దాడి చెయ్… దోచెయ్…

Attack... Dochey...– బాండ్లు కావవి ముడుపులు
– 41 సంస్థలపై కేంద్ర ఏజెన్సీల దాడులు…ఆ తర్వాత బాండ్ల రూపంలో మోడీ సర్కార్‌కు ముడుపులు
– ఆ సంస్థల నుంచి వచ్చిన సొమ్ము రూ.2,471 కోట్లు
– చందా ఇస్తేనే …కాంట్రాక్టులు
– అక్రమమార్గంలో రూ.3.7 లక్షల కోట్ల ప్రాజెక్టులు, కాంట్రాక్టులు
– 30 డొల్ల కంపెనీల ద్వారా అందిన సొమ్ము రూ.143 కోట్లు
– నిఫ్టీ, సెన్సెక్స్‌ లిస్టెడ్‌ కంపెనీలు కొనుగోలు చేసిన 81 శాతం ఎలక్టోరల్‌ బాండ్లు బీజేపీకే…
దేశ చరిత్రలోనే అతి పెద్ద స్కామ్‌గా పేరొందిన ఎలక్టోరల్‌ బాండ్ల డేటా తవ్వే కొద్దీ అవినీతి గుట్టలుగుట్టలుగా బయటకొస్తోంది. ఈ అవినీతి పరంపరలో తాజాగా మరో కోణం వెలుగుచూసింది. బీజేపీకి రూ.2,471 కోట్లు బాండ్ల రూపంలో ముడపులు ముట్ట జెప్పిన 41 కంపెనీలు సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌ (సీబీఐ), ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ), ఆదాయపు పన్ను (ఐటీ) వంటి కేంద్ర ప్రభుత్వ ఎజెన్సీల దాడులను ఎదుర్కొన్నవే. ఈ దాడుల తరువాత దాదాపు రూ.1,698 కోట్లు బీజేపీకి ఈ కంపెనీలు విరాళంగా ఇచ్చాయి. రాజ్యాంగ విరుద్ధమైన ఎలక్టోరల్‌ బాండ్ల పథకం కింద, కనీసం 30 షెల్‌ (డొల్ల) కంపెనీలు రూ.143 కోట్ల విలువైన ఎలక్టోరల్‌ బాండ్లను కొనుగోలు చేశాయి.
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
ఎలక్టోరల్‌ బాండ్లు కొనుగోలు చేసి బీజేపీకి విరాళం ఇచ్చిన 33 కంపెనీలు 172 మేజర్‌ కాంట్రాక్టులు, ప్రభుత్వం నుంచి ప్రాజెక్ట్‌ అనుమతులు పొందాయి. బీజేపీకి రూ.1,751 కోట్ల ఎలక్టోరల్‌ బాండ్‌ విరాళాలు ఇచ్చినందుకు, వారు మొత్తం రూ.3.7 లక్షల కోట్ల ప్రాజెక్టులు, కాంట్రాక్టులు పొందారు. పోస్ట్‌పెయిడ్‌ కాంట్రాక్టులు, ప్రాజెక్ట్‌ అనుమతులలో కేంద్రం లేదా బీజేపీ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వాలు రూ.62,000 కోట్లు ఇచ్చాయి. ఆమోదానికి బదులుగా, మూడు నెలల్లోనే ఎలక్టోరల్‌ బాండ్ల రూపంలో పార్టీకి రూ.580 కోట్ల ”ముడుపులు ” లభించాయి.
గత ఏడాది ఆగస్టులో ఐటీ శాఖ దాడులు జరిపిన మూడు నెలల్లోనే కల్పతరు గ్రూప్‌ బీజేపీకి రూ.5.5 కోట్లు ఇచ్చింది. 2023 నవంబర్‌ 12, 2021 డిసెంబర్‌ 1లో ఐటీ, ఈడీ దాడులు జరిగిన మూడు నెలల్లో ఫ్యూచర్‌ గేమింగ్‌ బీజేపీకి రూ.60 కోట్లు ఇచ్చింది. 2022 నవంబర్‌ 10న ఈడీ రైడ్‌ జరిగిన మూడు నెలల్లో అరబిందో ఫార్మా బీజేపీకి రూ. 5 కోట్లు ఇచ్చింది. నిఫ్టీ, సెన్సెక్స్‌ లిస్టెడ్‌ కంపెనీలు కొనుగోలు చేసిన 81 శాతం ఎలక్టోరల్‌
బాండ్ల్లు బీజేపీ కే వెళ్లాయి.
15 నిఫ్టీ లిస్టెడ్‌ కంపెనీలు రూ.646 కోట్లు, ఎనిమిది సెన్సెక్స్‌ లిస్టెడ్‌ కంపెనీలు రూ.337 కోట్ల విలువ చేసే ఎలక్టోరల్‌ బాండ్లను కొనుగోలు చేశాయి. నిఫ్టీ లిస్టెడ్‌ కంపెనీలు కొనుగోలు చేసిన రూ.646 కోట్లలో ఒక్క బీజేపీ కే రూ. 521 కోట్లు (81 శాతం) ముట్టాయి.. సెన్సెక్స్‌ లిస్టెడ్‌ కంపెనీలలో కొనుగోలు చేసిన రూ.337 కోట్లు బీజేపీ కే అందాయి. . సెన్సెక్స్‌లోని ఎనిమిది కంపెనీలు భారతీ ఎయిర్‌టెల్‌, అల్ట్రా టెక్‌ సిమెంట్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, ఐటీసీ, మహీంద్రా అండ్‌ మహీంద్రా, మారుతీ సుజుకీ, సన్‌ ఫార్మా, టెక్‌ మహీంద్రా ఉన్నాయి.ఈ కంపెనీలన్నీ కూడా నిఫ్టీ జాబితాలో ఉన్నాయి. ఇందులో మరో ఏడు డాక్టర్‌ రెడ్డీస్‌ లాబొరేటరీస్‌, దివీస్‌ లాబొరేటరీస్‌, సిప్లా, గ్రాసిమ్‌, హీరో మోటోకార్ప్‌, బజాజ్‌ ఆటో, యూపీఎల్‌ లిమిటెడ్‌ ఉన్నాయి.
చందా దే, దందా కరో
ఎలక్టోరల్‌ బాండ్ల పథకం స్వతంత్ర దేశంలో అతిపెద్ద స్కామ్‌లలో ఒకటి. ఈ బాండ్ల పథకంతో నాలుగు రకాల అవినీతి జరిగింది. ”మొదటిది చందా దే, దందా కరో (విరాళం ఇచ్చి వ్యాపారం చేసుకోండి), రెండోది హఫ్తా-వసూలి (దోపిడీి), మూడోది ది లో రిష్వత్‌ దో (బ్యాగ్‌ కాంట్రాక్ట్‌, లంచం ఇవ్వండి)”.
– సీనియర్‌ న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్‌

Spread the love