నవతెలంగాణ – హైదరాబాద్: ప్రజల మానప్రాణాలకు రక్షణగా ఉండాల్సిన ఓ సీఐ ఊహించనలివికానీ దారుణానికి పాల్పడ్డాడు. విచక్షణ మరిచి ఓ 16 ఏళ్ల బాలికపై అఘాయిత్యానికి ఒడిగట్టాడు. నిందితుడిపై హనుమకొండ జిల్లా కేయూ పోలీస్‌స్టేషన్‌లో శుక్రవారం అత్యాచారం, పోక్సో చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, భూపాలపల్లి సీఐగా ఉన్న బండారి సంపత్ 2022లో కాకతీయ యూనివర్సిటీ పోలీస్‌స్టేషన్ ఎస్సైగా పనిచేశాడు. ఆ సమయంలో హనుమకొండలోని ఓ కాలనీకి చెందిన మహిళతో సన్నిహితంగా మెలిగాడు. ఖమ్మం జిల్లాకు సీఐగా బదిలీ అయ్యాక కూడా వారి సాన్నిహిత్యం కొనసాగింది. ఇటీవల జైశంకర్ భూపాలపల్లికి వీఆర్ సీఐగా బదిలీపై వచ్చిన అతడు మహిళ కూతురిపై కన్నేశాడు. అదును చూసి అత్యాచారానికి ఒడిగట్టాడు. తల్లికి బాలిక విషయం చెప్పడంతో ఆమె కేయూ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.