బాలసాహితీ యజ్ఞం

సాహిత్య ప్రపంచంలో నేడు బాల సాహిత్యం ప్రముఖ పాత్ర పోషిస్తోంది. మన వెయ్యేళ్ళ సాహిత్యానికి భవిష్యత్‌లో పాఠకుల కరువు లేకుండా బాలలను తయారు చేస్తోంది. విలువల నందించే బాల సాహిత్య రచన ఆషామాషీ కాదు. ఎంతో బాధ్యతాయుతంగా చెయ్యాలి. ఆ పెను బాధ్యతను ఫలాపేక్ష ఉంచకుండా మన బాల సాహిత్య కారులు భుజాన వేసుకున్నారు. అలాంటి పవిత్ర ప్రవృతి కలిగిన ఆ బాల సాహిత్యకారులు గురించి లోకానికి పరిచయం చెయ్యడానికి చేసే ప్రయత్నమే ‘బాలసాహితీ శిల్పులు’ అనే గ్రంథ ప్రచురణ. దీని రచయిత ప్రముఖ బాల సాహితీ వేత్త పైడిమర్రి రామకృష్ణ.
బాలల కోసం రచనలు చేస్తున్న వారి వివరాలు సాహితీ ప్రియులందరకీ చేరవేయాలనే సదుద్దేశంతో తాను సేకరించిన బాల సాహితీ మూర్తుల వివరాలను అనేక పత్రికల్లో కాలమ్స్‌గా రాశారు. అవే ‘బాలసాహితీ శిల్పులు’ పేరుతో ఒక పుస్తకాన్నే తీసుకువచ్చారు. ఈ పుస్తకాన్ని పరిశీలిస్తే, ఇందులో నాలుగైదు దశాబ్దాల నుంచి బాల సాహిత్యం రాస్తున్న వారి వివరాలున్నాయి. ముందు తరాల రచయితలకు మార్గదర్శకంగా ఉండే కీర్తి శేషులైన వారి వివరాలున్నాయి. అలాగే గత దశాబ్దం నుంచి ముమ్మరంగా రాస్తున్న కొత్త తరం రచయితల వివరాలున్నాయి.
పైడిమర్రి తాను సేకరించిన వివరాలతో పాటు రచయిత కథనో, గేయాన్నో, గేయకథనో కూడా ఇచ్చి ఉంటే ‘బాల సాహితీ శిల్పులు’ గ్రంథం మరింత గొప్పగా ఉండేదనిపించింది. ఇక ముందు తెచ్చే భాగాలకు, మలి ముద్రణకు ఆ పని చేసి ఒక మంచి రికార్డు తెలుగు బాల సాహిత్యానికి అందజెయ్యాలని ఆశిస్తున్నాను. బాలసాహిత్యంలో అవిరళ కృషి చేస్తున్న పైడిమర్రి రామకృష్ణ ‘బాలసాహితీ శిల్పులు’ గ్రంథం రచనలో సరళమైన భాషను, అందమైన శైలిని అలవోకగా ప్రదర్శించి పెద్దలనే కాదు, పిల్లలను కూడా ఆకట్టుకొనే ప్రయత్నం చేశారు. అందుకు ఆయనకు అభినందనలు తెలుపుతున్నాను.
112 పేజీలు గల ‘బాల సాహితీ శిల్పులు’ అనే ఈ పుస్తకానికి డాక్టర్‌ ఎన్‌.గోపీ గారి ‘బంగారు మర్రి’ ముందు మాట ఒక ధృవ పత్రమే. ఈ బంగారు మర్రికి 101 ఊడలున్నాయి. ప్రతి ఊడకు ఒక బాల సాహితీ వేత్త అంటి పెట్టుకొని వెలుగుతూనే ఉంటాడు. ఆ వెలుగులతో మన తెలుగు బాలసాహిత్యానికి కొత్త కొత్త మెరుగులు దిద్దుతుండాలి. పరిచయకర్త పైడిమర్రి రామకృష్ణ గారే సొంతంగా ఈ పుస్తకాన్ని ప్రచురించారు. పుస్తకం కావలసిన వారు 92475 64699 సెల్‌ నెంబరుకు సంప్రదించవచ్చు.
– బెలగాం భీమేశ్వర రావు, 099895 37835

Spread the love