అయితే ఏమాత్రం నిరుత్సాహపడకుండా తమిళంపై దృష్టి పెట్టింది. 2002లో రన్‌ సినిమా కోసం విద్యను హీరోయిన్‌గా ఎంపిక చేస్తున్నారు. కానీ తర్వాత మీరాజాస్మిన్‌తో రీప్లేస్‌ చేశారు. అలాగే ‘మనసెల్లం’ అనే సినిమాలో తీసుకుని త్రిషాతో రీప్లేస్‌ చేశారు. దాంతో అక్కడ కూడా ఆమెకు ఎదురుదెబ్బ తగిలింది. చివరికి 2003లో కలారి విక్రమన్‌ అనే సినిమా పూర్తి చేసినా అది విడుదల కాలేదు. ఇలా కెరీర్‌ ప్రారంభంలోనే విద్య చాలా ఇబ్బందులు పడింది.
వెనుదిరిగి చూడలేదు
2005లో ‘పరిణిత’ సినిమా ద్వారా హిందీలో రంగప్రవేశం చేసింది. అది ఫర్వాలేదనిపించడంతో సంజరుదత్‌ పక్కన ‘లగే రహో మున్నా భారు’లో జాహ్నవి పాత్రలో నటించింది. ఈ చిత్రంతో మంచి పేరు సంపాదిం చుకుంది. ఇక అప్పటి నుండి వెనుదిరిగి చూడ లేదు. తర్వాత పా, నో వన్‌ కిల్డ్‌ జెస్సికా, హే బేబి, బూల్‌ బూలాఇయా, కిస్మత్‌ ఇనెక్షన్‌, నో వన్‌ కిల్డ్‌ వంటి చిత్రాలలో తన అద్భుతమైన నటనకు పేరు తెచ్చుకుంది.
విమర్శకుల ప్రశంసలు
తర్వాత 2011లో సిల్క్‌స్మిత జీవితం ఆధారంగా వచ్చిన ‘డర్టీ పిక్చర్‌’ సినిమాతో ఆమె సినీ కెరీర్‌ మలుపు తిరిగిందని చెప్పాలి. ఈ చిత్రంతో బాలీవుడ్‌లో స్టార్‌ హీరోయిన్లలో ఒకరిగా మారింది. అప్పటి నుంచి వరుసగా సినిమాలు చేస్తూనే ఉంది. డర్టి పిక్చర్‌లో విద్యాబాలన్‌ నటనకు విమర్శకులు సైతం ప్రశంసలు కురిపించారు. అయితే 2012లో సిద్ధార్థ్‌ రారు కపూర్‌ను పెండ్లి చేసుకున్న తర్వాత ఇలాంటి పాత్రకు స్వస్తి చెప్పింది.
ఏదో ఒక ప్రత్యేకత
గణిత శాస్త్రవేత్త జీవితం ఆధారంగా వచ్చిన ‘శకుంతల దేవి’లో నటించింది. ఈ చిత్రంలో ఓ టీనేజ్‌ కూతురికి తల్లి పాత్రలో కనిపించిన విద్య ప్రేక్షకులకు మరింత దగ్గరయింది. ఇక తెలుగులో ఎన్టీఆర్‌ బయోపిక్‌లో సీనియర్‌ ఎన్టీఆర్‌ భార్య పాత్రలో బాలకృష్ణ పక్కన జోడి నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఘన్‌చక్కర్‌, షాదీకి సైడ్‌ ఎఫెక్ట్స్‌ వంటి చిత్రాల్లో నటించింది. ఈమె ఏ పాత్ర చేసినా అందులో ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. అలాగే వేరెవరినీ అనుసరించ కుండా తనదైన శైలిని ప్రతిచోటా ప్రదర్శిస్తుంది. అందుకే ప్రేక్షకుల్లో తనదంటూ ఓ ప్రత్యేక ముద్ర వేసుకోగలిగింది.
