నవతెలంగాణ-హైదరాబాద్ : తనకు మద్దతు తెలిపిన ప్రతి ఒక్కరికీ హుజూరాబాద్ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. బెయిల్‌పై బయటకు వచ్చిన ఆర్‌అండ్‌బీ గెస్ట్ హౌస్ నుంచి నేరుగా హైదరాబాద్ బయల్దేరి వెళ్లారు. ఈ సందర్భంగా పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ.. పండుగ కాబట్టి రాజకీయాలు మాట్లాడటం లేదని తెలిపారు. కోర్టు ఆదేశాల ప్రకారం కరీంనగర్‌లో ఏం మాట్లాడటం లేదని అన్నారు. రేపు హైదరాబాద్‌లో ప్రెస్‌మీట్ పెడతానని వెల్లడించారు.
నిన్న సాయంత్రం హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని ఓ టీవీ ఛానల్ ఎదుట పాడి కౌశిక్ రెడ్డిని కరీంనగర్ పోలీసులు అరెస్టు చేశారు. అక్కడి నుంచి నేరుగా కరీంనగర్‌కు తరలించారు. రాత్రంతా కరీంనగర్ త్రీటౌన్ పోలీస్ స్టేషన్‌లోనే నిర్బంధించారు. ఇవాళ ఉదయం పీఎస్ నుంచి కరీంనగర్ రెండో అదనపు మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచారు. దీనిపై విచారణ జరిపిన న్యాయమూర్తి.. కౌశిక్ రెడ్డికి అన్ని కేసుల్లో బెయిల్ మంజూరు చేశారు. రెండు కేసుల్లో రూ.25వేల చొప్పున రూ.50వేల పర్సనల్ బాండ్ సమర్పించాలని ఆదేశించారు. అలాగే అన్ని కేసులు కూడా బెయిలబుల్ సెక్షన్లు కావడంతో కౌశిక్ రెడ్డి కేసుపై రిమాండ్ రిపోర్టును కొట్టివేశారు.