– నదిలోకి దూసుకెళ్ళిన యూపీ బస్సు
– 14మంది భారతీయులు మృతి
– బయటపడిన 29మంది
ఖాట్మండు : నేపాల్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. భారత పర్యాటకులు ప్రయాణిస్తున్న బస్సు నదిలోకి దూసుకెళ్ళడంతో 14మంది చనిపోయారు. సెంట్రల్ నేపాల్‌లో శుక్రవారం మర్స్యాంగ్డి నదిలో బస్సు పడిపోయింది. ఆ సమయంలో బస్సులో డ్రైవర్, అసిస్టెంట్‌తో సహా 41మంది ప్రయాణికులు వున్నారు. గోరఖ్‌పూర్‌కి చెందిన ఈ బస్సు రిసార్ట్ టౌన్ అయిన పోఖ్రా నుంచి బయలుదేరి రాజధాని ఖాట్మండుకు వెళుతోంది. తన్హన్ జిల్లాలో ఆయినా పహరాలో హైవైపై నుంచి బస్సు నదిలోకి దూసుకువెళ్ళింది. వెంటనే నదిలో పడిన బస్సు నుంచి 29 మందిని కాపాడగలిగారు. ”ఈ బస్సు యూపీిలో రిజిస్ట్రరైంది. పోఖ్రా నుండి ఖాట్మండు మీదుగా గోరఖ్‌పూర్ వెళుతోంది. 29 మందిని బస్సులో నుంచి వెలికి తీసి ఆస్పత్రికి పంపాం” అని మాత్రమే జిల్లా పోలీసు కార్యాలయ అధికారులు తెలిపారు. వారి పరిస్థితి ఎలా వుందో వెంటనే తెలియరాలేదు. నేపాల్ విపత్తు నిర్వహణా శిక్షణా స్కూలుకు చెందిన సీనియర్ ఎస్‌ఫీ మహదేవ్ పౌడల్ నేతృత్వంలో 45మంది సాయుధ పోలీసు బృందం ఈ సహాయక, వెలికితీత చర్యల్లో పాల్గొంది. శుక్రవారం ఉదయం 11.30గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగిందని చెప్పారు.
గత నెలలో నేపాల్‌లో పొంగి పొర్లుతున్న త్రిశూలి నదిలో రెండు బస్సులు కొట్టుకు పోయిన ఘటనలో 65 మంది ప్రయాణికులు మరణించారు. దాదాపు వంద కిలోమీటర్ల దూరంలో మృతదేహాలు కనిపించాయి. ఈ ప్రమాదంలో ఐదుగురు భారతీయుల మృత దేహాలు లభ్యం కాగా, ఇద్దరి ఆచూకీ తెలియరాలేదు. ఎన్‌డీఆర్‌ఎఫ్‌కి చెందిన 12మంది సభ్యుల బృందం విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టినా కొట్టుకుపోయిన ఆ బస్సుల ఆచూకీ దొరకలేదు.
ఘటనా స్థలానికి యూపీ ప్రభుత్వాధికారులు
తన్హన్ జిల్లాలోని అంబుకరేని ప్రాంతంలో హైవై పై నుంచి 150 మీటర్ల లోతులో నదిలోకి బస్సు పడిపోవడంతో 14 మంది చనిపోయారని, 29 మందిని కాపాడారని నేపాల్ అధికారులు ధృవీకరించారని యూపీ ప్రభుత్వ సహాయ కమిషనర్ నవీన్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. సమాచారం అందుకోగానే సీనియర్ డివిజనల్ మేనేజర్ సంఘటనా స్థలానికి వెళ్ళారని, సహాయక చర్యల సమన్వయం కోసం ఏడీఎంని నియమించామని చెప్పారు. స్థానిక అధికారులతో మాట్లాడి సమాచారం తెలుసుకుంటున్నామని చెప్పారు. పర్వత ప్రాంతాలు కావడం వల్ల నేపాల్‌లో సాధారణంగా నదులు చాలా వేగంగా, ఒరవడిగా ప్రవహిస్తూ వుంటాయి. గత కొద్ది రోజులుగా భారీ వర్షాలతో వరద నీరు రావడం వల్ల మురికిగా వుండి నదిలో పడినవి కనిపించడం కూడా కష్టంగా వుంటుంది. జూన్‌నుండి సెప్టెంబరు వరకు నేపాల్‌లో భారీ వర్షాలు పడతాయి.