వీధి కుక్కల బెడదను నివారించండి

వీధి కుక్కల బెడదను నివారించండి– మాజీ మంత్రి హరీశ్‌రావు డిమాండ్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలో స్వైరవిహారం చేస్తున్న వీధి కుక్కల బెడదను అరికట్టాలని మాజీ మంత్రి హరీశ్‌రావు ఒక ప్రకటనలో డిమాండ్‌ చేశారు. పసి పిల్లలను కుక్కలు పీక్కు తినడం, కుక్కకాటుకు మరణాలు అనే వార్తలు గత కొద్ది రోజులుగా రాష్ట్రంలో సర్వసాధారణంగా మారిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. హృదయ విదారక ఘటనలు జరుగుతున్నా కాంగ్రెస్‌ ప్రభుత్వానికి చీమకుట్టినట్టు లేదని విమర్శించారు. ప్రభుత్వ నిర్లక్ష్యానికి ఈ ఏడాది రాష్ట్రంలో 60 వేల మందికిపైగా కుక్క కాట్లకు గురి కాగా, పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారని పేర్కొన్నారు. కుక్క కాటుకు ఉపయోగించే యాంటీ రేబిస్‌ ఇంజక్షన్లను ఆస్పత్రుల్లో అందుబాటులో ఉంచడంలో ప్రభుత్వం తీవ్రంగా విఫలమైందని విమర్శించారు. వాటి నివారణకు ఇతర రాష్ట్రాల్లో అనుసరిస్తున్న పద్ధతులు, గత మూడేండ్లుగా కుక్క కాటు మరణం సంభవించని గోవా లాంటి రాష్ట్రాల నియంత్రణ విధానాలను అధ్యయనం చేయాలని సూచించారు. హైకోర్టు సూచన మేరకు రాష్ట్రంలో వీధి కుక్కల నియంత్రణకు కమిటీలు ఏర్పాటు చేయడంతో పాటు వాటి నివారణకు అన్ని చర్యలు చేపట్టాలని సూచించారు. కుక్క కాట్ల వల్ల మరణించిన వారికి రూ.5 లక్షలు, గాయపడ్డ వారికి రూ.50 వేల పరిహారం అందించాలని డిమాండ్‌ చేశారు.

Spread the love