– తెలిసీ మోడీ రాజకీయ చదరంగంలో పావుగా మారుతున్నారా?
– నాటి అవమానాలు మరిచిపోయారా?
– ఆ పార్టీలకు ఏ గతి పట్టిందో చూడాలి
– గద్దర్ నుంచి పవన్ స్ఫూర్తి పొందాలి
– రాజకీయ పరిశీలకుల సూచన
న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణస్వీకారం చేసినప్పుడు ఆయనపై ప్రధాని నరేంద్ర మోడీ ఎంతటి ఆప్యా యత, అనురాగం ప్రదర్శిం చారో అందరూ చూశారు. ఎన్డీఏ నేతల సమావేశంలో కూడా చంద్రబాబు ప్రధాని పక్కనే కూర్చొని ఆయన్ని పొగడ్తలతో ముంచెత్తారు. మోడీ కూడా బాబును ఆకాశానికి ఎత్తేశారు. మరి గతంలో జరిగిన అవమానాలను చంద్రబాబు మరచిపోయారా? చంద్రబాబుపై రాష్ట్ర పోలీసులు నమోదు చేసిన క్రిమినల్ కేసు వెనుక కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కీలక పాత్ర పోషించిందన్న విషయం చంద్రబాబు కంటే వేరెవ్వరికీ బాగా తెలిసి ఉండదు. ఈ కేసు కారణంగానే చంద్రబాబు గత సంవత్సరం అనేక నెలల పాటు జైలు జీవితాన్ని గడపాల్సి వచ్చింది.
ద్దరితోనూ దోబూచులాట
జైలులో ఉన్న చంద్రబాబుపై ఆంధ్రప్రదేశ్ ప్రజల సానుభూతి, మద్దతు అనూహ్యంగా పెరగదాన్ని ప్రధాని మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా గుర్తించారు. దీంతో సీను మారిపోయింది. ఐదు సంవత్సరాల పాటు తమకు మిత్రుడిగా వ్యవహరించి, అనేక వివాదాస్పద బిల్లులకు పార్లమెంటులో మద్దతు తెలిపిన రాష్ట్ర ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహనరెడ్డిని దూరం పెట్టి చంద్రబాబుతో జత కట్టారు. ఎన్నికల ప్రచార సమయంలో సైతం జగన్‌పై మోడీ పెద్దగా విమర్శలు చేయలేదు. ఒకవేళ వైఎస్సార్సీపీ తిరిగి అధికారంలోకి వస్తే ఆ పార్టీ మద్దతు తనకే ఉంటుందన్న మోడీ ధీమాయే దీనికి కారణమని రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానించారు.
ఎన్నికల ఫలితాలు వెలువడే వరకూ చంద్రబాబు, జగన్…వీరిద్దరితోనూ మోడీ దోబూచులాట ఆడారు. లోక్‌సభ, శాసనసభ ఎన్నికల్లో చంద్రబాబు క్లీన్‌స్వీప్ చేయడంతో బాబును మోడీ అక్కున చేర్చుకున్నారు. పైగా జగన్‌పై అనేక క్రిమినల్ కేసులు విచారణలో ఉన్నాయి. తనను అకారణంగా జైలుకు పంపిన జగన్‌పై ప్రతీకారం తీర్చుకోవడానికి ఇదే సరైన అదను అని చంద్రబాబు భావిస్తూ ఉండవచ్చు. అయితే ఆయన ఓ విషయాన్ని గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. విభజించి పాలించే మోడీ-షా రాజకీయ చదరంగంలో తాను కేవలం ఓ పావుగా మారుతున్నానన్న వాస్తవాన్ని ఆయన మరచిపోకూడదు. మోడీ రాజకీయాలపై 2019లో తాను చేసిన ట్వీట్లను చంద్రబాబు గుర్తుకు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. మోడీ రాజకీయాలు అప్పుడు, ఇప్పుడు ఒకేలా ఉన్నాయి. ఎలాంటి మార్పు లేదు.
నాటి బాబు ట్వీట్ ఇదే
‘మోడీ ఓ పద్ధతి ప్రకారం దేశంలోని ప్రతిష్టాత్మక సంస్థలను నాశనం చేశారు. బీజేపీ ప్రభుత్వ పాలనలో సంస్థాగత స్వయం ప్రతిపత్తి, ప్రజాస్వామ్యం దాడికి గురయ్యాయి’ అని చంద్రబాబు ఆనాడు ట్వీట్ చేశారు. దానిని ఆయన ప్రతి రోజూ, ప్రతి క్షణం గుర్తుకు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అనేక అంశాలపై ఆయన మోడీతో వ్యూహాత్మక ఒప్పందాలు కుదుర్చుకున్నారు.
