మణిపుర్‌లో అస్సాం రైఫిల్స్‌ పై దాడి ..

నవతెలంగాణ హైదరాబాద్: మణిపుర్‌ (Manipur)లో అస్సాం రైఫిల్స్‌ (Assam Rifles) బలగాలకు తృటిలో ప్రమాదం తప్పింది. భద్రతా బలగాలు ప్రయాణిస్తున్న వాహనం లక్ష్యంగా తీవ్రవాదులు మందుపాతర పేల్చారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. సైనిక ఉన్నతాధికారి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ‘‘గురువారం ఉదయం పది గంటల ప్రాంతంలో పది మందితో కూడిన అస్సాం రైఫిల్స్‌ బృందం తెంగ్నౌపాల్ జిల్లాలోని సైబోల్‌ ప్రాంతం గుండా వెళుతోంది. ఈ క్రమంలో వారు ప్రయాణిస్తున్న వాహనం లక్ష్యంగా తీవ్రవాదులు మందుపాతర పేల్చారు. భద్రతా బలగాలు ప్రయాణిస్తున్న వాహనం మందుపాతర పేలుళ్లను తట్టుకునేది కావడంతో లోపల ఉన్నవారిలో ఎవరికీ గాయాలు కాలేదు. పేలుడు అనంతరం అస్సాం రైఫిల్స్‌ వాహనంపైకి తీవ్రవాదులు కాల్పులు జరిపారు. ప్రతిగా అస్సాం రైఫిల్స్‌ కూడా కాల్పులు జరపడంతో తీవ్రవాదులు అక్కణ్నుంచి పారిపోయారు’’ అని తెలిపారు.
ప్రస్తుతం భద్రతా బలగాలు ఆ ప్రాంతంలో ప్రత్యేక సెర్చ్‌ ఆపరేషన్ చేపట్టాయి. ఈ దాడి కోసం తీవ్రవాదులు తక్కువ తీవ్రత కలిగిన మందుపాతర ఉపయోగించారని సైనికాధికారి తెలిపారు. గత నెలలో మణిపుర్‌లోని మోరే ప్రాంతంలో ఓ పోలీసు అధికారిని తీవ్రవాదులు కాల్చి చంపారు. ఈ ఘటనతో మోరే ప్రాంతంలో అదనంగా 200 మంది అస్సాం రైఫిల్స్‌ సిబ్బందిని మోహరించారు. మరోవైపు మయన్మార్‌ నుంచి వచ్చే చొరబాటుదారులను అడ్డుకునేందుకు వీరు ప్రత్యేక ఆపరేషన్ చేపట్టినట్లు సైన్యం తెలిపింది. గతవారం మణిపుర్‌ పోలీసు కమాండోలు ప్రయాణిస్తున్న కాన్వాయ్‌పై తీవ్రవాదులు మెరుపుదాడి చేశారు. ఆ సమయంలో అటుగా వెళ్తున్న అస్సాం రైఫిల్స్‌.. సాహసోపేతంగా వారిని కాపాడింది. ఈ దాడిలో ముగ్గురు కమాండోలు గాయపడ్డారు. రెండు వారాల వ్యవధిలో ఇది రెండో దాడి.

Spread the love