విశాఖలో వివాహితపై ఆటోడ్రైవర్ యాసిడ్ దాడి

నవతెలంగాణ – విశాఖపట్టణం: విశాఖపట్టణంలో ఓ వివాహితపై ఆటో డ్రైవర్ యాసిడ్‌తో దాడిచేశాడు. పెందుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలోని నందువానిపాలెంలో జరిగిందీ ఘటన. ఈ నెల 7న ఘటన జరగ్గా బాధితురాలు నిన్న పోలీసులకు ఫోన్ ద్వారా ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం కె.శిరీష బ్యూటీషియన్. భర్తతో విభేదాల కారణంగా ఒంటరిగా నివస్తోంది. అదే ప్రాంతానికి చెందిన ఆటో డ్రైవర్ నర్సింగరావుతో ఆమెకు ఏర్పడిన పరిచయం రిలేషన్‌షిప్‌కు దారితీసింది. అయితే, ఇటీవల శిరీష, ఆమె భర్త మళ్లీ ఒక్కటయ్యారు. భర్తతో తాను కలిసి ఉంటున్నానని, తన వద్దకు రావొద్దని నర్సింగరావుకు శిరీష చెప్పింది. దీనిని జీర్ణించుకోలేకపోయిన నర్సింగ్ ఆమెపై యాసిడ్ విసిరాడు. స్థానికులు ఆమెను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. యాసిడ్ తీవ్రత తక్కువ కావడంతో పెను ప్రమాదం తప్పినా ముఖంపై రాషెస్ వచ్చాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Spread the love