సైన్యం చేతుల్లోకి బంగ్లాదేశ్‌

Bangladesh in the hands of the army– కుప్పకూలిన హసీనా సర్కార్‌
– రాజీనామా చేసి దేశం విడిచిన ప్రధాని
– ధ్రువీకరించిన ఆర్మీ, తాత్కాలిక ప్రభుత్వ ఏర్పాటుకు యత్నాలు
– విద్యార్థుల ఆందోళనలకు తలవంచిన ప్రభుత్వం
– దేశమంతా ఇంటర్‌నెట్‌ బంద్‌
– హసీనా ఆశ్రయానికి భారత్‌ నిరాకరణ
– వేగంగా మారుతున్న పరిణామాలు
– కోటా తెచ్చిన తంటా..
బంగ్లాదేశ్‌లో గత 24గంటల్లో పరిణామాలు వేగంగా మారిపోయాయి. ప్రభుత్వ ఉద్యోగాల్లో ప్రతిపాదిత రిజర్వేషన్‌ కోటా తెచ్చిన తంటాలతో షేక్‌ హసీనా ప్రభుత్వం కుప్పకూలింది. విద్యార్దుల ఆందోళనలకు తలొగ్గాల్సి వచ్చింది. ఆందోళనకారులు తమ పట్టు విడవకపోవడంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో ప్రధాని హసీనా తన పదవికి రాజీనామా చేసి, దేశం కూడా విడిచివెళ్ళినట్టు వార్తలందాయి. సైన్యం ఈ విషయాలను ధ్రువీకరించింది. అయితే ఆమె ఎక్కడకు వెళ్ళారన్నదానిపై స్పష్టత లేదు. భారత్‌లో ఆశ్రయం పొంది వుంటారని వార్తలు వినిపిస్తున్నా, ఇప్పటి వరకూ ఎలాంటి నిర్దిష్టమైన సమాచారం లేదు. ప్రధాని రాజీనామా చేశారని తెలియగానే వేలాదిమంది ఆందోళనకారులు ప్రధాని అధికార నివాసంలోకి చొచ్చుకువెళ్లారు.

