– రాష్ట్రవ్యాప్తంగా 11 వరకు నిర్వహణ
– 12 నుంచి పాఠశాలలు పున : ప్రారంభం
– బడులకు 229 పనిదినాలు
– వచ్చే ఏడాది ఏప్రిల్ 23 చివరి పనిదినం
– ప్రార్థన అనంతరం రోజూ ఐదు నిమిషాలు యోగా, ధ్యానం
– వచ్చే విద్యాసంవత్సరంలో బ్యాగ్‌లేని రోజులు పది
– అక్టోబర్ 21 నుంచి 28 వరకు ఎస్ఏ-1
– ఏప్రిల్ 9 నుంచి 19 వరకు ఎస్ఏ-2 పరీక్షలు
– పాఠశాలల అకడమిక్ క్యాలెండర్ విడుదల
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలో 2024-25 విద్యా సంవత్సరంలో వచ్చేనెల 12 నుంచి పాఠశాలలు పున:ప్రారంభమవతాయని ప్రభుత్వం వెల్లడించింది. అదేనెల ఒకటి నుంచి బడిబాట కార్యక్రమం ప్రారంభమవుతుందని ప్రకటించింది. వచ్చేనెల 11 వరకు కొనసాగనుంది. వచ్చే విద్యాసంవ త్సరంలో పాఠశాలలకు జూన్ 1 నుంచి బడిబాట మొత్తం 229 పనిదినాలుంటాయని తెలిపింది. వచ్చే ఏడాది ఏప్రిల్ 23 పాఠశాలలకు చివరి పనిదినమని స్పష్టం చేసింది. ఈ మేరకు విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం పాఠశాలల్లో ఒకటి నుంచి పదో తరగతి వరకు చదివే విద్యార్థులకు సంబంధించిన అకడమిక్ క్యాలెండర్‌ను శనివారం విడుదల చేశారు. అనంతరం పాఠశాల విద్యాశాఖ కమిషనర్ శ్రీదేవసేన ఒక ప్రకటన విడుదల చేశారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 24 నుంచి జూన్ 11 వరకు వేసవి సెలవులుంటాయని తెలిపారు. వచ్చే ఏడాది జనవరి పదో తేదీ వరకు పదో తరగతి విద్యార్థులకు సిలబస్‌ను పూర్తి చేయాలని పేర్కొన్నారు. ఫిబ్రవరి 28 వరకు ఒకటి నుంచి తొమ్మిదో తరగతి విద్యార్థులకు సిలబస్ పూర్తి చేయాలని తెలిపారు. పాఠశాలల్లో ప్రార్థన (అసెంబ్లీ) ముగిసిన తర్వాత ప్రతిరోజూ ఐదు నిమిషాలపాటు యోగా, ధ్యానం చేయాలని కోరారు. వచ్చే విద్యాసంవత్సరంలో బ్యాగ్‌లేని రోజులు పది ఉంటాయని వివరించారు. ప్రతినెల మూడో శనివారం తల్లిదండ్రులు, టీచర్ల సమావేశం నిర్వహించాలనీ, గ్రీన్ అవర్, బాలసభ జరపాలని సూచించారు.
జులై 31 నాటికి ఎఫ్ఏ-1 పరీక్షలు
రాష్ట్రంలో ఒకటి నుంచి పదో తరగతి విద్యార్థులకు జులై 31 నాటికి ఫార్మేటివ్ అసెస్మెంట్ (ఎఫ్ఏ-1) పరీక్షలను నిర్వహించాలని బుర్రా వెంకటేశం తెలిపారు. సెప్టెంబర్ 30 నాటికి ఎఫ్ఏ-2 పరీక్షలు జరపాలని పేర్కొన్నారు. అక్టోబర్ 21 నుంచి 28 వరకు సమ్మేటివ్ అసెస్మెంట్ (ఎస్ఏ-1) పరీక్షలుంటాయని వివరించారు. డిసెంబర్ 17 నాటికి ఎఫ్ఏ-3 పరీక్షలుంటాయని తెలిపారు. వచ్చే ఏడాది జనవరి 29 నాటికి పదో తరగతి విద్యార్థులకు ఎఫ్ఏ-4 పరీక్షలను నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఫిబ్రవరి 28 నాటికి ఒకటి నుంచి తొమ్మిదో తరగతి విద్యార్థులకు ఎఫ్ఏ-4 పరీక్షలుంటాయని వివరించారు. ఏప్రిల్ తొమ్మిది నుంచి 19 వరకు ఒకటి నుంచి తొమ్మిదో తరగతి విద్యార్థులకు ఎస్ఏ-2 పరీక్షలను నిర్వహిస్తామని తెలిపారు. ఫిబ్రవరి 28వ తేదీలోపు పదో తరగతి విద్యార్థులకు ప్రీ ఫైనల్ పరీక్షలను చేపడతామని పేర్కొన్నారు. మార్చిలో పదో తరగతి విద్యార్థులకు వార్షిక పరీక్షలుంటాయని వివరించారు.
పండుగ సెలవులు
దసరా సెలవులు అక్టోబర్ 2 నుంచి 14 వరకు (13 రోజులు)
క్రిస్మస్ సెలవులు (మిషినరీ స్కూళ్లకు) డిసెంబర్ 23 నుంచి 27 వరకు (ఐదు రోజులు)
సంక్రాంతి సెలవులు జనవరి 13 నుంచి 17 వరకు (ఐదు రోజులు)
అకడమిక్ క్యాలెండర్లో ముఖ్యాంశాలు
జూన్ 1 నుంచి 11 వరకు బడిబాట కార్యక్రమం
జూన్ 12 నుంచి బడులు పున:ప్రారంభం
జులై 31 నాటికి ఎఫ్ఏ-1 పరీక్షలు
సెప్టెంబర్ 30 నాటికి ఎఫ్ఏ-2 పరీక్షలు
అక్టోబర్ 21 నుంచి 28 వరకు ఎస్ఏ-1 పరీక్షలు
డిసెంబర్ 17 నాటికి ఎఫ్ఏ-3 పరీక్షలు
జనవరి 29 నాటికి పది విద్యార్థులకు ఎఫ్ఏ-4 పరీక్షలు
ఫిబ్రవరి 28 నాటికి 1 నుంచి 9వ తరగతి
విద్యార్థులకు ఎఫ్ఏ-4 పరీక్షలు
ఏప్రిల్ 9 నుంచి 19 వరకు ఎస్ఏ-2 పరీక్షలు
ఫిబ్రవరి 29కి ముందే టెన్త్ ప్రీ ఫైనల్
మార్చిలో టెన్త్ పరీక్షలు
స్కూళ్లకు చివరి పనిదినం ఏప్రిల్ 23
ఏప్రిల్ 24 నుంచి జూన్ 11 వరకు వేసవి సెలవులు