శంషాబాద్‌ విమానాశ్రయంలో

రూ.14 కోట్ల విలువైన హెరాయిన్‌ పట్టివేత
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి : దేశంలోకి విదేశాల నుంచి తరలివస్తున్న మాదక పదర్థాలను నిరోధించటానికి సంబంధిత విభాగాలు తీవ్రంగా కృషి చేస్తున్నప్పటికీ.. నిఘా వ్యవస్థను బురుడి కొట్టిస్తూ మాదక పదార్థాలను కొత్త మార్గాల ద్వారా దేశంలోకి తరలిస్తున్న స్మగ్లర్ల వైనం వెలుగు చూస్తూనే ఉన్నది. తాజాగా, శంషాబాద్‌ రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఒక విదేశీ మహిళ భద్రతాధికారుల కండ్లుగప్పుతూ తీసుకు వచ్చిన కోట్ల రూపాయల హెరాయిన్‌ కస్టమ్స్‌ అధికారుల అప్రమత్తతతో పట్టుబడ్డది. కస్టమ్స్‌ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. బురుండి దేశస్థురాలైన 42 ఏండ్ల మహిళ విమానాశ్రయంలో అనుమానాస్పదంగా వెళ్తుండగా కస్టమ్స్‌ అధికారులు ఆమె వద్దన్ను హ్యాండ్‌ బ్యాగ్‌ను అనుమానంతో సోదా చేశారు. అనుకున్నదాని కంటే ఎక్కువ బరువున్న ఆ బ్యాగును అధికారులు క్షుణ్ణంగా సోదా చేయగా.. కొన్ని సబ్బులతో పాటు పెద్ద సంఖ్యలో ప్లాస్టిక్‌ ప్యాకెట్లు బయట పడ్డాయి. సబ్బు రూపంలో హెరాయిన్‌ను కనిపెట్టిన అధికారులు ప్లాస్టిక్‌ ప్యాకెట్లలో ఉన్న షర్ట్‌ బటన్‌లను కూడా అనుమానంతో పరీక్షించారు. బటన్‌ల రూపంలో లోపల రహస్యంగా పొందుపర్చిన హెరాయిన్‌ బయటపడటంతో కస్టమ్స్‌ అధికారులు విస్తుపోయారు. ఆ మొత్తాన్ని తూకం వేయగా 2014 గ్రాముల బరువుతో హెరాయిన్‌ ఉన్నట్టు గుర్తించారు.
ఈ హెరాయిన్‌ను అత్యంత పకడ్బందీగా ఆ మహిళ మొదట నైరోబి నుంచి విమానంలో షార్జాకు వచ్చి, అక్కడ నుంచి విమానంలో శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో దిగి హైదరాబాద్‌లో కొందరికి చేరవేయడానికి హెరాయిన్‌ను తీసుకొచ్చినట్టు అధికారులు ప్రాథమికంగా తేల్చారు. దీంతో ఆమెను అరెస్టు చేసిన కస్టమ్స్‌ అధికారులు కోర్టుకు హాజరుపర్చి చంచల్‌గూడ జైలుకు తరలించారు. రూ.14 కోట్ల విలువైన ఈ మాదక పదార్థాన్ని ఈ మహిళ ఎవరికి చేరవేయదల్చుకున్నది? అక్కడ నుంచి ఎందరి చేతులకు అది మారుతున్నది? కనిపెట్టడానికి దర్యాప్తును కొనసాగిస్తున్నామని కస్టమ్స్‌ అధికారులు తెలిపారు.

Spread the love