ఆ స్మార్ట్‌ వాచ్‌ల అమ్మకాలపై నిషేదం

నవతెలంగాణ హైదరాబాద్:  అమెరికాకు చెందిన టెక్‌ దిగ్గజం యాపిల్‌ (Apple)కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఈ కంపెనీకి చెందిన రెండు స్మార్ట్‌ వాచ్‌ (Smart Watches)లపై విధించిన నిషేధాన్ని ఎత్తివేసేందుకు బైడెన్‌ (Joe Biden) సర్కారు నిరాకరించింది. దీంతో డిసెంబర్ 26నుంచే ఆ వాచ్‌ల విక్రయాలపై నిషేధం అమల్లోకి వచ్చింది. అమెరికాలో ‘న్యూఇయర్‌ హాలిడే’ వేళ ఈ నిషేధం పడటంతో యాపిల్‌ భారీగా నష్టపోయే అవకాశముంది. యాపిల్‌ ఇటీవల విడుదల చేసిన సిరీస్‌ 9, అల్ట్రా 2 వాచ్‌లకు పేటెంట్‌ సమస్య ఎదురైంది. వీటిల్లోని బ్లడ్‌ ఆక్సిజన్‌ స్థాయిలను కొలిచే ఫీచర్‌ విషయంలో తమ పేటెంట్‌ను యాపిల్‌ ఉల్లంఘించిందంటూ ‘మాసిమో కార్పొరేషన్‌’, మరో కంపెనీ దావా వేశాయి. దీంతో ఈ రెండు మోడళ్లపై ఇంటర్నేషనల్‌ ట్రేడ్‌ కమిషన్‌(ITC) అక్టోబరులో నిషేధం విధించింది. అయితే, దీనిని పునఃసమీక్షించేందుకు 60 రోజుల గడువు విధించింది. ఈ నిషేధాన్ని తొలగించేలా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు వీటో అధికారం ఉంది. కానీ, యాపిల్ విషయంలో జోక్యం చేసుకునేందుకు వైట్‌హౌస్‌ తాజాగా నిరాకరించింది. మరోవైపు, ఈ వాచ్‌ మోడళ్లపై నిషేధం విధిస్తూ ఐటీసీ తీసుకున్న నిర్ణయంలో యూఎస్‌ ట్రేడ్‌ రిప్రజెంటేటివ్‌ కేథిరన్‌ తాయ్‌ ఎలాంటి మార్పులు చేయలేదని అధికారులు వెల్లడించారు. దీంతో వీటి విక్రయాలపై డిసెంబరు 26 నుంచి నిషేధాజ్ఞలు అధికారికంగా అమల్లోకి వచ్చినట్లయ్యింది.

Spread the love