ఏలూరు జిల్లాలో ఘోరం

ఏలూరు జిల్లాలో ఘోరం– చిన్నారిపై ఆగంతకుని లైంగిక దాడి
నూజివీడు: ఏలూరు జిల్లా నూజివీడు మండలం పల్లెర్లమూడిలో నాలుగు సంవత్సరాల చిన్నారిపై లైంగిక దాడి జరిగింది. ఈ ఘటన తీవ్ర సంచలనం సృష్టించింది. కుటుంబంతో కలిసి ఇంటి వద్ద ఆరుబయట నిద్రిస్తున్న చిన్నారిని ఎత్తుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడడం అందరినీ కలిచి వేసింది. ఇందకు సంబంధించి స్థానికుల కథనం ప్రకారం… పల్లెర్లమూడిలో ఎస్‌టి సామాజిక తరగతికి చెందిన ఒక కుటుంబ కూలి పనులు చేసుకుంటూ జీవిస్తోంది. ఉక్కబోత ఎక్కువగా ఉండడంతో ఇంటి ఆరు బయట నిద్రిస్తున్న తాత, నానమ్మతో కలిసి చిన్నారి ఆదివారం రాత్రి పడుకుంది. తల్లిదండ్రులు, మరో ఇద్దరు పిల్లలు ఇంటి లోపల నిద్రించారు. అంతా ఆదమరిచి నిద్రిస్తున్న సమయంలో ఆగంతకుడు ఇంటి గోడపై ఉంచిన బాలిక తండ్రి సెల్‌ఫోన్‌ను దొంగిలించాడు. అనంతరం ఆరు బయట నిద్రిస్తున్న చిన్నారిని అపహరించి సమీపంలోని పామాయిల్‌ తోటలోకి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. స్పృహ కోల్పోయిన చిన్నారి పట్టీలను సైతం అపహరించి అక్కడ నుంచి పరారయ్యాడు. బాలికకు స్పృహ వచ్చాక తోటలోనుంచి రోడ్డుపైకి వచ్చింది. అదే సమయంలో సోమవారం తెల్లవారుజామున మూడు గంటల సమయంలో పొలం వద్దకు వెళ్తున్న ఆ ఊరి పెద్ద… ఆ బాలికను చూసి ఆరా తీయడంతో తన తల్లిదండ్రుల పేర్లు చెప్పింది. వెంటనే ఆయన సమీపంలోని గ్రామస్తులకు, ఆ చిన్నారి తల్లిదండ్రులకు సమాచారమిచ్చారు. వారిచ్చిన సమాచారం మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని చిన్నారిని నూజివీడు ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స నిమిత్తం విజయవాడ తరలించారు. నూజివీడు ఆర్‌డిఒ భవానీ శంకరి సంఘటనా స్థలాన్ని సందర్శించారు. పోలీసులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ ఘటన నేపథ్యంలో చిన్నారి తీవ్ర భయాందోళనతో ఉంది.
అఘాయిత్యానికి పాల్పడిన ఆగంతకుడిని గుర్తించి శిక్షించండి : మంత్రి పార్థసారథి
చిన్నారిపై లైంగిక దాడి పట్ల రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. అఘాయిత్యానికి పాల్పడిన ఆంగతకుడిని గుర్తించి తక్షణం అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని జిల్లా యంత్రాంగాన్ని, పోలీస్‌ ఉన్నతాధికారులను ఆదేశించారు. అవసరమైతే జాగిలాలను రంగంలోకి దించాలని సూచించారు.

Spread the love