బాంచన్‌ దొర అన్న వారే…బంధుకులు పట్టారు

– రజాకార్ల దమనకాండ
– స్థావరాలుగా రాచకొండ గుట్ట
నవతెలంగాణ- సంస్థాన్‌ నారాయణపురం
బాంచన్‌ నీ కాల్మొక్త దొర అన్నవారే కన్నెర్ర చేసి కాలర్‌ పట్టి ఖబర్దార్‌ అని తిరగబడే స్థాయికి ఈ ప్రాంతం ప్రజా ఉద్యమాలకు ఊతమిచ్చింది.ఎందరో మహానుభావుల ప్రాణ త్యాగం వల్ల పరాయి పాలనకు తెరపడింది.1947 ఆగస్టు 15న దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటికీ తెలంగాణ ప్రజలకు మాత్రం రాలేదు.1948 సెప్టెంబర్‌ 17న తెలంగాణ సంస్థానం విలీనమైంది. అంతకు ముందు తెలంగాణలో అరాచకం, బానిసత్వం పెచ్చు మీరింది.బ్రిటిష్‌ తెల్లదొరలు దేశాన్ని వదిలి వెళ్ళినా వారి పాలనలో హైదరాబాద్‌ సంస్థానాన్ని ఏలిన నైజంలు మాత్రం వెళ్లకుండా స్వతంత్రుడనని ప్రకటించుకున్నారు. నైజాం నవాబులు హైదరాబాద్‌ సంస్థానాన్ని తన గుప్పిట్లో పెట్టుకుని తెలంగాణ ప్రజలను పీడించ సాగారు. అతని తొత్తులైన దేశ్‌ పాండే, సర్‌ దేశ్‌ ముఖ్‌, జాగిర్దారులు చేసిన దౌర్జన్యాలకు ప్రజలు బెంబేలెత్తిపోయారు. ధన మాన ప్రాణాలను కోల్పోయారు.ఎదురు తిరిగిన వారిని పిట్టలు కాల్చినట్టు కాల్చేవారు. నైజాం నవాబు ఉద్యోగులు పోలీసులకు, రజాకార్లకు తోడై ప్రజల రక్తాన్ని జలగల పీల్చి పిప్పి చేశారు.
రజాకార్ల దమనకాండ
భారత యూనియన్‌లో హైదరాబాదును విలీనం చేయడానికి ససేమిరా అంగీకరించని నైజాం నవాబుల పాలనలో రైతులు,పాలేర్లు,కూలీలు ప్రజలు బానిసలయ్యారు. రైతులకు అవసరమైన సమయంలో అప్పులు ఇచ్చి దానికి వడ్డీ చక్రవడ్డీ కలిపి వసూలు చేసేవారు. ఇదేమని ప్రశ్నిస్తే వారిని చిత్రహింసలు పెట్టేవారు. మహిళలపై అత్యాచారాలు చేసేవారు. ప్రతిఘటించిన వారిని నిట్ట నిలువునా కాల్చి చంపేవారు. భువనగిరి తాలూకా నుండి జమిందార్‌ ఖాజాపాష రజాకార్ల సాయంతో గ్రామాలను ముట్టడించి దోచుకోవడం ప్రారంభించారు.వేలాది ఎకరాల భూమిని ఆక్రమించుకున్నాడు. బీబీనగర్‌ గ్రామాన్ని పూర్తిగా దోచుకున్నాడు. ఎదురు తిరిగిన ఎందరినో చంపాడు. అనంతరం ఆ గ్రామాన్ని అగ్నికి ఆహుతి చేశాడు. నైజాం పాలకుల దమనకాండ కు విసుగెత్తిన తెలంగాణ ప్రజలు తిరగబడ్డారు. అనగదొక్కబడిన రైతన్న సేద్యం వదిలి సాయుధుడు అయ్యాడు.ఈ దశలోనే కమ్యూనిస్టులు ప్రజా ఉద్యమాలను ప్రారంభించారు.ప్రతి పల్లెలో తిరిగి పల్లె సుద్దుల ద్వారా ప్రజలను సమరోన్మొక్కులను చేశారు.కమ్యూనిస్టులు గెరిల్లా దళాలను ఏర్పాటు చేశారు. నైజాం దళాల పై తిరగబడ్డారు.నైజాం దళాలు గుర్రాలపై గ్రామాలకు వస్తుండగానే మహిళలు కళ్లల్లో కారం చల్లేవారు. రోకలితో కొట్టేవారు. ఆయుధాలు లేని ప్రజలు వడిసెల రాళ్లతో గురి చూసి కొట్టేవారు. రజాకార్లను ఎదుర్కొనడానికి ప్రజలు ఆయుధాలను పట్టుకోవడం తప్పలేదు. ఆయుధాల కోసం యాదగిరిగుట్ట పరిధిలోని వంగపల్లి రైల్వే స్టేషన్‌ పై,మామిళ్లగూడెం పోలీస్‌ స్టేషన్‌ పై దాడి చేసి ఆయుధాలను సమకూర్చుకున్నారు. అడ్డగూడూరు, బిక్కపల్లి మామిడి తోటలోని క్యాంపు లపై దాడి చేశారు.
