బైజూస్‌కు గడ్డుకాలం ఆర్థిక ఫలితాల వెల్లడిలో విఫలం

– వైదొలిగిన డెలాయిట్‌ ఆడిటర్లు
– ముగ్గురు డైరెక్టర్ల రాజీనామా
– రుణాల చెల్లింపునపై ఒత్తిడి
– మరోవైపు ఉద్యోగులపై వేటు
న్యూఢిల్లీ: ప్రముఖ ఎడ్‌టెక్‌ సంస్థ బైజూస్‌కు గడ్డుకాలం మొదలయ్యింది. ఆ సంస్థకు ముగ్గురు డైరెక్టర్లు రాజీనామా చేశారు. అదే విధంగా ఆర్థిక ఫలితాలను వెల్లడించడంలో విఫలం కావడంతో ఆ సంస్థ చట్ట బద్దంగా నియమించుకున్న డెలాయిట్‌ హాస్కిన్స్‌ అండ్‌ సెల్స్‌ కూడా తప్పు కుంది. కంపెనీని నిర్వహించే విషయంలో బైజూస్‌ వ్యవస్థాపకుడు రవీంద్రన్‌ తో ఏడాదిగా కొనసాగుతున్న విభేదాలే రాజీనామాకు కారణమని సమా చారం. కాగా.. బైజూస్‌ మాతృసంస్థ అయినా థింక్‌ అండ్‌ లెర్న్‌ ప్రయివేటు లిమిటెడ్‌ బోర్డు సభ్యులకు డెలాయిట్‌ ఓ లేఖ రాసిందని బిజినెస్‌ స్టాండర్డ్‌ ఓ కథనం ప్రచురించింది. ”2022 మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్స రానికి కంపెనీ ఆర్థిక నివేదికలు చాలా ఆలస్యం అయ్యాయి. దీని పరిష్కా రానికి మాకు ఎలాంటి సమాచారం అందడం లేదు. ఆడిట్‌ నివేదిక సవరణ లు, ఆర్థిక నివేదికల యొక్క ఆడిట్‌ సంసిద్దత స్థితి, ప్రాథమిక పుస్తకాలు, రికార్డులు ఇవ్వకపోవడంతో మేము ఆడిట్‌ను ప్రారంభించలేకపోయాము.” అని డెలాయిట్‌ తెలిపింది. ఆడిటింగ్‌ ప్రమాణాలకు అనుగుణంగా ఆడిట్‌ను ప్లాన్‌ చేయడం, డిజైన్‌ చేయడం, నిర్వహించడం, పూర్తి చేయడం వంటి వాటి సామర్థ్యంపై ఈ ఆలస్యం తీవ్ర ప్రభావాన్ని చూపుతుందని ఆ సంస్థ లేఖలో పేర్కొంది. పై అంశాలను దృష్టిలో పెట్టుకుని మేము బైజూస్‌ యొక్క చట్టబద్ధమైన ఆడిటర్‌గా తాము తక్షణమే రాజీనామా చేస్తున్నామని వెల్లడించింది. 2020 ఏప్రిల్‌ 1 నుంచి 2025 మార్చి 31 వరకు డెలాయిట్‌ ఆడిటర్‌గా నియమించబడింది. కాగా మరోవైపు 2021-22 నుంచి వచ్చే ఐదేళ్ల వరకు తమ సంస్థ కొత్తగా బిడిఒ (ఎంఎస్‌కెఎ అండ్‌ అసోసియేట్స్‌) చట్టబద్ద ఆడిటర్‌గా నియమించుకున్నట్లు బైజూస్‌ ప్రకటించడం విశేషం. డెలాయిట్‌ రాజీనామాతో పాటు, బైజూస్‌ బోర్డు సభ్యులు ముగ్గురు కూడా కంపెనీకి రాజీనామా చేశారు. వీరిలో సీక్వోరు క్యాపిటల్‌కు చెందిన జివి రవిశంకర్‌, చాన్‌ జుకర్‌బర్గ్‌ ఇనిషియేటివ్‌కు చెందిన వివియన్‌ వు, ప్రోసస్‌కు చెందిన రస్సెల్‌ డ్రీసెన్‌స్టాక్‌ ఉన్నారు. వీరి రాజీనామాకు కంపెనీ ఇంకా ఆమోదం తెలపలేదని సమాచారం. దీనిపై అటు బైజూస్‌ గానీ… రాజీనామా చేసిన వ్యక్తులు గానీ అధికారికంగా స్పందించలేదు. తాజా రాజీనామాలు వాస్తవమైతే బైజూస్‌ను మరింత ఒత్తిడిలోకి నెట్టనున్నాయి. 1.2 బిలియన్‌ డాలర్ల రుణాన్ని (టిఎల్‌బి) త్వరితగతిన చెల్లించాలంటూ ఒత్తిడి తెస్తోందన్న ఆరోపణలతో ఇన్వెస్ట్‌మెంట్‌ సంస్థ రెడ్‌వుడ్‌పై బైజూస్‌ ఇప్పటికే అమెరికాలోని న్యూయార్క్‌ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. అమెరికాలో న్యాయపోరటం చేస్తున్న తరుణంలో ఆడిటర్లు, డైరెక్టర్ల రాజీనామా ఆ సంస్థను మరింత ఆందోళనకు గురి చేయనుంది. మరోవైపు వ్యయాలు తగ్గించుకోవాలనే ఉద్దేశ్యంతో ఇటీవల బైజూస్‌ 1,000 మంది ఉద్యోగులను తొలగించడం గమనార్హం.

Spread the love