– కోవాగ్జిన్ భద్రతపై వ్యాసాన్ని ప్రచురించిన జర్నల్
– నిర్ధారణలను విశ్వసించలేమంటూ ఉపసంహరణ
– ప్రముఖుల అభ్యంతరం
న్యూఢిల్లీ : కోవిడ్ మహమ్మారి నుండి ప్రజలను రక్షించేందుకు ఉపయోగించిన కోవాగ్జిన్ సురక్షితమైనదా కాదా అనే విషయంపై రూపొందించిన ఓ అధ్యయన పత్రం ‘డ్రగ్ సేఫ్టీ’ అనే జర్నల్‌లో ప్రచురిత మైంది. అయితే ఈ పత్రాన్ని మంగళవారం ఆ జర్నల్ ఉపసంహరిం చుకుంది. ఆ వ్యాసంలో పొందుపరచిన నిర్ధారణలు విశ్వసించదగినవిగా లేవని, అందుకే దానిని వెనక్కి తీసుకుంటున్నామని వివరణ ఇచ్చింది. కోవాగ్జిన్ తీసుకున్న వారిలో మూడో వంతు మందికి పైగా ప్రజలు తీవ్రమైన ఆరోగ్య సమస్యలను ఎదుర్కొన్నారని ఈ అధ్యయనం తెలిపింది. బనారస్ హిందూ విశ్వవిద్యాలయానికి చెందిన కొందరు పరిశోధకులు ఈ పత్రాన్ని రూపొందించారు.
ఆ వ్యాసంలో పరిశోధకులు కొన్ని నిర్ధారణలు చేశారని, అయితే అవి ఎంతమాత్రం విశ్వసించదగినవిగా లేవని సంపాదకుడు, ప్రచురణకర్త అభిప్రాయపడ్డారని జర్నల్ తెలిపింది. కోవాగ్జిన్‌పై వ్యాసంలో పొందుపరచిన అభిప్రాయాలు తప్పుడు అంచనాలకు వచ్చేలా ఉన్నాయని, అందుకే ప్రజారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని దానిని తొలగించామని వివరించింది. ప్రస్తుతం జర్నల్‌లో ఆ పత్రం కన్పించడం లేదు. కాగా జర్నల్ నిర్ణయంపై పరిశోధకులు విభేదించారు.
అంతర్జాతీయంగా ఆమోదం పొందిన పబ్లిక్ ఎథిక్స్ కమిటీ (కోప్) మార్గదర్శకాల మేరకు జర్నల్ ఆ వ్యాసాన్ని తొలగించింది. పరిశోధనా పత్రంలో అనేక లోపాలు ఉన్నాయంటూ భారత వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్) మే 24న జర్నల్ సంపాదకుడికి ఓ లేఖ రాసింది. కాగా పత్రాన్ని ఉపసంహరించుకోవద్దంటూ 600 మంది పౌరులు జర్నల్ సంపాదకుడికి ఓ లేఖ రాశారు. దానిని మీడియాకు విడుదల చేసిన రోజునే జర్నల్ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ లేఖపై పలువురు వైద్య నిపుణులు, సామాజిక కార్యకర్తలు, ప్రజారోగ్య పరిశోధకులు, హోమియోపతి ప్రాక్టీషనర్లు, ఐటీ కన్సల్టెంట్లు, ఆయుర్వేద నిపుణులు, శాస్త్రవేత్తలు సంతకాలు చేశారు.