
నిజామాబాద్ జిల్లా బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బాబా సాహెబ్ అంబేడ్కర్ 134వ జయంతి వేడుకలను ఘనంగా సోమవారం నిర్వహించారు. నిజామాబాద్ నగరంలోని ఫులాంగ్ లో గల బాబా సాహేబ్ అంబేద్కర్ విగ్రహానికి బీసీ సంక్షేమ సంఘం జిల్లా నాయకుల ఆధ్వర్యంలో పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించి వారి సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు నరాల సుధాకర్ మాట్లాడుతు.. వంద సంవత్సరాల క్రిందటే ఒక అద్భుతమైన దూరదృష్టితో సమ సమాజాన్ని నిర్మించిన గొప్ప దార్శనికుడు బీఆర్ అంబేద్కర్ అని కొనియాడారు. వారి ఆధ్వర్యంలోనే బడుగు బలహీన వర్గాలు, దళితులు, సమాజానికి దూరంగా ఉన్న ప్రతి జాతికి మేలు కలిగిందని ఈ సందర్భంలో గుర్తు చేశారు. అంబేద్కర్ ఒక కులానికో, ఒక జాతికో, ఒక వర్గానికో చెందిన వ్యక్తి కాదని, మొత్తం భారతదేశానికి చెందిన వ్యక్తి అని, ఆయన ఒక అద్భుత శక్తి అని అన్నారు. ఆయన జయంతి సందర్భంగా వారిని గుర్తు చేసుకోవడం ఒక గొప్ప కార్యంగా భావిస్తున్నామని బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు నరాల సుధాకర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో నరాల సుధాకర్, బుస్స ఆంజనేయులు, కరిపే రవిందర్, ఆకుల ప్రసాద్, శ్రీలత, లక్ష్మీనారాయణ రాజు, రమేష్, వాసం జయ, మురళి, తదితరులు పాల్గొన్నారు.