అనుభవాలు పంచుకుంది
సినీ ఇండిస్టీలో క్యాస్టింగ్‌ కౌచ్‌ను చాలామంది సర్వసాధారణంగా భావిస్తారు. దాని భారిన పడిన వారు బయట నోరు విప్పడం చాలా అరుదు. తమ సమస్య బయటకు చెప్పుకుంటే అవకాశాలు రావని భయం. అయితే విద్యాబాలన్‌ అలా కాదు. నటీమణులపై జరుగుతున్న ఈ తరహా హింసపై చర్చ జరుగుతున్న సమయంలో స్పందించింది. ఓ ఇంటర్వ్యూలో పాల్గొని తనకు ఎదురైనా చేదు అనుభవాల గురించి చెప్పుకొచ్చింది. అవి సోషల్‌ మీడియాలో కూడా బాగా వైరల్‌ అయ్యాయి.
అతని ఆలోచన అర్థమయింది
దక్షిణాది సినిమాల్లో నటించేందుకు ప్రయత్నిస్తున్న రోజుల్లో ఆమెకు ఎదురైన సంఘటన గురించి వివరిస్తూ ”నేను సౌత్‌ ఇండియా ఫిల్మ్‌ ఇండిస్టీలో అడుగుపెట్టడానికి కష్టపడుతున్న రోజుల్లో జరిగింది. నేను ఓ యాడ్‌ ఫిల్మ్‌ కోసం డైరెక్టర్‌ను కలవడానికి చెన్నై వెళ్లాను. అక్కడ ఓ కాఫీ షాప్‌లో కూర్చొని మాట్లాడుకుందాం అని దర్శకుడితో చెప్పా. అయితే అతను నన్ను రూమ్‌కి వెళ్లి మాట్లాడుకుందాం అని పదే పదే అడిగాడు. అప్పుడే అతని ఆలోచన ఏమిటనేది అర్థమైంది. నేను అప్పుడు తెలివిగా గది లాక్‌ వేయకుండా కొంచెం తెరిచి ఉంచాను. దాంతో ఆ దర్శకుడు ఏమీ మాట్లాడకుండా ఐదు నిమిషాల తర్వాత అక్కడ నుంచి వెళ్లిపోయాడు” అన్నది.
బయట పడేందుకు చాలా కష్టపడ్డా…
సమయస్పూర్తిగా ప్రవర్తించడం వల్లే క్యాస్టింగ్‌ కౌచ్‌ నుంచి తప్పించుకోగలిగానని విద్య చెప్పింది. అయితే నటించాల్సిన యాడ్‌ ఫిల్మ్‌ నుంచి తప్పుకున్నందుకు భారీ మూల్యం చెల్లించాల్సి వచ్చిందని చెప్పింది. ఇప్పటికీ తాను ఆ సంఘటనను మర్చిపోలేకపోతున్నానని చెప్పింది. తర్వాత కూడా ఇలా భయపెట్టే ఘటనలు చాలానే ఎదురైయ్యాయని ఇంటర్వ్యూలో పంచుకుంది. అంతేకాకుండా ఇలాంటి ఘటనల వలన తాను కొంత కాలం మానసిక ఇబ్బందికి గురయ్యానని కూడా చెప్పింది. దాని నుంచి బయట పడటం కోసం చాలా కష్టపడాల్సి వచ్చిందని కూడా తెలిపింది. ఆ కాఫీ షాప్‌ ఘటన జరిగిన తర్వాత ఆ దర్శకుడు తనను సినిమా నుంచి తొలగిచడమే కాకుండా తనను బాడీ షేమింగ్‌ చేశాడని వాపోయింది.
మహిళా హక్కులపై…
ఎన్నో కష్టాలను భరించి, సమస్యలను ఎదుర్కొని విద్య సినీ పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది. అంతేకాదు ఏ ఫంక్షన్‌లో పాల్గొన్నా చీరకట్టుతో వచ్చి చీరకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా కూడా పేరు తెచ్చుకుంది. కేవలం సినిమాలకే పరిమితం కాకుండా పర్యావరణ పరిరక్షణ, మహిళల సమానత్వం, వేధింపులు, హక్కులపై తన గొంతు విప్పుతూ చురుకైన పాత్ర పోషిస్తుంది. భామ్లా ఫౌండేషన్‌ వంటి సంస్థల సహకారంతో #BeatAirPollution వంటి కార్యక్రమాల ద్వారా పర్యావరణ సమస్యల గురించి ప్రజల్లో అవగాహన పెంచుతుంది. అలాగే #MeToo ఉద్యమానికి మద్దతు ఇస్తుంది.

– సలీమ

Spread the love