షియోమి ఇండియా ఉద్యోగుల‌పై వేటు…

నవతెలంగాణ – న్యూఢిల్లీ: షియోమి ఇండియా మార్కెట్ వాటా త‌గ్గుముఖం ప‌ట్ట‌డంతో కార్య‌క‌లాపాల పున‌ర్వ్య‌వ‌స్ధీక‌ర‌ణ‌లో భాగంగా ఉద్యోగుల‌పై వేటు వేసేందుకు స‌న్న‌ద్ధ‌మైంది. భార‌త్‌లో ప‌లువురు కంపెనీ ఉద్యోగుల‌ను తొల‌గించేందుకు షియోమి క‌స‌ర‌త్తు సాగిస్తున్న‌ట్టు స‌మాచారం. గ‌త కొద్ది వారాల్లో షియోమి ఇండియాలో దాదాపు 30 మంది ఉద్యోగులను విధుల నుంచి తొల‌గించార‌ని, మ‌రికొంత మందికి త్వ‌ర‌లోనే పింక్ స్లిప్‌లు అంద‌నున్నాయ‌ని చెబుతున్నారు. ఈ ఏడాది ఆరంభంలో షియామి ఇండియాలో దాదాపు 1500 మంది ఉద్యోగులు ప‌నిచేస్తుండ‌గా ఈ సంఖ్య‌ను 1000లోపు తీసుకురావాల‌ని కంపెనీ యోచిస్తోంది. దీంతో షియోమి ఇండియాలో మాస్ లేఆఫ్స్ త‌ప్ప‌వ‌నే ఆందోళ‌న వ్య‌క్త‌మవుతోంది. ప‌రిస్ధితుల‌కు అనుగుణంగా సిబ్బంది సంఖ్య‌ను కుదించ‌డం వంటి అంశాల‌పై భార‌త్ అధికారులే నిర్ణ‌యం తీసుకుంటార‌ని షియోమి ప్ర‌తినిధి పేర్కొన్న‌ట్టు ఓ వాణిజ్య ప‌త్రిక పేర్కొంది. మార్కెట్ వాటా, వ్యాపార అంచ‌నాలకు అనుగుణంగా ఇత‌ర కంపెనీల మాదిరే తామూ ఉద్యోగుల సంఖ్య‌పై నిర్ణ‌యం తీసుకుంటామ‌ని కంపెనీ ప్ర‌తినిధి వెల్ల‌డించారు. ఇక గ‌త రెండు క్వార్ట‌ర్ల‌లో కంపెనీ మార్కెట్ వాటా ప‌త‌నం కావ‌డంతో షియోమి ఉద్యోగుల‌పై వేటు వేస్తుంద‌నే ఆందోళ‌న సిబ్బందిలో వ్య‌క్త‌మవుతోంది. ఇక ఈ ఏడాది ఆరంభంలో తొమ్మిదేండ్ల పాటు కంపెనీతో అనుబంధం క‌లిగిన షియోమి గ్లోబ‌ల్ వైస్ ప్రెసిడెంట్ మ‌ను కుమార్ జైన్ టెక్ దిగ్గ‌జానికి గుడ్‌బై చెప్పారు.

Spread the love