మహిళలకు ప్రాథమిక ఆదాయ పథకం

–  15న ప్రారంభించనున్న తమిళనాడు ప్రభుత్వం
–  కోటి మందికి పైగా మహిళలకు లబ్ది
చెన్నై : మహిళలకు ఆర్థిక చేయూతనందించే పథకానికి తమిళనాడు సర్కారు సిద్ధమైంది. కలైంజర్‌ ఉరిమై తొగై (మహిళల ప్రాథమిక ఆదాయం) పథకాన్ని ప్రభుత్వం తీసుకురానున్నది. ఈ పథకాన్ని ఈనెల 15న తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే వ్యవస్థాపకుడు సి.ఎన్‌ అన్నాదురై జయంతి రోజున ఆ రాష్ట్ర సీఎం ఎం.కె స్టాలిన్‌ ప్రారంభించనున్నారు. దీని ద్వారా అర్హులైన 1.06 కోట్ల మంది మహిళలకు నెలకు రూ.1000 చొప్పున ప్రభుత్వం అందించనున్నది. ఈ పథకం పేదరికాన్ని నిర్మూలించడానికి, లింగ సమానత్వాన్ని పెంచడానికి ఒక సాధనమని తమిళనాడు ప్రభుత్వం అంటున్నది. అన్నాదురై జన్మస్థలం కాంచీపురంలో జరిగిన ఈ ప్రయోగం.. సామాజిక న్యాయం పట్ల డీఎంకేకు ఉన్న చారిత్రక నిబద్ధతను నొక్కి చెప్పడానికి ఒక సందర్భమని డీఎంకే తెలుపుతున్నది.
చెన్నైలోని సెక్రటేరియట్‌లో జరిగిన సమావేశంలో స్టాలిన్‌ మాట్లాడుతూ.. పథకం అమలును ప్రభుత్వం నిశితంగా ప్లాన్‌ చేసిందనీ, ప్రారంభించిన తేదీ నుంచి నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోకి నిధులు జమ అవుతాయని చెప్పారు. ఈ పథకానికి తొలి బడ్జెట్‌లో ఏడాదికి రూ.7,000 కోట్లు కేటాయిస్తుండగా, ప్రస్తుత ఏడాది బడ్జెట్‌పై ప్రభావం పడకుండా రూ.12,000 కోట్లకు పెంచాలని సీఎం సూచించారు.
కుటుంబ వార్షికాదాయం రూ. 2.5 లక్షల లోపు ఉన్న మహిళలు, 5 ఎకరాలు (వెట్‌ల్యాండ్‌) లేదా 10 ఎకరాలు (డ్రైల్యాండ్‌) మించని భూమి ఉన్నవారు, 3,600 యూనిట్లలోపు వార్షిక గహ విద్యుత్‌ వినియోగం, 21 ఏండ్ల కంటే ఎక్కువ వయస్సు ఉన్న మహిళలు అర్హులు. నిరాశ్రయులైన వ్యక్తులు, ట్రాన్స్‌జెండర్లు, ఒంటరి మహిళలు ఆధారంగా ఉన్న కుటుంబాలు కూడా అర్హులే.
ప్రభుత్వ పథకంపై అక్కడి మహిళలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ పథకం మహిళలకు ఆర్థికంగా చేయూతనందిస్తుందని అంటున్నారు. దేశంలో లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్నవేళ ఇది అధికార కూటమికి మహిళల్లో మంచి గుర్తింపును తీసుకొస్తుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Spread the love