స్థావరాలుగా రాచకొండ గుట్ట
తెలంగాణ రైతాంగ సాయిధ పోరాట దళాలకు రాచకొండ గుట్టలు స్థావరాలగా ఉండేవి. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో రజాకార్లపై దాడి జరిపిన సాయుధ గెరిల్లా దళాలు రాచకొండ గుట్టల్లోనే తల దాచుకునేవారు.రాచకొండ గుట్టలోని పెండ్లికొండ గుట్టపై కే.కష్ణమూర్తి పెళ్లి జరిగినందున ఆగుటకు పెండ్లికొండ అనే పేరు వచ్చింది. అప్పటి కమ్యూనిస్టు నాయకుడు బొమ్మగాని ధర్మ బిక్షం ఆధ్వర్యంలో రాచకొండలోని నెళ్దాంపహడ్‌ ప్రాంతంలో పేదలు వందలాది ఎకరాల భూమిలో ఎర్రజెండాలు పాతి భూమి ఆక్రమించుకున్నారు. మండలంలోని పుట్టపాక కేంద్రంగా నరహంతక రజాకార్ల మూకలు సాగించిన అరాచకాలను కమ్యూనిస్టు దళాలు ప్రతిఘటించాయి. ఈ ప్రాంతంలో కమ్యూనిస్టు నాయకులైన నంద్యాల శ్రీనివాస్‌ రెడ్డి,ఎలమంద, జంగారెడ్డి నాయకత్వంలో పుట్టపాక లో నిర్వహించిన వందలాదిమంది రజాకార్ల క్యాంపుపై దాడి చేశారు. రజాకార్లను అదే ఇంట్లో బంధించి నిప్పంటించారు. ఈ చర్య రజాకార్లలో తీవ్రభయాన్ని పుట్టించింది. ప్రజలకు ఆత్మస్థైర్యాన్ని నింపింది. వాళ్ల పెళ్లి గ్రామంలో జరుగుతున్న రజాకార్ల ఆగడాలను మట్టుపెట్టేందుకు కమ్యూనిస్టు దళాలు వ్యూహం పన్నాయి. వాయిలపెళ్లి గ్రామాన్ని లూటి చేసేందుకు వచ్చిన రజాకార్ల గుంపుపై కమ్యూనిస్టు దళం దాడి చేసింది. కొంతమంది రజాకార్లను చంపింది. గుండ్రాంపల్లిని కేంద్రంగా చేసుకొని నారాయణపురం, మునుగోడు, చండూరు ప్రాంతాల్లో రజాకార్లు వీర విహారం చేశారు. ప్రజా కంఠకునిగా మారిన పాశం పుల్లారెడ్డిని కమ్యూనిస్టులు హతమార్చి మునుగోడు మండలం కొంపెల్లి గ్రామంలో ఖననం చేశారు. ఒకరోజు రాచకొండ గుట్టల్లో సమావేశమైన సాయుధ దళాలకు అన్నం పెట్టిన వాడే ద్రోహం తలపెట్టాడు. రాచకొండలో కమ్యూనిస్టు సాయిధరాలు సమావేశమైనట్టు యూనియన్‌ మిలిటరీ సైన్యానికి సమాచారమిచ్చాడు. దీంతో యూనియన్‌ మిలటరీ సైన్యం రాచకొండ గుట్టలను చుట్టుముట్టాయి. అప్పటి సాయుధ గిరిల్ల యోధులైన గుప్తా సీతారాంరెడ్డి, డాక్టర్‌ రాజ బహదూర్‌, పైల రామచంద్రారెడ్డి, కే.కష్ణమూర్తి లు సైన్యం చేతికి చిక్కారు. వారిని నెల రోజులపాటు పలు చిత్రహింసలకు గురి చేశారు. గుత్తా సీతారాంరెడ్డి,పైళ్ల రామచంద్రారెడ్డి లను రాచకొండ గుట్టల్లోకి తీసుకుపోయి కాల్చి చంపారు. ఆయన జ్ఞాపకార్థం పుట్టపాకలో స్మారక స్థూపం నిర్మించారు.

Spread the love