కక్ష సాధింపు చర్యలు మానుకోవాలి

కక్ష సాధింపు చర్యలు మానుకోవాలి– డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇండ్లకు పట్టాలివ్వాలి : బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షులు గండ్ర జ్యోతి
నవతెలంగాణ-భూపాలపల్లి టౌన్‌
కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడు నెలలు గడుస్తున్నా ప్రజా పాలన, సంక్షేమం, అభివృద్ధిని పక్కన పెట్టి.. కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని బీఆర్‌ఎస్‌ జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా అధ్యక్షులు గండ్ర జ్యోతి అన్నారు. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో నిర్మించిన డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇండ్లకు పట్టాలను పంపిణీ చేయాలని డిమాండ్‌ చేశారు. సోమవారం జిల్లా కేంద్రంలోని అంబేద్కర్‌ కూడలి వద్ద భాస్కర్‌ గడ్డ వద్దనున్న డబుల్‌ బెడ్‌రూమ్‌ లబ్దిదారులతో కలిసి జాతీయ రహదారిపై బైటాయించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో 500 డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్లు నిర్మించినట్టు తెలిపారు. గతంలో దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులను గుర్తించి మున్సిపాలిటీ పరిధిలో చైర్మెన్‌, వైస్‌ చైర్మెన్‌, ఫ్లోర్‌ లీడర్‌ సమక్షంలో ఇండ్లను కేటాయించామని అన్నారు. కానీ ఆ ఇండ్ల పట్టాల పంపిణీలో జాప్యంతో అర్హులైన నిరుపేదలు వారం రోజులుగా నిరసన వ్యక్తం చేస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని తెలిపారు. ఎన్నికల కోడ్‌ పేరుతో జాప్యం చేస్తూ నిరుపేద లబ్దిదారులను నిరాశ, నిష్పృహలకు గురి చేస్తున్నారని అన్నారు. రోజు కూలి నాలీ చేసుకుని జీవనం సాగించే నిరుపేద లబ్దిదారులకు వెంటనే ఇండ్ల పట్టాలివ్వాలని డిమాండ్‌ చేశారు. వెంటనే స్థానిక ఎమ్మెల్యే, కలెక్టర్‌, మున్సిపల్‌ కమిషనర్‌ చొరవ తీసుకోవాలని కోరారు. లేదంటే తామే క్షేత్రస్థాయిలో పర్యవేక్షించి లబ్దిదారులతో గృహప్రవేశాలు చేయిస్తామని తెలిపారు. మాజీ సీఎం కేసీఆర్‌పై కుంభకోణాలంటూ నిందలు మోపుతూ కాళేశ్వరం ప్రాజెక్టు మరమ్మతులు చేయకుండా కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు. కాగా ఆందోళన విషయం తెలుసుకున్న పోలీసులు వచ్చి సముదాయిం చగా వెంటనే ఆందోళన విరమించారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ పట్టణ అధ్యక్షులు కటకం జనార్ధన్‌, మున్సిపల్‌ చైర్మెన్‌ వెంకటరాణి సిద్ధు, మున్సిపల్‌ వైస్‌ చైర్మెన్‌ గండ్ర హరీష్‌ రెడ్డి, కౌన్సిలర్‌ ఎడ్ల మౌనిక, డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇండ్ల లబ్దిదారులు, బీఆర్‌ఎస్‌ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Spread the love