– నల్ల బ్యాడ్జిలతో విధులు నిర్వహించి నిరసన
నవతెలంగాణ – కమ్మర్ పల్లి
విధుల్లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులపై దాడి సరైంది కాదని తహసిల్దార్ ఆంజనేయులు అన్నారు. మంగళవారం మండల కేంద్రాల్లోని తహసిల్దార్ కార్యాలయం ముందు వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం లగచర్ల గ్రామంలో కలెక్టర్ ఇతర ఉద్యోగులపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించారు. రాష్ట్ర రెవెన్యూ అసోసియేషన్ అధ్యక్షులు వంగా రవీందర్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు రామన్ రెడ్డి పిలుపు మేరకు నల్ల బ్యాడ్జి ధరించి విధులు నిర్వహించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా తహసిల్దార్ మాట్లాడుతూ ఫార్మా కంపెనీ భూ సేకరణ ప్రక్రియలో భాగంగా గ్రామసభలో పాల్గొనడానికి వెళ్లిన వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, అదనపు కలెక్టర్ లింగ్యా నాయక్, కాడ ప్రత్యేక అధికారి వెంకట్ రెడ్డి, కొడంగల్ తహసిల్దార్ విజయ్, ఇతర రెవిన్యూ సిబ్బందిపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. గ్రామస్తులకు ఇబ్బందులు ఉంటే అధికారులకు చెప్పాలి కానీ భౌతిక దాడులకు దిగడం సరికాదు అన్నారు. ప్రభుత్వ స్పందించి దోషులను కఠినంగా శిక్షించాలి అన్నారు. ప్రజా సేవలో ప్రభుత్వ ఉద్యోగులకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటుందన్నారు. కార్యక్రమంలో రెవెన్యూ ఇన్స్పెక్టర్ శరత్, తహసిల్దార్ కార్యాలయ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.