ప్రభుత్వాస్పత్రిలో శిశువు మృతి

– అందుబాటులో లేని డాక్టర్‌.. ప్రసవం చేసిన నర్సులు
నవతెలంగాణ-కోదాడరూరల్‌
ప్రభుత్వాస్పత్రిలో డాక్టర్‌ అందుబాటులో లేకపోవడం.. సమాచారం అందించినా రాకపోవడంతో చివరకు నర్సులే ప్రసవం చేశారు. కానీ.. శిశువు పరిస్థితి విషమించి మృతి చెందింది. ఈ ఘటన మంగళవారం సూర్యాపేట జిల్లా కోదాడ ప్రభుత్వాస్పత్రిలో జరిగింది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. నడిగూడెం మండలం కరివిరాల (పెరికగూడెం) గ్రామానికి చెందిన మానసకు పురిటి నొప్పులు రావడంతో సోమవారం కోదాడ ప్రభుత్వాస్పత్రికి తీసుకొచ్చారు. వైద్యులు పరిశీలించి వాతం నొప్పి అని చెప్పారు. మరలా మంగళవారం తెల్లవారుజామున నొప్పులు రావడంతో నర్సులు వైద్యురాలికి సమాచారం అందించారు. ఆమె రాలేనని చెప్పడంతో నర్సులే కాన్పు చేశారు. శిశువు పరిస్థితి ప్రమాదంగా ఉందని, ప్రయివేట్‌ ఆస్పత్రికి తీసుకెళ్లాలని హడావుడి చేశారు. అయితే, అంబులెన్స్‌ డ్రైవర్‌ ప్రయివేట్‌ ఆస్పత్రికి రానన్నారు. ఇదే సమయంలో పరిస్థితి విషమించి శిశువు మృతిచెందింది. తమకు న్యాయం చేయాలని బాధిత కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. బాధితులు డాక్టర్లను నిలదీశారు. వైద్యులు అందుబాటులో ఉంటే శిశువు బతికి ఉండేదని ఆవేదన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వారిని సముదాయించారు.

Spread the love