జమిలీకి బాబు మద్దతు

Babu supports Jamili– విలేకరుల సమావేశంలో మోడీపై ప్రశంసలు
– విశాఖ ఉక్కుపై నెలాఖరులోపు నిర్ణయం
అమరావతి : నరేంద్రమోడీ నేతృత్వంలోని కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఏకపక్షంగా దేశంపై రుద్దడానికి ప్రయత్నిస్తున్న జమిలీ ఎన్నికలకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మద్దతు ప్రకటించారు. ఉండవల్లిలోని తన నివాసంలో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ విషయం తెలిపారు. జమిలీ ఎన్నికలు ప్రజాస్వామ్య స్ఫూర్తికి తీవ్ర విఘాతం కలిగిస్తాయని, దేశ ఫెడరల్‌ స్వభావాన్ని దెబ్బతీస్తాయన్న విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. దేశంలోని అనేక రాజకీయ పార్టీలు, రాష్ట్ర ప్రభుత్వాలు మోడీ సర్కారు చేసిన ఈ ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నాయి. అయితే, చంద్రబాబునాయుడు మాత్రం దీనికి భిన్నంగా జమిలీ ఎన్నికలకు మద్దతుగా సంఫ్‌ుపరివార్‌, బీజేపీ చేస్తున్న వాదననే వినిపించారు. ఎన్నికలన్నీ ఒకేసారి పూర్తయితే ఐదేళ్లు పాలనపై దృష్టి సారించవచ్చని ఆయన అన్నారు. ‘ఏటా ఎక్కడో చోట ఎన్నికలు జరగడం వల్ల అభివృద్ధికి ఆటంకం ఏర్పడుతుంది. పార్లమెంటు, అసెంబ్లీ,స్థానిక సంస్థలకు ఒకే సారి ఎన్నికలు నిర్వహిస్తే బాగుంటుంది. ఆ తరువాత పాలనపైనా, అభివృద్దిపైనా దృష్టి సారించవచ్చు.’ అని చెప్పారు. హర్యానాలో బీజేపీ వరుసగా మూడోసారి విజయం సాధించడం ఎన్‌డిఎకు శభసూచకమన్నారు. హిందీ ప్రాంతాల్లో బీజేపీ తగ్గుతోందనడం సరికాదని, , హర్యానా, జమ్మూకాశ్మీర్‌ రెండు రాష్ట్రాల్లోనూ బీజేపీ కి ఓట్లు పెరిగాయని చంద్రబాబు వివరించారు. 11 ఏళ్లకాలంలో మోడీ ఆర్థిక వ్యవస్థను 11వ స్థానం నుండి ఐదోస్థానానికి తీసుకెళ్లారని, ఇదే పద్ధతిలో వెళితే ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా దేశం నిలుస్తుందని వివరించారు. ఎన్‌డిఏతో అలయన్స్‌ పెట్టుకోవడంపై గర్వపడుతున్నామని తెలిపారు.
రాష్ట్రంలో అభివృద్ధి ఇలా…
మన రాష్ట్రంలో రైల్వేమీద రూ.75 వేల కోట్లు కేంద్రం ఖర్చు చేస్తోందని చంద్రబాబు చెప్పారు. దక్షిణ భారత దేశంలో హైదరాబాద్‌-చెన్నై- బెంగుళూరు-అమరావతిని కలిపే విధంగా ఎక్స్‌ప్రెస్‌ లైను వేయనున్నారని, ఇది అభివృద్ధికి కీలకం అవుతుందని పేర్కొన్నారు. బిపిసిఎల్‌ ప్రతినిధులు రాష్ట్రంలో మూలపేట, మచిలీపట్నం, రామాయపట్నం, కృష్ణపట్నం ప్రాంతాలను పరిశీలించారని, వాటిల్లో ఒకచోట ప్లాంటు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. గ్రీన్‌ ఎనర్జీ వల్ల రైతులు, గృహావసరాల విద్యుత్‌ ఖర్చు తగ్గుతుందని తెలిపారు. అలాగే రాష్ట్రంలో కొంతమంది నాయకులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని, వారికి తగు సమయంలో తగు విధంగా సమాధానం చెబుతామని వివరించారు. జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రానికి పట్టిన అరిష్టమన్నారు. విజయవాడ వరదల సమయంలో సిఎంఆర్‌ఎఫ్‌కు గతంలో ఎన్నడూ లేనంతగా రూ.430 కోట్లకుపైగా వచ్చాయని తెలిపారు.
విశాఖ ఉక్కు పై చర్చిస్తున్నాం
విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని, సెంటిమెంట్‌తో ముడిపడి ఉందని కేంద్ర ప్రభుత్వానికి స్పష్టం చేసినట్లు ముఖ్యమంత్రి చెప్పారు. ప్లాంటు నిర్వహణ అంశంపై కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరుగుతున్నాయన్నారు. ఇప్పటికే రెండు సార్లు చర్చలు జరిగాయని, నెలాఖరులోపు పూర్తిస్థాయిలో చర్చించుకుని ఒక నిర్ణయానికి వస్తామని చెప్పారు. విశాఖ స్టీల్‌ ప్లాంటును ప్రైవేటీకరిం చకూడదని, నష్టాల నుండి కోలుకుని సుస్థిరంగా నడవాలని ఆకాంక్షను వ్యక్తం చేశారు. కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామితో రెండుసార్లు మాట్లాడినట్లు చెప్పారు. ప్రస్తుతం ప్లాంటు ఆర్థికస్థితి ఎలా ఉంది, నిర్వహణ ఎలా చేయాలి అనే అంశాలపై నివేదిక తయారు చేయాల్సి ఉందని తెలిపారు. సెయిల్‌కు సొంత గనులున్న విషయాన్ని కేంద్రం దృష్టిలో ఉంచామని, అన్ని అంశాలపై చర్చించుకుని ముందుకు వెడతామన్నారు.

Spread the love