కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గం, మండలం, శాలపల్లి గ్రామంలో 2021 ఆగస్టు 16న తెలంగాణ దళిత బంధు పథకాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. అంతకుముందు యాదాద్రి భువనగిరి జిల్లా వాసాలమర్రిలో ఎంపికచేసిన లబ్దిదారులకు దళితబంధు చెక్కులిచ్చారు. హుజురాబాద్ నియోజక వర్గంలోని మొత్తం దళిత కుటుంబాలతో పాటు ఖమ్మం జిల్లా చింతకాని మండలం, సూర్యపేట జిల్లా తిరుమల గిరి మండలం, నాగర్ కర్నూల్ జిల్లా చారగొండ మం డలం, కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలాల్లోని 8 వేల 390 దళిత కుటుం బాలకు 118 నియోజక వర్గాల్లో 38వేల 323లబ్దిదారులకు ఇస్తున్నారు. రెండవ విడతలో నియోజకవర్గానికి మరో 1100 చొప్పున ఇస్తామని చెప్పినపపటికీ ఇప్పటికీ గైడెన్స్ ఇవ్వలేదు. 2023-24 రాష్ట్ర బడ్జెట్‌లో దాదాపు రూ.17వేల కోట్లు కేటాయించారు. దళిత కుటుంబాలు తమకు అనుభవం ఉన్న, ఇష్టమైన వ్యాపారం, సంస్థలు పెట్టుకొని ఆర్థిక అభివృద్ధి సాధించడం కోసం వంద శాతం సబ్సిడీతో రూ.10లక్షలు ఆర్థిక సహాయం అందిం చడం, యూనిట్లు నెలకొల్పేలా ప్రోత్స హించడం ”తెలం గాణ దళిత బంధు స్కీం” ముఖ్యఉద్దేశం. పైలెట్ ప్రాజె క్టుగా హుజురాబాద్ అసెంబ్లీ నియోజకవర్గాన్ని నిర్ణయించి అధికారులతో సర్వే చేయించగా వారు ఆర్థిక వెనుకబడిన దళిత కుటుంబాలను గుర్తించారు. గుర్తించిన లబ్ధిదారులతో దళితబంధు బ్యాంకు ఖాతాలను ఓపెన్ చేశారు. వారి అకౌంట్స్‌లో రూ.10 లక్షల వరకు నిధులు జమయ్యాయి. ఏదైనా క్లిష్టమైన, అత్యవసర పరిస్థితుల్లో కుటుంబాలు తిరిగి పేదరికంలోకి జారిపోకుండా వారిని రక్షించడానికి ఈ నిధి ఉద్దేశంగా అధికారులు చెబుతున్నారు. నియోజక వర్గంలో గుర్తించిన దళిత కుటుంబాలలో రేషన్ కార్డులు లేవనీ, తదితర కారణాలతో కొన్నింటిని పెండింగ్‌లో పెట్టారు.
ఉపఎన్నిక కోసమే అయినా…
హుజురాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికను దృష్టిలో పెట్టుకుని కేసీఆర్ ఈ పథకం ప్రారంభించారు. అప్పుడు ఈ పథకంపై ప్రతిపక్షాల నుంచి అనేక విమర్శ లొచ్చాయి. ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే పథకం ప్రవేశ పెట్టారని, దళిత ఓట్ల కోసమే ఇదంతా చేస్తున్నారని ఆరోపిం చారు. దీనిపై ముఖ్యమంత్రి స్పందించి ‘ఎవరేం మాట్లాడిన మేం పట్టించుకోం. దళితులకు లబ్ది చేకూర్చడానికే దళితబంధు తీసుకొచ్చాం. వందశాతం మాది రాజకీయ పార్టీ. పథకాలతో ప్రజల మనసులు గెలిచేం దుకుకే. ఓట్ల కోసమే అనుకున్నా నష్టంలేదు. సమాజంలో వారు తలెత్తుకుని బతకాలి’ అని వ్యాఖ్యానించారు. ఇది కూడా వాస్తవమే. సమస్య ఎలా ఉన్నా, సందర్భం ఎలాం టిదైనా దళితుల జీవితాలు బాగుపడాలన్నది ముఖ్యమైన అంశం. ప్రారంభించిన తర్వాత నిధులు ఎక్కడినుంచి తెస్తారని, ఈ పథకం నీరుగారు తుందని అందరూ విమర్శల వర్షం కురిపించారు. కానీ అనుమా నాలన్నీ పటాపంచాలు చేస్తూ ఉప ఎన్నిక తర్వాత సంవత్సర కాలంలోనే
పథకం ఫలితాలు దళితుల అనుభవంలోకి వచ్చాయి. చాలా మంది భావిస్తున్నట్టుగా ఈ స్కీం ద్వారా ఇచ్చే రూ.10లక్షలు నేరుగా దళిత కుటుం బాలకు ఇవ్వడం లేదు. వారి ఆర్థిక అభివృద్ధి కోసం వారికి ఇష్టమైన బిజినెస్ పెట్టు కోవడానికి, కావలసిన వస్తువులు, మెటీరియల్, పనిముట్లు, యంత్రాల కోసం పర్చేజింగ్ ఎస్టీమేషన్ ఆధారంగా డైరెక్ట్‌గా ఆయా సంస్థలకే చెల్లిస్తారు. లబ్ధిదారులలో మినీ డెయిరీ, సర్వీసెస్, సప్లయిస్, రిటైల్స్ వంటి వ్యాపా రాలకు అందజేశారు. దళిత కుటుం బాలు విత్ డ్రా చేసుకోని వ్యక్తిగతంగా ఉపయోగించు కోవడానికి వీలు లేదు. వ్యాపార విస్తరణ కోసం మాత్రమే అవసరమైన పరిశీలనలు జరిపి సరఫరా సంస్థలకు చెల్లిస్తారు. వారు ఎంచుకున్న వ్యాపారం, వృత్తి, ఉత్పత్తి ద్వారా రోజువారి, నెలవారి ఆదాయం దళిత కుటుంబాలు పొందేందుకు ఉద్దేశించిన గొప్ప పథకంగా చెప్పొచ్చు. అధికారులు వారానికి రెండుసార్లు రివ్యూ నిర్వ హించడం, పథకం అమలు కోసం క్షేత్రస్థాయిలో కృషి చేయ డం అభినందించాల్సిన అంశం. లబ్ధిదారులకు అవగాహనా సదస్సులు, బిజినెస్‌ను ఎంచుకోవడంలో మెలికలు వంటి అనేక అంశాలలో గైడెన్స్ ఇవ్వడం మంచి అంశాలు.
