అయ్యా….!!!

Yay...!!!ఎర్రబారిన పొద్దు
కిరణాల్ని ఈటెలుగా చేసి
నిలువెల్లా తూట్లు పొడుస్తాంది
మసకబారిన జీవితాల్లో
ముసలం వచ్చి పడినట్లుగా
మురికినీటి సంద్రమైతాంది

గోకినకాడ సమ్మగా వుందని
పాలన నిద్రపోతాంది
అయ్యా.. సారూ
జోడింపుల చేతులన్నీ
విదిలించుకుని వెళ్తాంటే
అదిలింపుల ధోరణి
కన్నెర్ర చేస్తా చూస్తాండాది

నాలిక చేసిన తప్పుకు
గొంతు మీద కత్తి
కసితో నిమురుతాంటే
పాణం తల్లడిల్లుతాండాది
పోట్లాటలన్నీ ఆట్లాటలుగా
జన ప్రేక్షకులకు కనువిందై
ఉత్సాహం ఉరకలేస్తాంటే
ఏలిక నాలిక్కరుచుకుండాది

అయ్యా… ఓసారి మనసిప్పి
స్వచ్ఛందంగా చూడండి
పిసురంత ఊరట
బారెడు మన్నెత్తి కూర్చుంటే
తాటికాయంత కష్టం
తాండవం చేస్తాండాది

గుబులు గుర్రమెక్కి
జీవన మలుపుల్లో
మెరుపు వేగంతో వెళ్తుంటే
ఓటేసే చేయి వణుకుతుండాది
నిలబెట్టే నమ్మకం
రోజురోజుకూ కరుగుతుండాది
– నరెద్దుల రాజారెడ్డి
సెల్‌: 9666016636

Spread the love