బొగ్గు బ్లాక్‌ల వేలాన్ని ఆపాలి

Auction of coal blocks should be stopped– శ్రావణపల్లి బ్లాక్‌ను సింగరేణికి కేటాయించాలి
– ఓసీపీ-2 సమావేశంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వీరయ్య
నవతెలంగాణ-రామగిరి
తెలంగాణలోని బొగ్గు బ్లాక్‌లను సింగరేణికే కేటాయించాలని, కేంద్ర బీజేపీ ప్రభుత్వం బొగ్గు గనుల వేలం ఆపాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎస్‌.వీరయ్య డిమాండ్‌ చేశారు. జులై 29న ప్రారంభమైన సింగరేణి పరిరక్షణ యాత్ర గురువారం పెద్దపల్లి జిల్లాలోని రామగుండం సింగరేణి ఆర్‌జీ-3 ఏరియాలో సాగింది. ఈ సందర్భంగా ఓసీపీ-2లో సమావేశం నిర్వహించారు. సమావేశానికి సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎర్రవెల్లి ముత్యంరావు అధ్యక్షత వహించగా.. వీరయ్య మాట్లాడారు. తెలంగాణ బిడ్డ అని కిషన్‌రెడ్డిని నమ్మి ఓటు వేస్తే నట్టేట ముంచుతున్నారని విమర్శించారు. హైదరాబాద్‌లోనే బొగ్గు బ్లాకుల వేలం ప్రక్రియ నిర్వహించారని, ఈ వేలం కార్యక్రమానికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వెళ్లారని చెప్పారు. సింగరేణిని ప్రయివేటుపరం చేయడానికి గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంతోపాటు ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వం, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మొగ్గు చూపుతున్నాయన్నారు. మంచిర్యాల జిల్లాలోని శ్రావణపల్లిలో కూడా సింగరేణి సంస్థ బొగ్గు తవ్వకాలు చేపట్టాలని, కానీ, వేలంలోనే దక్కించుకోవాలని కేంద్రం చెప్పడం సరికాదన్నారు. గతంలో ఇలాగే నాలుగు బొగ్గు బ్లాగులను బీఆర్‌ఎస్‌ పాలనలో మోడీ ప్రభుత్వం ప్రయివేటు సంస్థలకు అప్పగించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
యాత్ర సభ్యులు, సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు భూపాల్‌ మాట్లాడుతూ.. రాష్ట్ర ఆర్థిక అభివృద్ధిలో నిరుద్యోగ సమస్య పరిష్కారంలో సింగరేణి తనవంతు పాత్రను పోషిస్తోందని చెప్పారు. సింగరేణి వల్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు డివిడెంట్లు, పన్నుల రూపంలో ప్రతి సంవత్సరం వేల కోట్లు వస్తున్నాయని తెలిపారు. అదేవిధంగా.. విద్య, వైద్యం, రోడ్లు, మంచినీరు ఇతర మౌలిక సదుపాయాల కోసం వేలకోట్ల నిధులను ఇతర ప్రాంతాలకు అందిస్తోందన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేస్తున్న అన్యాయాన్ని అడ్డుకోవాల్సిన రాష్ట్ర కాంగ్రెస్‌ ప్రభుత్వం విజ్ఞప్తులతో సరిపెడుతోందని విమర్శించారు. యాత్ర మరో సభ్యులు, సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు పి.ఆశయ్య మాట్లాడుతూ.. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కూడా కేంద్రంతో పోరాడకుండా సింగరేణికి గనులు దక్కకుండా చేసిందని విమర్శించారు. ఫలితంగా కోయగూడెం బ్లాక్‌-3, సత్తుపల్లి బ్లాక్‌-3ను ప్రయివేటు కంపెనీలు దక్కించుకున్నాయని చెప్పారు. తెలంగాణ బిడ్డలకు అన్యాయం జరగకుండా ఉండాలంటే శ్రావణపల్లి బొగ్గు బ్లాక్‌లను సింగరేణికి కేటాయించాలని, గతంలో ప్రయివేటు సంస్థలకు ఇచ్చిన రెండు బ్లాకులను తక్షణమే సింగరేణి అప్పగించాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అఖిలపక్షాన్ని కలుపుకొని కేంద్రం మీద ఒత్తిడి తేవాలని సూచించారు. సింగరేణిని ప్రయివేట్‌పరం చేయడాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్ర శాసనసభలో తీర్మానం చేయాలని డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో సీపీఐ(ఎం) తరపున సింగరేణి వ్యాప్తంగా అన్ని యూనియన్లు, కాంట్రాక్ట్‌ కార్మికులను కార్మికులు, ఉద్యోగులను పెద్దఎత్తున పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు పి.రాజారావు, సీపీఐ(ఎం) నాయకులు వై.యాకయ్య, ఎర్రవెల్లి ముత్యంరావు, జ్యోతి, సీఐటీయూ నాయకులు దొమ్మటి కొమురయ్య, ఎం.ప్రభాకర్‌, ఈ కుమార్‌, ఎండీ అహ్మద్‌ పాషా, జి.గోపాల్‌ తదితరులు పాల్గొన్నారు.

Spread the love