నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
వచ్చే ఎన్నికల్లో లబ్దిపొందేందుకే బీసీ భజన చేస్తున్నారని బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ విమర్శించారు.శనివారం హైదరాబాద్‌లోని తమ రాష్ట్ర కార్యాలయంలో విలేకర్ల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలను మాయ చేసేందుకే మంత్రివర్గ ఉపసంఘాలు ఏర్పాటు చేశారన్నారు. ప్రజలను తప్పుదోవ పట్టించొద్దని హితవు పలికారు.
వచ్చే ఎన్నికల్లో సీఎం కేసీఆర్‌ను గద్దెదించాలని పిలుపునిచ్చారు. పోడు భూముల సమస్యలు, ధరణి పోర్టల్, ప్రయివేటు విద్యాసంస్థల్లో ఫీజుల నియంత్రణ, అక్రమ లే అవుట్లు, ప్లాట్లు, గ్రామ కంఠం భూముల క్రమబద్ధీకరణకు వేసిన మంత్రివర్గ ఉపసంఘాలు సిఫారసులను ప్రభుత్వం వెంటనే బయటపెట్టాలని డిమాండ్ చేశారు. అర్హులైన ఆదివాసీ, గిరిజనులకు పోడు పట్టాలు ఇవ్వడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు.రెవిన్యూ అధికారుల తప్పిదాల వల్ల ధరణి పోర్టల్‌లో లక్షలాది ఎకరాల పేదల అసైన్ భూములు నిషేధిత జాబితాలో నమోదయ్యాయని ఆరోపించారు. ఆ జాబితాలో ఉన్న లక్షల ఎకరాల అసైన్డ్ భూములను వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. భూ రికార్డుల నమోదులో జరిగిన పొరపాట్లను సరిచేసేందుకు అనువైన మాడ్యూల్‌ను త్వరగా అందుబాటులోకి తేవటంలో హరీష్ రావు మంత్రివర్గ ఉప సంఘం సిఫార్సులు బుట్ట దాఖలయ్యాయని తెలిపారు. రెండు దశబ్దాలుగా రియల్టర్ల చేతిలో హైదరాబాద్ నగరం చుట్టూ ఉన్న 3,000 చెరువులు ధ్వంసం అయ్యాయని గుర్తుచేశారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ దళితులనుద్దేశించి థర్డ్ క్లాస్ వాళ్లంటూ చేసిన వాఖ్యలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. వారికి క్షమాపణలు చెప్పాలన్నారు. జర్నలిస్టుల దాడులు, పత్రికలు, టీవీల మీద నిషేధం విధించడాన్ని ఖండిస్తున్నామన్నారు. కేసీఆర్‌కు కుల వృత్తులు ఇప్పుడు గుర్తుకు రావటమేంటని ప్రశ్నించారు. భారాస అవినీతి చిట్టాను త్వరలోనే బయట పెడతానని హెచ్చరించారు. టీఎస్పీఎస్సీ పరీక్షలు నిర్వహించడం వెనుక కుట్ర ఉన్నదని విమర్శించారు.