ఎందుకో ఇవాళ
నా బాల్యం నాటి
పల్లెలోని క్షుర కార్మికుడు
అంజయ్య గుర్తుకొస్తున్నాడు.
ఆ సందులోంచి వెళ్తుంటే
అతని ఇంటి అరుగు మీద
క్యూ ప్రకారం కూర్చున్న జ్ఞాపకం.
ఆ రోజుల్లో పైసలెక్కడివి!
మా నాయన యేడాదికోసారి
గింజలిచ్చేవాడు.
ఇప్పుడు పరిస్థితి మారింది
అతని మనుమల తరం వచ్చేసింది
పెద్ద మనుమడు నా మిత్రుడే
షోలాపూర్ వెళ్లి
పని నేర్చుకొని వచ్చాడు
క్షవరం డబ్బుల్తో
అప్పుడప్పుడు నాకు సినిమాలు చూపించేవాడు
ఈ వత్తిలోనే
ఇద్దరు తమ్ముళ్లను చదివించాడు.
కొత్త కుర్చీ మీద కూర్చుంటే
సింహాసనం మీద
కొలువుదీరినట్టుంటుంది.
నాకు ఆ గుడ్డే కావాలంటాను
వొంటి నిండా గులాబీలు
కప్పినట్టుంటుంది.
తల మీద మెషిన్ ను
కసకసలాడిస్తుంటే
వాడి చేతి నరాలు
లయాత్మకంగా నాట్యం చేస్తాయి
వెంట్రుకలు గుత్తులు గుత్తులుగా
రాలి పడతాయి.
చెవి పక్కన కత్తెర వేస్తుంటే
పిట్టలు కిచకిచలాడినట్టుంటుంది.
గడ్డానికి పూసే క్రీంను
కాగితానికి పూస్తుంటే
మీగడ తరకలు తయారైనట్టుంటుంది.
క్షవరం ముగిసిన ఒక సాయంత్రం
వాడు నాతో అన్నాడు
పొద్దటి నుంచి చేసి చేసి
చేతులు గుంజుతున్నాయిరా అని
నిలబడి నిలబడి
వాడి కాళ్లలో వెరికోస్ తేలాయి
నా ఉత్సాహమంతా ఉడిగిపోయింది.
ఇంటికి చేరి
అద్దంలో చూసుకుంటే
దానిలో వాడి ముఖమే
కనిపిస్తుంది నాకు.
– డా. ఎన్.గోపి