– కాలుతో పొట్టపై నొక్కి బలవంతంగా బిడ్డను తీశారని బాధితుల ఆరోపణ
– పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు
నవతెలంగాణ-హుజూర్‌నగర్
సూర్యాపేట జిల్లా, హుజూర్‌నగర్ పట్టణంలోని ఏరియాస్పత్రిలో దారుణం జరిగింది. రాత్రి వేళ పురిటి నొప్పులతో బాధపడుతున్న గర్భిణికి సాధారణ ప్రసవం చేయగా.. అనంతరం శిశువు చనిపోయాడు. డ్యూటీలో ఉన్న నర్సులు, సిబ్బంది నిర్లక్ష్యం మూలంగానే తమ బిడ్డను కోల్పోయామని బాధితులు హుజూర్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో మంగళవారం రాత్రి ఫిర్యాదు చేశారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. మిర్యాలగూడ మండలం, ఆళ్లగడప గ్రామానికి చెందిన నాగరాజు తన భార్యను ప్రసవం కోసం ఈ నెల 15న హుజూర్‌నగర్ ప్రభుత్వాస్పత్రిలో చేర్పించాడు. సోమవారం తెల్లవారుజామున పురిటి నొప్పులు రావడంతో సాధారణ ప్రసవం చేస్తామని నర్సులు చెప్పారు. అయితే, నర్సులు కాలుతో పొట్టపై నొక్కి శిశువును బలవంతంగా బయటకు తీశారు. అనంతరం శిశువును సూర్యాపేట జిల్లా కేంద్ర ఆస్పత్రికి పంపించారు. మంగళవారం ఉదయం శిశవు మృతిచెందింది. దీంతో సిబ్బంది నిర్లక్ష్యంతోనే తన బిడ్డ చనిపోయిందని నాగరాజు హుజూర్‌నగర్ ఏరియాస్పత్రికి వచ్చి ఆందోళన చేశారు. సిబ్బంది ముందే చెప్పి ఉంటే ఏదో ఒక ప్రయివేట్ ఆస్పత్రికి తీసుకెళ్లి తన భార్యకు కాన్పు చేయించుకునేవాడినని ఆవేదన వ్యక్తం చేశారు. డాక్టర్ల నిర్లక్ష్యం మూలంగానే బిడ్డను కోల్పోయానని ఆవేదన వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
డాక్టర్ సమక్షంలోనే ప్రసవం..
– ఆస్పత్రి సూపరింటెండెంట్ ప్రవీణ్ కుమార్
సోమవారం ఉదయం డ్యూటీ డాక్టర్ గైనకాలజిస్ట్ సంధ్య ఆస్పత్రిలోనే ఉన్నారు. ఆమె సమక్షంలోనే కాన్పు జరిగింది. బాబు పుట్టిన వెంటనే ఏడవకపోవడంతో పరీక్షించి మెరుగైన వైద్య సేవల కోసం జిల్లా ఆస్పత్రికి పంపించాం. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం మరణించాడు. ఇందులో తమ నిర్లక్ష్యం ఏమీ లేదు.