నవతెలంగాణ – హైదరాబాద్: నగరంలోని హుస్సేన్ సాగర్ వద్ద తీవ్ర ఉద్రిక్త వాతావరణం కొనసాగుతోంది.ట్యాంక్ బండ్‌పై గణేశ్ నిమజ్జనాలపై నిషేధ ఆంక్షలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే, ఈ ఆంక్షలపై భాగ్యనగర ఉత్సవ కమిటీ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్యాంక్ బండ్‌పై ఏర్పాటు చేసిన బారిగేడ్లను వారు తొలగించారు. అనంతరం హుస్సేన్ సాగర్‌లో గణేశ్ విగ్రహాన్ని నిమజ్జనం చేశారు. ప్రభుత్వం భక్తుల మనోభావాలను దెబ్బ తీస్తుందని వారు ఫైర్ అయ్యారు. ట్యాంక్ బండ్‌పై వినాయక నిమజ్జనాలు చాలా ఏళ్లుగా జరుగుతున్నాయని, ఇప్పుడెందుకు కొత్తగా నిబంధనలు పెడుతున్నారని ప్రశ్నించారు.2022, 2023లో కూడా ఇదే విధంగా చెప్పారని, కానీ చివరకు ట్యాంక్ బండ్‌లోనే నిమజ్జనాలు జరిగాయని గుర్తు చేశారు.ఇకనైనా ప్రభుత్వం వెంటనే ట్యాంక్ బండ్‌పై గణేష్ నిమజ్జన ఏర్పాట్లు చేయాలని డిమాండ్ చేశారు. ఒకవేళ ప్రభుత్వం అందుకు సరైన విధంగా పట్టించుకోకపోతే సోమవారం హైదరాబాద్ వ్యాప్తంగా ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు.