కరీంనగర్‌ కోటలో… బీసీల కదన భేరి

In Karimnagar Fort... Bheri is the battle of the BCs– తొలి ఎమ్మెల్యేగా వెంకటరామారావు
– ప్రత్యేకత చాటిన చొక్కారావు
– 2009 ఎన్నికల నుంచి ప్రధాన పార్టీల అభ్యర్థులంతా బీసీలే..
– అన్ని పార్టీలనూ ఆదరించిన కరీం’నగరం’ ఓటర్లు
– బీసీ ఓటర్లదే తీర్పు అయినా మైనార్టీల ఓట్లూ కీలకమే!
– ప్రస్తుతం గంగుల వర్సెస్‌ సంజయ్..
– కాంగ్రెస్‌ అభ్యర్థి తేలితేగానీ చెప్పలేమంటున్న రాజకీయవేత్తలు
ఉద్యమాల పురిటిగడ్డగా పేరున్న కరీంనగర్‌లో ప్రతి ఎన్నికా ప్రతిష్టాత్మకమేనని చెప్పుకోవచ్చు. ఈ నియోజకవర్గంలో 16సార్లు ఎన్నికలు జరగ్గా.. ప్రతిసారీ విలక్షణమైన తీర్పునిస్తూ నాయకులందరినీ, అన్ని పార్టీలనూ ఆదరించిన చరిత్ర కరీంనగర్‌కు ఉంది. ఈ నియోజకవర్గంలో సింహభాగం ఓసీలే గెలిచి వెలమ కంచుకోటగా నిలిచింది. అయితే, 2009 నుంచి వెలమ కంచుకోటలో బీసీ నేతలు ఎంట్రీ ఇచ్చి కదనభేరీ మోగిస్తూ వస్తున్నారు. మూడు ప్రధాన పార్టీలూ బీసీ అభ్యర్థులనే బరిలో నిలుపుతూ వస్తుండగా.. ఇక్కడి జనం బీఆర్‌ఎస్‌ నుంచి గంగులను మూడుసార్లు గెలిపించారు. ప్రస్తుత ఎన్నికల్లోనూ బీఆర్‌ఎస్‌, బీజేపీ నుంచి ఇద్దరు బీసీ నేతలు గంగుల, బండి బరిలోకి దిగుతుండగా.. కాంగ్రెస్‌ నుంచి కూడా బీసీ అభ్యర్థినే నిలిపే అవకాశాలే మెండుగా ఉన్నాయి. ఏదేమైనా కాంగ్రెస్‌ అభ్యర్థి ఎవరో తేలితే… మూడు ప్రధాన పార్టీల మధ్య పోటీ ఉంటుందా? లేక మళ్లీ గంగుల వర్సెస్‌ బండిగా నిలుస్తుందా? అనేది మరికొన్ని రోజులు వేచిచూడాల్సిందే!
నవతెలంగాణ – కరీంనగర్‌ ప్రాంతీయ ప్రతినిధి
కరీంనగర్‌ నియోజకవర్గం నుంచి గెలిచిన నేతల్లో పలువురు ప్రముఖులు రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో రాజకీయ యవనికపై తమదైన ముద్ర వేశారు. అందులో ఎం.సత్యనారాయణ, జువ్వాడి చొక్కారావు, కటకం మృత్యుంజయం పేర్లు ప్రధానంగా వినిపిస్తాయి. ఎంపీ ఎన్నికల్లో రెండుసార్లు పోటీకి దిగిన కేసీఆర్‌ ఘన విజయాన్ని సాధించారు. అందులోనూ ఎం.సత్యనారాయణ విసిరిన సవాల్‌తో రాజీనామా చేసి..ఉప ఎన్నికల్లో భారీ మెజార్టీ సాధించి తెలంగాణ ఉద్యమ ఆకాంక్ష స్థాయిని చాటే అవకాశం కేసీఆర్‌కు ఇక్కడి ఓటర్లు కల్పించారు. అయినప్పటికీ నియోజకవర్గం ఆవిర్భావం నాటి నుంచి భిన్న పార్టీల సభ్యులను ప్రజాప్రతినిధులుగా ఎన్నుకునేందుకు ఇక్కడి ప్రజలు అమితాసక్తిని చూపించిన చరిత్ర కూడా ఉంది. ఒకే వ్యక్తికి రెండు పర్యాయాలు అవకాశమిచ్చినా.. మరో ఎన్నికల్లో వేరే వారిని ఎన్నుకున్నా.. పనితీరు బాగోకుంటే నిర్మోహమాటంగా వేరే అభ్యర్థిని గెలిపించుకున్నా.. అది కరీంనగర్‌ సెగ్మెంట్‌ ఓటర్లకే చెల్లింది. ఆరు దశాబ్దాల రాజకీయ పోరును ఆద్యంతం ఆసక్తికరంగా మార్చుతూ ప్రతి ఎన్నికల్లోనూ విజేత ఎవరనే విషయంలో ఇక్కడి ఓటర్లు చివరి వరకూ ఎడతెగని ఉత్కంఠనే చూపిస్తూ వస్తున్నారు.
వెలమ కంచుకోటలో బీసీల ఎంట్రీ..
