ఆటో నడవదు.. పూట గడవదు

– కుటుంబాన్ని పోషించేది ఎట్లా?
– ప్రభుత్వమే ఆదుకోవాలని ఆటో కార్మికుల వేడుకలు
నవతెలంగాణ-నిజాంపేట
ఆటో నడపదు పూట గడవదు కుటుంబాన్ని పోషించేది ఎట్లా అంటూ మండల పరిధిలోని ఆటో కార్మికులు తమ ఆవేదన వెలిబుచ్చారు శనివారం రామాయంపేట రెవెన్యూ డివిజన్‌లో తలపెట్టిన ఆటో కార్మికుల సమ్మెకు నిజాంపేట మండల కేంద్రం నుంచి ఆటో యూనియన్ల కార్మికులు బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించడంతో మహిళలు ఆటోలలో ఎవరు రావడం లేదన్నారు. తమ కుటుంబాలను ఎలా పోషించుకోవాలో అర్థం కావడం లేదన్నారు. ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు కష్టపడి ఆటోలను నడిపించుకుంటేనే తమ పొట్ట గడుస్తుందన్నారు. మహిళలకు ఉచిత ప్రయాణం మంచి సౌకర్యమైనప్పటికీ, తమ ఆటోలు నడిచేది ఎట్లా, ఆటోలు నడిస్తేనే తమ కుటుంబాలను బతికించుకుంటామన్నారు. లేకుంటే ప్రభుత్వం ఆటో కార్మికులకు ఉపాధి కల్పించాలని, లేనియెడల ఆటో కార్మికులకు నెలనెలా పింఛను మంజూరు చేయాలని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో అబ్దుల్‌ పాషా, జాల పోచయ్య, అయ్యవారు సాయికిరణ్‌, గౌస్‌ పాషా, పంజా బాలరాజ్‌, ఎండి బాబు, ఆటో కార్మికులు తదితరులు పాల్గొన్నారు.

Spread the love