కన్నుల పండుగగా బల్కంపేట ఎల్లమ్మ కల్యాణం

– పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి తలసాని శ్రీనివాస్‌ దంపతులు
– హాజరైన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి
నవతెలంగాణ-బేగంపేట్‌
హైదరాబాద్‌ బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి ఆలయంలో ఎల్లమ్మ కల్యాణం మంగళవారం కన్నుల పండుగగా జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, స్వర్ణ దంపతులు పట్టు వస్త్రాలను సమర్పించారు. మంత్రి దంపతులకు ఆలయ పండితులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అమ్మవారికి వస్త్రాలు సమర్పించిన అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి కల్యాణంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, మేయర్‌ విజయలక్ష్మి పాల్గొన్నారు. అలాగే వివిధ ప్రాంతాల నుంచి పెద్దసంఖ్యలో సందర్శకులు అమ్మవారి కల్యాణాన్ని తిలకించేందుకు వచ్చారు. దాంతో ఆలయ ప్రాంతాలు జనసంద్రంగా మారాయి. మంత్రి పర్యవేక్షణలో అన్ని ఏర్పాట్లు చేశారు. ఆలయ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్‌ పోలీసులు ఆంక్షలు విధించారు. భారీ బందోబస్తు నిర్వహించారు. ఈ కల్యాణోత్సవంలో డిప్యూటీ మేయర్‌ మోతే శ్రీలత రెడ్డి, దేవాదాయ శాఖ కమిషనర్‌ అనిల్‌కుమార్‌, కార్పొరేటర్‌లు కొలన్‌ లక్ష్మి బాల్‌రెడ్డి, మహేశ్వరి, మాజీ కార్పొరేటర్‌ నామన శేషుకుమారి తదితరులు పాల్గొన్నారు.
2,043 దేవాలయాలకు ధూపదీప నైవేద్య పథకం అమలు
నేటి ‘దశాబ్ది’లో ఆధ్యాత్మిక దినోత్సవం
రాష్ట్రంలో కొత్తగా 2,043 దేవాలయాలకు ధూప దీప నైవేద్య పథకం ప్రారంభమవుతున్నది. బుధవారం యాదాద్రిలో జరిగే ఆధ్మాత్మిక దినోత్సవ వేడుకల్లో మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి పాల్గొంటారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకల్లో భాగంగా బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆలయాల్లో ఆధ్యాత్మిక దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. దేవాలయాల అలంకరణ, వేద పారాయణం, అభిషేకాలు, హౌమాలు, హరికథలు, కవి సమ్మేళనాలు, సత్కారాలు, శాస్త్రీయ సంగీతం- నత్య కార్యక్రమాలు నిర్వహిస్తారు. ప్రస్తుతం రాష్ట్రంలో 3,645 దేవాలయాలకు ధూపదీప నైవేద్య పథకం వర్తిస్తుంది. కొత్తగా 2040 దేవాలయాలు ఈ జాబితాలో చేరుతున్నాయి. మొత్తంగా 6,661 దేవాలయాలకు ధూప దీప నైవేద్య పథకం అమలు కానుంది. దీనివల్ల ధూప దీప నైవేద్య అర్చకుల వేతనాలు రూ.6 వేల నుంచి రూ.10 వేలకు పెంచుతారు. దీన్ని త్వరలో అమలు చేస్తామని దేవాదాయ మంత్రి తెలిపారు.

Spread the love