కేజ్రీవాల్‌కు బెయిల్‌

Bail for Kejriwal– షరతులతో సుప్రీం మంజూరు
– తీహార్‌ జైలు నుంచి విడుదలైన ఆప్‌ అధినేత
– అభివాదం చేసిన ఢిల్లీ సీఎం
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌కు ఊరట లభించింది. సార్వత్రిక ఎన్నికల్లో ఆమ్‌ ఆద్మీ పార్టీ తరపున ప్రచారం చేసేందుకు వీలు కల్పిస్తూ కేజ్రీవాల్‌కు అత్యున్నత న్యాయస్థానం మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసింది. జూన్‌ 1 వరకు ఈ బెయిల్‌ ఇస్తూ సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. జూన్‌ 2న తిరిగి లొంగిపోవాలని కేజ్రీవాల్‌ను ఆదేశించింది. కేజ్రీవాల్‌ బెయిల్‌ పిటిషన్‌పై శుక్రవారం సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ దీపాంకర్‌ దత్తాలతో కూడిన ధర్మాసనం తీర్పు ఇచ్చింది. కేజ్రీవాల్‌కు మధ్యంతర ఉపశమనం మంజూరు చేయడంపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) తరపున కోర్టుకు హాజరైన సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా, అదనపు సొలిసిటర్‌ జనరల్‌ ఎస్‌వి రాజు వ్యతిరేకించారు. ఖలిస్తానీ కార్యకలాపాలపై జాతీయ భద్రతా చట్టం కింద నిర్బంధించబడిన అమృత్‌పాల్‌సింగ్‌ కూడా ఎన్నికల్లో పోటీ చేసేందుకు బెయిల్‌ కోసం కోర్టును ఆశ్రయించారని సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా పేర్కొన్నారు. ఎన్నికల నేపథ్యం లో కేజ్రీవాల్‌కు బెయిల్‌ మంజూరు తీవ్ర ప్రభావం చూపుతుందని తెలిపారు. దీనికి స్పందించిన జస్టిస్‌ ఖన్నా ”అది (.అమృత్‌ పాల్‌ సింగ్‌ కేసు) భిన్నమైనది” అని అన్నారు. అభ్యర్థి కానప్పుడు ప్రచారానికి ఒక వ్యక్తిని విడుదల చేసినందుకు ఎటువంటి పూర్వా పరాలు లేవని ఎస్‌జీ అన్నారు. దీనిపై జస్టిస్‌ ఖన్నా ”మేము జూన్‌ 1 వరకు ఆయనకు మధ్యంతర ఉపశమనం ఇస్తూ ఆర్డర్‌ను పాస్‌ చేస్తున్నాం. సాయంత్రంలోగా ఆర్డర్‌ను అప్‌లోడ్‌ చేస్తాం” అని అన్నారు. ఈడీ అరెస్టును సవాల్‌ చేస్తూ కేజ్రీవాల్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై తుది వాదనలు వచ్చే వారంలో ముగిసే ప్రయత్నం చేస్తామని జస్టిస్‌ ఖన్నా పేర్కొన్నారు.అయితే, లిక్కర్‌ కేసు గురించి ఎన్నికల ప్రచారంలో కేజ్రీవాల్‌ మాట్లాడొద్దని ఈడీ తరపు న్యాయవాది కోర్టును కోరారు. దీనికి స్పందించిన ధర్మాసనం.. మీరు కూడా అంతకంటే గట్టిగా కౌంటర్‌ ఇవ్వాలని సూచించింది. 21 రోజులు కేజ్రీవాల్‌ జైల్లో ఉన్నా బయట ఉన్నా పెద్ద తేడా ఉండదని పేర్కొన్నారు. కాగా, కేజ్రీవాల్‌కు జూన్‌ 4 వరకు బెయిల్‌ మంజూరు చేయాలని ఆయన తరపు న్యాయవాది కోరగా.. ఆ అభ్యర్థనను సుప్రీంకోర్టు తిరస్కరించింది. జూన్‌ 2న తిరిగి లొంగిపోవాల్సిందేనని స్పష్టం చేసింది. కాగా కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేయడాన్ని వ్యతిరేకిస్తూ ఈడీ గురువారం సుప్రీంకోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేసింది. శుక్రవారం సాయంత్రం తీహార్‌ జైలు నుంచి కేజ్రీవాల్‌ విడదలయ్యాక..అక్కడి వచ్చిన పార్టీ శ్రేణులు,నాయకులకు అభివాదం చేశారు.

Spread the love