బతుకునిచ్చే పండుగ బతుకమ్మ

Batukamma is the festival of survival– మంత్రి సీతక్క
– టీజీవో భవన్‌ వద్ద ఘనంగా బతుకమ్మ సంబురాలు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
బతుకునిచ్చే పండుగ బతుకమ్మ అని పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క (దనసిరి అనసూయ) అన్నారు. చెరువుకు బతుకమ్మకు గొప్ప అనుబంధం ఉందన్నారు. బతుకమ్మను భవిషత్తు తరాలకు అందింద్దామనీ, చెరువులను కాపాడుకుందామని ఆమె పిలుపునిచ్చారు. చెరువులు, పర్యావరణాన్ని పరిరక్షించే బాధ్యత అధికారులపై ఉందని చెప్పారు. మంగళవారం హైదరాబాద్‌ నాంపల్లిలోని టీజీవో భవన్‌ వద్ద టీజీవో కేంద్ర సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బతుకమ్మ సంబురాలు ఘనంగా జరిగాయి. మంత్రి సీతక్క పాల్గొని ఉద్యోగులతో కలిసి బతుకమ్మ ఆడుతూ సందడి చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పూర్వీకులు ఇచ్చిన గొప్ప ఆచారం, సంస్కృతి బతుకమ్మ అని అన్నారు. భవిష్యత్తు తరాలకు ఈ పండుగను అందించడమే అందరి బాధ్యత అని చెప్పారు. చెరువులను కబ్జాలు కాకుండా కాపాడుకుందామన్నారు. చెరువులు కనుమరుగయ్యే పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. వాటికి పూజలు చేసే పండుగ బతుకమ్మ అని వివరించారు. తెలంగాణ అంటేనే చెరువులు, బతుకమ్మ అని గుర్తు చేశారు. ప్రజల జీవన శైలి చెరువులపై ఆధారపడేదని చెప్పారు. హైదరాబాద్‌కు లేక్‌ సిటీ అనే పేరు ఉండేదని అన్నారు. కానీ ఈరోజు అవి కనుమరుగు అయిపోయాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో టీజీవో మహిళా విభాగం అధ్యక్షురాలు దీపరెడ్డి, కార్పొరేషన్‌ చైర్మెన్లు బండ్రు శోభారాణి, కాలువ సుజాత, టీజీవో నాయకులు శిరీష, సుజాత, పూనమ్‌, జయక్ష, రేవతి, లావణ్య, సబితా, అలివేలు, మహేశ్వరి, శ్రీలీల, పద్మ, స్వర్ణలత ఎంజుల, హేమమాలిని లీలా, సునీతజోషి, చైతన్య, ప్రత్యూషతోపాటు టీజీవో అధ్యక్షులు ఏలూరి శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి ఎ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Spread the love