– 14 మంది మృతి
– ఇజ్రాయిల్ అర్మీ కేంద్ర కార్యాలయంపై
– గాజాకు అందని సాయం
బీరుట్/ గాజా : పాలస్తీనా శరణార్థులు తలదాచుకుంటున్న శిబిరాలపై ఇజ్రాయిల్ జరిపిన దాడుల్లో 14 మంది చనిపోయారు. పలువురు గాయపడ్డారు. ఇజ్రాయిల్ దాడికి ప్రతిగా తాము ఇజ్రాయిలీ ఆర్మీ కేంద్ర కార్యాలయంపై ఆత్మాహుతి డ్రోన్లతో దాడి చేసినట్లు హిజ్బుల్లాలు ప్రకటించారు. గత ఐదు వారాలుగా ఉత్తర గాజా దిగ్బంధనం కొనసాగుతున్న నేపథ్యంలో నవంబరు నెల్లో ఇప్పటివరకు ఒకే ఒక్కసారి మానవతా సాయం అందించే బృందం పర్యటించిందని ఐక్యరాజ్య సమితి పేర్కొంది. అది కూడా నిర్వాసితులు తల దాచుకున్న శరణార్థి శిబిరాలపై దాడులు జరిగిన వెంటనే ఆహార సరఫరాల పంపిణీ జరిగిందని, అవి ఏ మేరకు అందాయో కూడా చెప్పలేమని పేర్కొంది. గాజాలో పరిస్థితులు అత్యంత అధ్వానంగా మారాయని సహాయక బృందాలు పేర్కొంటున్నాయి. మరోవైపు లెబనాన్ రాజధాని బీరుట్‌కు దక్షిణంగా దావెత్‌లో నివాస భవంతిపై బుధవారం తెల్లవారు జామున జరిగిన దాడిలో ఆరుగురు మరణించారు. మరో 15మంది గాయపడ్డారు. ఇదిలావుండగా, ఇజ్రాయిల్ తన లక్ష్యాలను నెరవేర్చుకుందని, ఇక గాజాలో దాడులను ఆపేందుకు సమయం ఆసన్నమైందని అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ అన్నారు. నెల రోజుల గడువులోగా గాజాకు సాయం పెంపొందించకపోతే మిలటరీ సాయంలో కోత విధిస్తామని హెచ్చరించిన అమెరికా, ఇజ్రాయిల్‌కు మద్దతు కొనసాగుతుందని తాజాగా ప్రకటించింది.
ఇజ్రాయిల్‌లోని గలీలీ ప్రాంతంపై హిజ్బుల్లా 20వరకు రాకెట్‌లను ప్రయోగించిందని ఆర్మీ ప్రకటించింది. వాటిలో చాలావరకు అడ్డుకున్నామని, మరికొన్ని నష్టాన్ని కలిగించాయని తెలిపింది. హిజ్బుల్లాపై ఎలాంటి కార్యాచరణ చేపట్టనందుకు చర్యలు తీసుకోవాల్సి వస్తుందని ఇజ్రాయిల్ రాజకీయ నేతలు లెబనాన్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. లెబనాన్ గడ్డ పై నుండి హిజ్బుల్లా జరుపుతున్న దాడులను తక్షణమే నిలిపివేయాలని మితవాద ఇజ్రాయిల్ బెయితెను పార్టీ అధ్యక్షుడు అవిగ్డార్ లిబర్‌మన్ డిమాండ్ చేశారు. లెబనాన్ ఆర్మీ చర్యలు తీసుకోని పక్షంలో ఆ దేశంలో మౌలిక వసతులను ధ్వంసం చేస్తామని హెచ్చరించారు.