లోక్‌సభ ఎన్నికల్లో ఎదురు దెబ్బలు తగిలినప్పటికీ ప్రతికూల ఫలితాలు రాలేదని మోడీ-షా ద్వయం చెప్పుకుంటోంది. గత విధానాలనే కొనసాగించాలని నిర్ణయించుకుంది. ఇందుకోసం ప్రజలు తీర్పు ఇవ్వలేదని భాగస్వామ్య పక్షాల నేతలైన చంద్రబాబు, నితీష్ కుమార్‌లు ప్రధానికి గుర్తు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.
పవన్ కూడా…
గత సెప్టెంబరులో చంద్రబాబును అరెస్ట్ చేసినప్పుడు జనసేనాని పవన్ కల్యాణ్ జైలులో ఆయనను పరామర్శించారు. బాబు అరెస్టును తీవ్రంగా ఖండించారు. దర్యాప్తు సంస్థలు ఏ విధంగా రాజ్యాంగ పద్ధతులను ఉల్లంఘిస్తున్నాయో వివరించారు. ఆయన బీజేపీ భాగస్వామి అయినప్పటికీ కేంద్ర దర్యాప్తు సంస్థలు జరిపిన అరెస్టులను ఖండించారు. షారూఖ్ ఖాన్ కుమారుడిని, అమ్ఆద్మీ పార్టీ నేతలను అరెస్ట్ చేసిన తీరును తప్పుపట్టారు. మిత్రపక్షమైన బీజేపీకి చెప్పకుండానే ఆయన టీడీపీతో పొత్తును ప్రకటించారు. పొత్తుపై చివరి క్షణం వరకూ నానుస్తూ వచ్చిన బీజేపీ చివరికి టీడీపీతోనే నడవాలని నిర్ణయించుకుంది. ఈడీ, సీబీఐ వంటి దర్యాప్తు సంస్థలను విమర్శిస్తూ తాను గతంలో చేసిన ప్రసంగాన్ని పవన్ కల్యాణ్ ఇప్పుడు చంద్రబాబుకు గుర్తు చేయాలని పరిశీలకులు సూచిస్తున్నారు.
తాను గద్దర్ అభిమానినని చెప్పుకునే పవన్ కల్యాణ్ ఆయన నుంచి కొంత స్ఫూర్తి పొందాల్సిన అవసరం ఉంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కేవలం మోడీతో లావాదేవీలకు సంబంధించిన ఒప్పందానికే పరిమితం కాకుండా పవన్ ప్రయత్నించాల్సి ఉంది. వచ్చే వారం పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. టీడీపీ నేతలు తమ వైఖరిని స్పష్టం చేయడానికి ఇదే సరైన సమయం. లోక్‌సభ ఎన్నికల్లో కూడా ప్రజలు ఇదే సందేశాన్ని అందించారు కదా !.
ఆ పార్టీలకు ఏ గతి పట్టింది?
ఆట ఇప్పుడే మొదలైంది.కానీ చిరుతపులి తన వేటను ఆపబోదని, పంథాను మార్చుకోదని చంద్రబాబు త్వరలోనే గ్రహిస్తారు. మోడీ, షా అదను కోసం వేచి చూస్తారని, తెలుగుదేశం పార్టీతో సంబంధాలు తెంచుకునేందుకు ఎత్తుగడలు వేస్తారని రాజకీయ విశ్లేషకులు హెచ్చరించారు. ఈ విషయం చంద్రబాబుకు కూడా తెలుసు. మోడీ, షాలు తెలుగుదేశం పార్టీని బతకనివ్వరని తాను భయపడుతున్నానని ఆయన కొన్ని సంవత్సరాల క్రితం రచయిత కపిల్ కొమిరెడ్డికి చెప్పిన మాటలు ఈ సందర్భంగా గమనార్హం. మహారాష్ట్రలో శివసేన, ఒడిషాలో బిజూ జనతాదళ్, బీహార్‌లో జేడీయూ, తమిళనాడులో అన్నా డీఎంకే పార్టీలకు ఏ గతి పట్టిందో ఆయన అధ్యయనం చేయాల్సి ఉంటుంది.