పథకంలో 101 రకాల యూనిట్లు
పథకంలో భాగంగా గ్రౌండింగ్ చేసిన యూనిట్లు ప్రధా నంగా ఆరు రంగాలు 101రకాల వృత్తుల సంబంధిం చినవిగా ఉన్నాయి. వారు ఎంచుకున్న పని, వ్యాపారంలో అనుభవం ఉండి విభిన్న రకాల యూనిట్లు, వృత్తులు ఎంచుకున్న ఏడు వేల పైచిలుకు లబ్ధిదారుల్లో ఎనభై శాతం పైగా యూనిట్లు, లబ్దిదారులు తమ ఆర్థిక అభివద్ధికి తోడ్పడే విధంగా ఉన్నాయి. మంచి ఫలితాలే వస్తున్నాయని చెప్పొచ్చు. ఉదాహరణకు వీణవంక మండల కేంద్రంలో 20వరకు బుడిగ జంగాల కుటుంబాలు ఉన్నాయి. కాలినడకన లేదా టూ వీలర్స్ పైన ఊరూరా తిరిగి చిన్న, చిన్న వస్తువులు అమ్ముకునేవారు. ఇప్పుడు దళిత బంధు ద్వారా పొందిన ఆర్థిక సహాయంతో గూడ్స్, ఆటో ట్రాలీలు కొనుగోలు చేసుకున్నారు. వంటింటి సామాన్లు ఊరూరికి తిరిగి అమ్ముకుంటూ నెలకు రూ.15 వేలనుండి 20వేల ఆదాయం పొందుతున్నారు. మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన లబ్దిదారు ఒకరికి దళిత బంధు మంజూరయ్యింది. దీంతో అతను ”ఆటోమొబైల్స్ స్టార్”ను స్థాపించారు. నెలకు రూ.40 వేల నుంచి 50వేలు సంపాదిస్తున్నారు. మెడికల్ షాపులో పనిచేసిన అనుభవం ఉన్న ఇద్దరు దళిత బంధు లబ్ది దారులు కలసి సొంతంగా మెడికల్ స్టోర్ ప్రారంభించారు. వీరు మరో ముగ్గురు వర్కర్లను కూడా నియమించు కున్నారు. అన్ని ఖర్చులూ పోనూ ఒక్కరికి నెలకు రూ.30వేల వరకు సంపాదిస్తున్నారు. ఇలా దళిత బంధు పథకంలో అత్యంత విజయవంతమైన కొన్ని యూనిట్ల విజయగాథ. నైపుణ్యత, అనుభవం, ఆసక్తి ఉండి ఆస్తిపాస్తులు లేక బ్యాంకుల నుండి లోన్లు కూడా పొందలేని అనేక మంది దళితులు ఈ పథకాన్ని బాగా ఉపయోగించుకుంటున్నారు. మొదటి విడతతో పోల్చినప్పుడు రెండో విడతలో అవి నీతి జరిగినట్టు ఆరోపణలు వచ్చాయి. కొంత మంది దళారులు అధికారులతో కుమ్మక్కై ఫైరవీల కోసం లబ్ది దారుల నుంచి డబ్బులు తీసుకున్నట్టు బాధితులు బహిరంగ విమర్శలు చేశారు. ఇలాంటి మంచి పథకంలో అవినీతి, అక్రమాలు జరగకుండా ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. లబ్ధిదారులు యూనిట్లను ఎంచుకునే విషయంలో, మార్కెటింగ్ చేసే విషయంలో సరైన గైడెన్స్ ప్రకటించాలి. వినియోగించు కోకుండా బ్యాంకు లోనే ఉన్న డబ్బులకు డిపాజిట్ రూపంలో ప్రతినెలా లబ్దిదారులకు వడ్డీ ఇవ్వాలి. భూమి కొనుగోలులాంటి వాటికి అవకాశం ఇస్తే పథకం మరిన్ని దళిత కుటుంబాల్లో వెలుగులు నింపుతాయి.
గీట్ల ముకుందరెడ్డి
9490098857