ఢాకా : అంతకుముందు హసీనా రాజీనామా డిమాండ్‌ చేస్తూ, లాంగ్‌ మార్చ్‌ టు ఢాకా పేరుతో ఆందోళనకారులు ప్రదర్శన చేపట్టారు. వారిపై పోలీసులు జరిపిన కాల్పుల్లో ఆరుగురు మరణించారు. రిజర్వేషన్‌ వ్యవస్థపై నిరసన వ్యక్తం చేస్తూ స్టూడెంట్స్‌ అగైనెస్ట్‌ డిస్క్రిమినేషన్‌ బ్యానర్‌పై విద్యార్ధి లోకం ప్రారంభించిన ఆందోళనలు, నిరసనలు, క్రమేపీ ప్రజా ఉద్యమంగా రూపుదాల్చింది. నిరసనలు,ఆందోళనలను అణచివేసే లక్ష్యంతో ప్రభుత్వం మొత్తంగా ఇంటర్‌నెట్‌ సహా సామాజిక మాధ్యమాలపై ఆంక్షలు విధించింది. గత నెల్లో ప్రారంభమైన ఈ ఆందోళనల్లో ఇప్పటివరకు 300మంది వరకు మరణించారు. ఆదివారం నాటి ఘర్షణల్లోనే 94మంది చనిపోయారు. బంగ్లాదేశ్‌ ప్రధాని నివాసంలోకి చొచ్చుకు వెళ్ళి విధ్వంసం సృష్టించిన కొంతమంది దుండగులుహౌం మంత్రి నివాసంపై కూడా దాడి చేశారు. ధనమండిలో అవామీ లీగ్‌ పార్టీ కార్యాలయానికి నిప్పు పెట్టారు.
అధిక నిరుద్యోగం, అవినీతి వంటి సమస్యలతో ఇప్పటికే అతలాకుతలమవుతున్న బంగ్లాదేశ్‌లో తాజా అనూహ్య పరిణామాలు మరింత అస్థిరతను కలగచేసే ప్రమాదం పొంచి వుంది. తన సోదరితో కలిసి హసీనా మిలటరీ హెలికాప్టర్‌లో కూర్చున్న దృశ్యాలు టివిలో ప్రసారమయ్యాయి. బంగ్లా మిలటరీ చీఫ్‌ జనరల్‌ వాకర్‌ ఉజ్‌ జమాన్‌ మాట్లాడుతూ, తాత్కాలిక ప్రభుత్వ ఏర్పాటుపై దేశాధ్యక్షుడి సూచనలు కోరనున్నట్లు చెప్పారు. మిలటరీ ప్రస్తుతం పరిస్థితులను చేతుల్లోకి తీసుకుందని బంగ్లాదేశ్‌ ఆర్మీ చీఫ్‌ ప్రకటించారు. ఆ వెంటనే స్టూడెంట్స్‌ అగైనెస్ట్‌ డిస్క్రిమినేషన్‌ స్పందిస్తూ, ఆందోళన చేస్తున్న విద్యార్ధులు, పౌరులతో చర్చలు జరిపిన తర్వాతనే అధికారం బదలాయింపు జరగాలని స్పష్టం చేసింది. ఈ మేరకు గ్రూపు కో ఆర్డినేటర్‌ నహిద్‌ ఇస్లామ్‌ ఒక ప్రకటన జారీ చేశారు. తమకు కావాల్సింది హసీనా రాజీనామా మాత్రమే కాదని, ఫాసిస్ట్‌ పాలనను అంతమొందించాలన్నదే తమ లక్ష్యమని చెప్పారు. బంగ్లాదేశ్‌లో ప్రజాస్వామ్య రాజకీయ వాతావరణం నెలకొనాలని ఆకాంక్షించారు. దేశంలో రాజకీయ పార్టీలన్నీ ప్రజాస్వామ్యాన్ని, లౌకికవాదాన్ని నెలకొల్పాల్సిన అవసరం వుందని ప్రముఖ రచయిత్రి తస్లీమా నస్రీన్‌ వ్యాఖ్యానించారు. ప్రధాని షేక్‌ హసీనా పతనానికి ఆమే కారణమని విమర్శించారు.
బంగ్లాదేశ్‌లో నెలకొన్న రాజకీయ అనిశ్చితి నేపథ్యంలో బంగ్లాతో రైలు సర్వీసులను భారత్‌ రద్దు చేసింది. ఢిల్లీలోని బంగ్లాదేశ్‌ హై కమిషన్‌ వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు.
ప్రముఖ రచయిత, విద్యావేత్త ప్రొఫెసర్‌ సాలిముల్లా ఖాన్‌ నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడనుందని బంగ్లా రాజకీయ పార్టీ బిఎన్‌పి వర్గాలు తెలిపాయి. ఆర్మీ చీఫ్‌తో సమావేశంలో తమ పార్టీ ప్రతినిధులు కూడా పాల్గొన్నారని చెప్పారు. కాగా బంగ్లా ఆర్మీ చీఫ్‌ వాకర్‌ ఉజ్‌ జమాన్‌ టివిలో ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ ఆర్మీ తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని చెప్పారు.
జాతీయ ప్రభుత్వ రూపకల్పనలో నిరసనకారులు
బంగ్లాదేశ్‌లో కొత్తగా ఏర్పడనున్న జాతీయ ప్రభుత్వ రూపకల్పనలో యాంటీ డిస్క్రిమినేషన్‌ స్టూడెంట్స్‌ మూవ్‌మెంట్‌ నిర్వాహకులు కూడా పాలు పంచుకోనున్నారు. నిర్వాహకుల్లో ఒకరైన అసిఫ్‌ మహ్మద్‌ ఈ విషయం వెల్లడించారు. త్వరలోనే విద్యార్ధులు, టీచర్ల ప్రతినిధులతో ఆర్మీ చీఫ్‌ చర్చలు జరుపుతారని ఐఎస్‌పిఆర్‌ ఒక ప్రకటనలో వెల్లడించింది.
ఢిల్లీలో హసీనా?
బంగ్లాదేశ్‌ ఎయిర్‌ఫోర్స్‌కి చెందిన రవాణా విమానంలో ఢాకా నుండి బయలుదేరిన హసీనా ఢిల్లీలో ఆగుతారని భావిస్తున్నట్లు భారత పౌర విమానయాన వర్గాలు తెలిపాయి. అయితే ఈ విమానంలోనే భారత్‌ దాటి వెళతారా లేక ఇక్కడ నుండి వేరే విమానంలో లండన్‌ వెళతారా అనేది తెలియరాలేదు. ఢిల్లీకి సమీపంలోని హిండర్‌ ఎయిర్‌ బేస్‌లో ఆమె దిగుతారని భావిస్తున్నారు.
భారత్‌లో ఆశ్రయం నిరాకరణ
హసీనా భారత్‌లో ఆశ్రయం కల్పించేందుకు ప్రభుత్వం నిరాకరించినట్లు ఎబిపి లైవ్‌ అనే ఒక న్యూస్‌ సైట్‌ పేర్కొంది. ఈ పరిస్థితుల్లో ఆమె యూరప్‌ వెళ్లే అవకాశం వుందని సంబంధిత వర్గాలను ఉటంకిస్తూ తెలిపింది.
ఢాకాలోని హజరత్‌ షాజలాల్‌ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని సాయంత్రం ఆరు గంటల నుండి ఆరు గంటల పాటు మూసివేసి వుంచినట్లు ఐఎస్‌పీఆర్‌ తెలిపింది. విమానాశ్రయంలోని అన్ని కార్యకలాపాలను నిలిపివేసినట్లు కెప్టెన్‌ కమ్రుల్‌ ఇస్లామ్‌ తెలిపారు.

Spread the love