కేంద్రం మాయలో పడొద్దు : రాష్ట్ర ప్రభుత్వానికి ఎమ్మెల్సీ నర్సిరెడ్డి సూచన
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
అంగన్‌వాడీ కేంద్రాల్లో మూడో తరగతి వరకు విద్యాబోధన చేస్తే ప్రభుత్వ పాఠశాల విద్యకు మంగళం పాడినట్టేనని ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి విమర్శించారు. ప్రభుత్వ పాఠశాలల్లో కేజీ తరగతులు లేనందున బాలబాలికలను అంగన్‌వాడీ కేంద్రాలకు కాకుండా ప్రయివేటు బడులకు తల్లిదండ్రులు తమ విద్యార్థులను పంపిస్తున్నారని తెలిపారు. దానివల్ల ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థుల నమోదు గణనీయంగా తగ్గిపోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో కేజీ తరగతులను ప్రారంభించాలంటూ ఎమ్మెల్సీగా ఎన్నికైనప్పటి నుంచి ప్రభుత్వాన్ని కోరుతున్నానని గుర్తు చేశారు. విద్యను ప్రయివేటుపరం చేసేందుకే ఎన్‌ఈపీ-2020ని కేంద్ర ప్రభుత్వం తెచ్చిందని విమర్శించారు. విధానపత్రంలోనే కేజీ తరగతులు, ఒకటి, రెండు తరగతులను అంగన్‌వాడీ కేంద్రాల్లో నిర్వహిస్తామన్నారని తెలిపారు. అందుకనుగుణంగానే రాష్ట్ర ప్రభుత్వం వాటిలో మూడో తరగతి వరకు బోధన ఇస్తున్నట్టు కనిపిస్తున్నదని పేర్కొన్నారు. కేంద్రం మాయలో రాష్ట్ర ప్రభుత్వం పడకుండా తెలంగాణ పరిస్థితులకనుగుణంగా పాఠశాల విద్యను రీఆర్గనైజ్ చేయాలని సూచించారు. కేజీ నుంచి ఐదో తరగతి వరకు వంద నుంచి 150 మంది విద్యార్థులుండేలా చూడాలనీ, ప్రతి పాఠశాలలో ఏడుగురు టీచర్లు, హెడ్మాస్టర్, పది గదులుండేలా అభివీద్ధి చేయాలని కోరారు. అప్పుడే తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ బడులకు పంపిస్తారని వివరించారు. తెలంగాణ మోడల్ ఉండాలిగానీ, పరాయి మోడల్ కావొద్దని కోరారు.