2009 ఎన్నికల నుంచి ప్రధాన పార్టీల నుంచి బీసీ నేతలే రంగంలోకి దిగుతూ వచ్చారు. మధ్యలో చలిమెడ లక్ష్మినర్సింహారావు పోటీ చేసినా ఆయన ఓటమిపాలయ్యారు. బీఆర్‌ఎస్‌ తరపున బరిలోకి దిగిన కాపు సామాజిక తరగతికి చెందిన గంగుల మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలవగా.. గౌడ సామాజిక తరగతికి చెందిన పొన్నం ప్రభాకర్‌ 2009లో కరీంనగర్‌ ఎంపీగా గెలిచారు. 2014, 2018 ఎన్నికల్లో బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన కాపు సామాజిక తరగతికి చెందిన బండి సంజయ్ ఓటమి పాలవ్వగా.. 2019 పార్లమెంట్‌ ఎన్నికల్లో ఎంపీగా విజయం సాధించారు. దీంతో వెలమ కంచుకోటలో ఎదిగిన ఈ బీసీ నేతలే ప్రధాన పార్టీలను నడిపిస్తూ వచ్చారు. ప్రస్తుతం బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా గంగుల కమలాకర్‌, బీజేపీ అభ్యర్థిగా బండి సంజరు పేర్లు ఖరారు కాగా.. కాంగ్రెస్‌ అభ్యర్థి తేలలేదు. అయితే టిక్కెట్‌ పోటీలో కొత్తజయపాల్‌రెడ్డి, కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి, ఎమ్మెస్సార్‌ మనువడు రోహిత్‌రావు ఉండగా.. బీసీ సామాజిక తరగతికి చెందిన పురుమళ్ల శ్రీనివాస్‌ కూడా టిక్కెట్‌ ఆశిస్తున్నారు. ఒకవేళ పురుమళ్లకే టిక్కెట్‌ వస్తే కరీంనగర్‌ నియోజకవర్గంలో ముగ్గురు ‘కాపు’ల మధ్య పోటీ నెలకొననుంది.
16సార్లు ఎన్నికలు..ఓటర్ల విభిన్న  తీర్పులు
1952లో కరీంనగర్‌ అసెంబ్లీ నియోజకవర్గం ఏర్పడింది. 2009లో నియోజకవర్గాల పునర్విభజనతో గతంలో ఉన్న తిమ్మాపూర్‌, మానకొండూర్‌ మండలాలు కొత్తగా ఏర్పడిన మానకొండూర్‌ నియోజకవర్గంలో కలవడంతో కరీం’నగరం’, కొత్తపల్లి, కరీంనగర్‌రూరల్‌ మండలాలు మాత్రమే మిగిలాయి. మొత్తంగా 16సార్లు ఎన్నికలు జరిగిన ఈ నియోజకవర్గం నుంచి ప్రధాన పార్టీలు సమఉజ్జీలుగానే నిలుస్తూ వచ్చాయి. ఐదుసార్లు కాంగ్రెస్‌, ఐదుసార్లు టీడీపీ, ఒకసారి స్వతంత్య్ర అభ్యర్థి, మరోసారి సోషలిస్టు పార్టీ, ఇంకోసారి పీడీఎఫ్‌ నేత, మూడుసార్లు బీఆర్‌ఎస్‌ అభ్యర్థులు ఎన్నికయ్యారు. కరీంనగర్‌ నియోజకవర్గ తొలి ఎమ్మెల్యేగా 1952లో పీడీఎఫ్‌ అభ్యర్థి వెంకటరామారావు విజయం సాధించారు. కరీంనగర్‌ ఎమ్మెల్యేగా కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జువ్వాడి చొక్కారావును ఇక్కడి ఓటర్లు ముచ్చటగా మూడుసార్లు గెలిపించారు. 1957లో గెలిచిన ఈయన 1967, 1972 సంవత్సరాల్లో విజయం సాధించి కరీంనగర్‌కు సరికొత్త ఖ్యాతిని ఆ కాలంలో అందించేందుకు ప్రత్యేక చొరవ చూపించారు. నిరాడంబరుడిగా, మంచి నాయకుడిగా మన్ననల్ని పొందారు. ఎంపీగానూ మూడుసార్లు గెలిచి సరికొత్త రికార్డునూ తన ఖాతాలో వేసుకున్నారు. 2009 నుంచి బీఆర్‌ఎస్‌ అభ్యర్థినే ఇక్కడి ఓటర్లు మూడుసార్లు గెలిపించారు.
మీకు తెలుసా…
ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో ప్రధాన పార్టీలకు ఇండిపెండెంట్‌ అభ్యర్థులు ఓ సవాల్‌గా నిలుస్తున్నారు. కారణం.. ప్రధాన పార్టీల అభ్యర్థులు బరిలో దిగిన ప్పటికీ ప్రజాభిమానం సడలని నేతలు కొందరు స్వతంత్ర అభ్యర్థులుగా ఎన్నికల బరిలో దిగి విజయబావుటా ఎగురవేసి తమ సత్తా చాటుకోవడమే. 1952నుంచి ఇప్పటివరకు వరుసగా 10సార్లు జరిగిన ఎన్నికల్లో 15 మంది ఎమ్మెల్యేలుగా గెలిచారు. ఉమ్మడి జిల్లాలో ఉన్న 15 నియోజకవర్గాల్లో 1952లో ఒకరు, 1957,62లతో ఇద్దరు చొప్పున, 1967, 72, 89లో ముగ్గురు చొప్పున విజయం సాధించారు. వీరిలో ఎక్కువ మంది కాంగ్రెస్‌ నుంచి టికెట్‌ ఆశించిన వారే కావడం విశేషం.

Spread the love