నవతెలంగాణ- హైదరాబాద్: బల్కంపేట ఎల్లమ్మ రథోత్సవం బుధవారం సాయంత్రం నేత్రపర్వంగా సాగింది. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పూజలు నిర్వహించి అమ్మవారి రథాన్ని లాగి రథోత్సవాన్ని ప్రారంభించారు. రథం ముందు డప్పు చప్పుళ్లు, కళాకారుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. రథోత్సవాన్ని తిలకించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఈ సందర్భంగా ఎల్లమ్మ అమ్మవారి కల్యాణం, రథోత్సవం ప్రశాంతంగా నిర్వహించడంపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారులకు అభినందనలు తెలిపారు. భక్తులు ఎలాంటి అసౌకర్యానికి, ఇబ్బందులకు గురికాకుండా ఏర్పాట్లను చేసిన జీహెచ్‌ఎంసీ, విద్యుత్, దేవాదాయ శాఖ, పోలీస్, ట్రాఫిక్ పోలీస్, ఆర్అండ్‌బీ, వాటర్ వర్క్స్, సమాచార శాఖ, అగ్నిమాపక శాఖ అధికారులను అభినందించారు. అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు, భక్తులకు సేవలను వలంటీర్లు అందించారు. ఆలయ కమిటీ సభ్యులు, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు ధన్యవాదాలు తెలిపారు.