ఆఫ్ఘనిస్థాన్ లో హిమపాతం..15మంది మృతి

నవతెలంగాణ-హైదరాబాద్ : గత మూడు రోజులుగా ఆఫ్ఘనిస్థాన్‌లో ప్రకృతి బీభత్సం సృష్టిస్తోంది. దేశంలోని పలు ప్రాంతాల్లో వాతావరణం ఒక్కసారిగా మారి ప్రజల ప్రాణాలకు ముప్పు వాటిల్లింది. గత మూడు రోజులుగా పలు చోట్ల భారీగా మంచు కురుస్తోంది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ ఖగోళ విపత్తు కారణంగా ఇప్పటివరకు దాదాపు 15 మంది మరణించగా, దాదాపు 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రకృతి ధాటికి మూగ జంతువులు సైతం మృత్యువాత పడుతున్నాయి. బాల్ఖ్, ఫర్యాబ్ ప్రావిన్సుల నుండి అందుకున్న సమాచారం ప్రకారం.. మంచు కారణంగా సుమారు పది వేల జంతువులు చనిపోయాయి. గత కొన్ని రోజులుగా నిరంతరంగా మంచు కురుస్తోందని, దీని వల్ల చాలా నష్టం జరుగుతోందని ఇక్కడి ప్రజలు చెబుతున్నారు. రోడ్లపై దట్టమైన మంచు పేరుకుపోయింది. దీంతో అన్ని రవాణా మార్గాలు మూసుకుపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని స్థానికులు చెబుతున్నారు.

Spread the love