– పేద ముస్లింలకు ఇండ్లు కట్టిస్తాం
– నిరుద్యోగులకు ఉద్యోగాలలో రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ
నవతెలంగాణ – నల్గొండ కలెక్టరేట్
త్యాగాలకు ప్రతీక బక్రీద్ పండుగ అని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. బక్రీద్ పండుగ సందర్భంగా సోమవారం ఆయన నల్గొండ జిల్లా కేంద్రంలోని మునుగోడు రోడ్డులో ఉన్న ఈద్గాలో నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనలలో పాల్గొని రాష్ట్ర ప్రజలకు, నల్గొండ జిల్లా ప్రజలకు బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేశారు. బక్రీద్ పండుగ అంటేనే త్యాగాలకు ప్రతీక అని అన్నారు. నల్గొండ పట్టణంలో గత 30 సంవత్సరాలుగా హిందూ, ముస్లిం అనే తేడా లేకుండా అందరూ అన్నదమ్ములలాగా కలిసి మెలిసి ఉంటున్నారని అన్నారు.తాము పేద ముస్లింలకు ఇండ్లు కట్టిస్తామని,ముస్లిం జనాభా పెరుగుతున్న దృష్ట్యా ఈద్గాను అభివృద్ధి చేస్తామన్నారు. ముస్లింలకు విద్యారంగంలో, ఉద్యోగాలలో రిజర్వేషన్లు కల్పిస్తామని, ఔట్సోర్సింగ్ ఉద్యోగాలలో చదువుకున్న ముస్లిం యువతీ, యువకులకు అవకాశాలు కల్పిస్తామన్నారు. రాష్ట్రంలో అందరూ బాగుండాలని అల్లాను ప్రార్థిస్తున్నాని తెలిపారు. అనంతరం మంత్రి నల్గొండ పట్టణంలోని 22 వ వార్డు కౌన్సిలర్ మసద్ నివాసానికి వెళ్లి బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేసారు. మంత్రి వెంట ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఉన్నారు. మంత్రితోపాటు , జిల్లా ఎస్పీ చందనా దీప్తి, రెవిన్యూ అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్, ఏఎస్పి రాములు నాయక్, నల్గొండ ఆర్డీవో రవి, నల్గొండ ఎమ్మార్వో శ్రీనివాస్, మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్ లు ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు.